Friday, July 8, 2011

ద్వైతం

ఉఛ్వాస నిశ్వాసాల రోలర్ కోస్టర్‌లో
ద్వైతం కన్పడుతోంది స్పష్టంగా...
నాణానికి చెరోవైపు అతుక్కున్న
రెండు పార్శ్వాల్లా అదే ద్వైతం!
శల్య సారధ్యంలా జీవిత రధానికి
భార్యాభర్తలిద్దరూ ద్వైతమే.
ప్రేమ బండికి
పెళ్లనే రెండు జోడెద్దులు అవసరమే.

అభినందిచ్చే కరతాళానికి
రెండు చేతుల్లా...
ముక్కు సూటిగా పోయే
గడియారపు చేతులూ చేతలూ
ద్వైత సూచకమే!

రిథమ్‌లో దాగున్న అందాన్నంతా
అలవోకగా ఒలకబోస్తూ
కాలగమనాన్ని అందంగా శాసించే
వెలుగురేడు, రేవంతుల దాగుడుమూతలు
ద్వైత సమానమే....!

దేహాన్నంటి పెట్టుకున్న ఆత్మలా--
దేహం, ఆత్మ--రెంటికి రెండూ
ద్వైతానికి నిత్యసూచనంగా....

చివరికి....
ప్రేమ పరిష్వంగానికి రెండు మనసుల
అవసరం ఉన్నట్టు...
అన్నీ ద్వైత గోచరమే.

ద్వైతమే ఈ విశ్వమానవ
ప్రేమతత్వానికి పునాది!!!
------వాసుదేవ్ (08-జూలై-2011)

**బియ్యే చదువుతున్న రోజుల్లో ఈ అద్వైత, ద్వైతాల గురించి నాన్నగారు నాకు చెప్పినప్పుడు నాకు ఎందుకో ద్వైతమే (విశ్వానికి, దేవుడికి భేదముందని చెప్పే సిధ్ధాంతం) నచ్చింది. ఆయన మాత్రం అద్వైతమే(జీవాత్మ పరమాత్మ ఒక్కటే మిగిలినవన్నీ దాని రుపాలే అనే అభిప్రాయం) పైనే నమ్మకం. ఏమో ఇద్దరమూ కరక్టో లేక నేనే తప్పో తెలీదు....ఇప్పుడు నాన్నగారు తన జీవిత చరమాంకంలో మళ్ళి నా అభిప్రాయాన్నడిగారు. నేను మాత్రం ద్వైతమే సరైందన్నాను. దాని ఫలితమే ఈ చిన్న రచన......మీ వాసుదేవ్