Thursday, June 14, 2012

ఏ రెండూ ఒకటికావెందుకనో...


అవును..
ఏదీ రెండోసారి అనుభూతించలేను
ఏరెండు అనుభవాలూ
ఒకే గూడు కట్టుకోలేదు
ఏ రెండు జ్ఞాపకాలూ ఒకే
గుడ్డన కుట్టలేకపోతున్నాడీ దర్జీ

ఏ ఇద్దరీ మరణమూ ఒకటి కాలేదెప్పుటికీ!

నిస్తేజ, నిరాసక్త తెల్లగోడలూ
ఏవేవో కథలు చెప్తుంటాయి, కొత్తవి
చూసిన ప్రతిసారీ...
చిరిగిన ప్రతి క్యాలండర్ పేజీ
తిరగబడని ఓ చరిత్ర పాఠం....
ఎప్పుడూ పాతగా అన్పించదేం?

మనసుతో నడిచిన ఆ రాస్తా
ఎప్పుడూ కొత్తే!
కాలికడ్డం పడిన ఆ గడ్డిపూవూ
ఎప్పుడూ కొత్త కథ చెప్తూనే ఉంటుంది
మంచుకురవలేదనో, తనని తుంచి
నీ జళ్ళో పెట్టలేదనో....వింటూనే ఉంటా
ప్రతిసారీ...మరో కొత్త ఆలోచనకోసం,
ఓ కథకోసం, ఓ కొత్త ఆవేదనకోసం..
నిన్ను కల్సిన ప్రతిసారీ ఓ
కొత్త అనుభవమే...
నీ చీర వెనుక ఆ దాపరికం
నాకెప్పుడూ కొత్తేసుమా!
ఏ రెండు సార్లూ నిరుత్సాహపర్చలేదు

నీతో కల్సిన ప్రతీ సంగమం
కాలంతో కల్సిన ఓ అనుభవం
ఏ రెండూ కలయికలూ ఒకటి కాలేవు
నీ స్పర్శ ఎప్పుడూ నాకు కొత్తే
అద్దంలో నన్ను నేను కొత్తగా వెతుక్కుంటున్నట్లు...
                  07.06.2012

14 comments:

  1. Replies
    1. భాస్కర్ గారూ! ధన్యవాదాలు

      Delete
  2. షరాబు గుడ్డలు కుట్టేవాడు కాదనుకుంటా... (రత్నాల విలువ) కట్టే వాడని గుర్తు... ఏదేమైనా.. మంచి అనుభూతి.

    ReplyDelete
    Replies
    1. ఫణిగారూ మీ పరిశీలన నిజమే....కోస్తాంధ్రాలో నగలు చేయించేటప్పుడు రాళ్ళు పొదిగేపనిచేయటాన్ని కుట్టడమనీ, ఆ వ్యక్తిని షరాబు అని అనడం గుర్తుండి అలా వాడడం జరిగింది.అయితే మీరుచెప్పినట్లే ఇంకా చాలామంది అనుకునే అవకాశం ఉందని భావించి ఆ పదాన్ని మార్చాను. ధన్యవాదాలు.

      Delete
  3. చాలా బాగుంది .....!!

    -- సీత.....

    ReplyDelete
  4. వాసుదేవ్ గారూ, మీరు రాసిన ప్రతి అనుబూతీ అధ్బుతం. ఎప్పుడు రెండోసారి అనుబూతిన్చలేను అనటం ఓ కొత్త ప్రయోగం, సర్, మిమ్ము చాలా పొగడాలని ఉంది కానీ మీ అక్షర మాలముందు నా పలుకులన్నీ తెగిన ముత్యాలలా విడివిడిగా దొర్లి పోతున్నాయి, అస్సలు చెప్పాలనుకున్న భావం రావటం లేదు. మీ కవితలన్నీ చదువుతాను,

    ReplyDelete
    Replies
    1. ఫతిమాజీ....ధన్యోస్మి.మీ ఈ ప్రశంసకు ఋణపడిఉన్నట్లే. దొర్లిపోతున్న ముత్యాలన్నింటినీ ఏరుకోవచ్చా?

      Delete
  5. ఎంత ప్రేమ లేకపోతే పరిచయం ఇంత కొత్తగా వుండాలి....అవ్యక్తమైన అనుభూతిని అక్షరాల్లో బంధించారు.

    ReplyDelete
    Replies
    1. వావ్...నాకింతవరకూ లభించిన స్పందనల్లో ముత్యమిది...మీరు స్ఫుర్తిప్రదాత నా రచనలకూ, భావాలకూ....కృతజ్ఞతలు

      Delete
  6. భావ వ్యక్తీ కరణ బాగుంది వాసు గారు. "నీతో కల్సిన ప్రతీ సంగమం
    కాలంతో కల్సిన ఓ అనుభవం" ఇది అక్షర సత్యమైన అనుబూతి యోగ్యమైన మాట.
    సరస్వతీ పుత్రుడు బాల మొరళీ కృష్ణ అన్న మాట ఒకటి మీ ఈ కవిత చూడగానే గుర్తుకు వచ్చింది.
    "నేను నిరక్షరాస్యుడను. నా చేతా బావాలని...రాగాలుగా మార్చలనుకున్నప్పుడు సరస్వతీ దేవి
    నా చేత వ్రాయిస్తుంది...పాడిస్తుంది. ఇది నా గొప్పతనం కాదు...ఆమె సంకల్పం" అని.
    అన్ని అనుభవాలు అందరూ అక్షారలుగా పెట్ట లేరు. అలా పెట్టె ప్రతీ ఒక్కరూ సరస్వతీ కటాక్షులే...
    మీ బావార్ధాలను అక్షరాల మాలగా చూసాక మీరు కూడా ఆమె ముద్దు బిడ్డే అని అర్ధం అయ్యింది.
    Keep it up. Write more and more with the blessings of Maa Saraswathi.

    సుధా రాణీ చల్లా

    ReplyDelete
  7. సుధాజీ! మీ స్పందనా భావతరంగంలో ఇంకా మునిగేఉన్నా...మీరిక్కడ ప్రత్యక్షం కావటం మీ స్పందనని రాయటం అదీ ఇంతమంచి స్పందనని....వావ్! ఇది ఓ అదృష్టమే!. ధన్యవాదాలు

    ReplyDelete
  8. నీతో కల్సిన ప్రతీ సంగమం
    కాలంతో కల్సిన ఓ అనుభవం
    చాలా అధ్భుతమైన భావం...

    ReplyDelete
  9. ధన్యవాదాలు పద్మాగారు...చాన్నాళ్ళయింది మీసిరా ఇటు ఒలికి.మీ స్పందనతో ఈ కవితకి ప్రాణమొచ్చినట్లయింది

    ReplyDelete