Saturday, September 11, 2010

నాకూ పండగుంది

ఉండ్రాళ్ళు, హలీం సుష్టుగా మెక్కి ఫోక్స్‌వేగనెక్కి
ఆకలిని వెక్కిరిస్తూ దూసుకుపోతున్నాను
అమీర్పేట చౌరస్తా దగ్గర గరీబొక్కడు
గబగబా కారుతలుపు తట్టి ఆబగా చూస్తున్నాడు.
"ఏరా మీఅమ్మేది?" అన్నా
"తెలీదన్నా, అమ్మేశారు నన్ను"
జారిపోతున్న నిక్కరు లాక్కున్నాడు.
"ఏ తిన్నావురా ఇవాళ, ఉండ్రాళ్ళా, హలీమా?"
"ఏంతినలేదన్నా, పొద్దున్నే తరిమేశారు
సాయంత్రానికి వంద తెమ్మన్నారు!"
"మరేంచేస్తావురా ఎటెళ్తావ్? వందెలా సంపాదిస్తావ్?"
"ముందు మశీదుకెళ్తా, అక్కణ్ణుంచి గణేశ్ మండపం
నాకేం మతంలేదన్నా, పైసల్తొ ఎల్తేనే బువ్వ!!"
వాడి మాటల్లో వాడికే తేలీని బోలెడంత ఫిలాసఫి.
"వందలో నీకెంతిస్తార్రా? ఏంకొనుక్కుంటావ్?"
"నాకేం ఇవ్వరన్నా, ఓ బన్ను, టీ పోస్తారు"
కడుపులో దేవినట్టయింది, ఏం తిన్నానో మర్చిపోయాను.
వాడికి వందనోటిచ్చి మరో పదిచ్చాను
వాడికంట్లో మెరుపు, "నాకూ పండగుందియ్యాల
కానీ పండగ పేరేంటో తెలీదన్నా" అన్నాడు.
నాకు తెల్సు అ పండగపేరేంటో
ఆకలికి అన్నం!!!