Thursday, June 7, 2012

(సూర్య దినపత్రికలో అచ్చయిన నా కవిత)




నేనూ, నా సముద్రం

ఎక్కడపుట్టిందో, ఎలా పుట్టిందో.....
గుండెల్లోకి చేరుస్తుంటుంది ఓ నిశ్శబ్దాన్ని!
ఏకచేరీలో చూడని
వాయిద్యపరికరాలన్నింటినీ మోసుకొచ్చింది
తనలోనే మోస్తూ, తనే వాయిస్తూ......
పాటమొదల్లోని భీతావహ నిశ్శబ్దం
కొన్ని క్షణాలే....

కంటిబిగువున అదిమిపెట్టలేని దుఃఖంలా
ఫెళ్ళుమన్న గుండె పగిలి రోదించినట్టు
ఉవ్వెత్తున లేచిపడే నిలువెత్తు కెరటం!
వేయి మృదంగాల ఘోషగా ఆరంభమై
శృతిచేసుకుంటున్న సితారలా ఒడ్డుపై వాలిపోతూ.....

ఆలోచనల అల్లరంతా కడుపులోంచి తీసుకొచ్చి వొంపేసేది
జారిపోతున్న కుచ్చెళ్ళని నాపై కుమ్మరించినట్టు 
ఏ రెండుకెరటాలూ వొకేలా ఉండవెందుకని
అడిగినప్పుడల్లా నిస్సహాయంగా వెనకడుగేసింది
బహుశా ఏరెండు కష్టాలూ వొకటి కాదనేమో!

ఇసకమట్టిలో
తన కంటితడీ ఒకేలా ఉండదు
దానివెంటె పరిగెత్తి అలసిపోయి వొచ్చేసేవాణ్ణి
మళ్ళీ నాకునేనే మిగిలానా అని....
అంతలో మళ్ళీ ఓ చిన్న అల
నా పాదాలచుట్టూ, చిన్నపిల్లాడిలా
నాకు ఓదార్పుకోసమన్నట్టు!

సముద్రం స్త్రీ అని అరిచారెవ్వరో దూరంగా
కెరటం వొంపులో అందాన్నే చూసారొ
అలల్లో సుకుమారత్వాన్నే పట్టుకున్నారో.....
అవును--
తెలుపు నలుపుల శబ్దాన్ని
నిశ్శబ్దంగా కలిపేసుకున్న స్త్రీ!

ఆ సంగీతాన్ని నాతోపాటు మోస్తూనే ఉన్నా
నా సొలిలాక్వీలో తనూ ఓ భాగమే
ప్రాణమెక్కుడుందో కాని
ఒళ్ళంతా తెల్లని చిర్నవ్వుతో అదే పలకరింపు
నన్ను దగ్గరకు లాక్కున్నదదే..
నాతోనే, నాలోనే ఉండే
నా సముద్రం!

(వైజాగ్ బీచెప్పుడూ ఓ నోస్టాల్జియే నాకు.....ఎన్నో అనుభూతులు, మరెన్నో జ్ఞాపకాలు. ఆ అలల పాటలు నన్ను తడుపుతూనే ఉంటాయ్, ఆ కెరటాల తుంపరలు ఇంకా నాలో ఎక్కడో తడిగా తగుల్తూనే ఉన్నాయ్)




9 comments:

  1. ఆ సంగీతాన్ని నాతోపాటు మోస్తూనే ఉన్నా
    నా సొలిలాక్వీలో తనూ ఓ భాగమే
    ప్రాణమెక్కుడుందో కాని
    ఒళ్ళంతా తెల్లని చిర్నవ్వుతో అదే పలకరింపు
    నన్ను దగ్గరకు లాక్కున్నదదే..
    నాతోనే, నాలోనే ఉండే
    నా సముద్రం! great expression

    ReplyDelete
  2. వాసుదేవ్ గారూ మీ కవిత చాలా బాగుంది , ముఖ్యంగా సముద్రాన్ని స్త్రీ తో పోల్చటం

    ReplyDelete
  3. ప్రాణమెక్కుడుందో కాని
    ఒళ్ళంతా తెల్లని చిర్నవ్వుతో అదే పలకరింపు
    bhaagha raasaarandi.
    keep writing.

    ReplyDelete
  4. కంటిబిగువున అదిమిపెట్టలేని దుఃఖంలా
    ఫెళ్ళుమన్న గుండె పగిలి రోదించినట్టు
    ఉవ్వెత్తున లేచిపడే నిలువెత్తు కెరటం!
    వేయి మృదంగాల ఘోషగా ఆరంభమై
    శృతిచేసుకుంటున్న సితారలా ఒడ్డుపై వాలిపోతూ.....

    great presentation..super sir.

    ReplyDelete
  5. Very impressive అండి! చాలా బాగుంది

    ReplyDelete
  6. సుజన,ఫాతిమా, భాస్కర్, సీత, వెన్నెల,నాని గార్లందరికీ మన:పూర్వక ధన్యవాదాలు.ఇంతమందీ నచ్చుకున్నందుకు, మెచ్చినందుకు కృతజ్ఞతలు. మీకు బోలెడంత ఋణపడిఉన్నానేమో...ఇంకా రాసి అదంతా తీర్చుకోవాలేమో!

    ReplyDelete
  7. hmmmm.....naa bhaavalannee...mee padallo prayaninchayi....vizag and beach......hmmm....nostalgic....

    ReplyDelete
  8. ento eppudu nishabdham tega nachestundi mi kavitha laaa.. superbb dev :-)

    ReplyDelete