Wednesday, March 14, 2012

మూగవోయిన అక్షరం

అప్పుడప్పుడు నా అక్షరం మొరాయిస్తుంది
మండకుండా---
ప్రతీ అక్షరంలోనూ ఓ ప్రమిద
కొన్ని గుడ్డిగా, కొన్ని దివ్వెగా
కొన్ని అక్షరాలంతే
సిరా చుక్కలుగానే మిగిలిపోతాయి
కన్నీరెండిన కళ్ళలా......

ప్రతీ అక్షరం ఓ ప్రస్థానం
రెండింటిమధ్య ఖాళీ
ఓ ఇరుకు మజిలీ!

ఒక్కోసారి
ఎక్కడో, ఏ కాగితంనుంచో
జారిపోయి
నిరాశ్రయంగా నన్ను వెతుక్కుంటూ
అతుక్కుంటూ....
నా దగ్గిర ఓ కావ్యమౌతుంది.

ఎన్నిపోరాటాలకి ఆయుధమైందని
తిరిగి ఏమివ్వగలిగాను
అందుకేనేమో
అప్పుడప్పుడు
గుండె వెనక దాక్కుంటూ
మౌనంగా రోదిస్తూ
నన్నూ ప్రతిఘటిస్తూ....అలుక్కుపోతుంది

ప్రతీ అక్షరానికి
నువ్వనాధవి కాదన్నది
చివరిమాట కాలేదు

ప్రతీ అక్షరానికి
నా గుండె ఓ గవ్వగది
ముడుచుకుపోతూనే ఉంటుంది
అవసరమైనప్పుడల్లా!
అలా ముడుచుకున్న నా అక్షరాన్ని
ఏ అమానుషమో, అకృత్యమో
నిద్రలేపుతుంది ఉక్కిరిబిక్కిరిగా!
అక్కడే అప్పుడే
అవన్నీ గండికొట్టినట్టుగా
కాగితంపై వచ్చిపడుతుంటాయి
వడగళ్ళవానలా,
నా రక్తాక్షరాలన్నీ!

పాతకాలపు పుస్తకాల్లోంచి
వాసనగా జారిపడుతున్న
అక్షరాలన్నీ
స్పృశించమని అడుగుతున్నట్లే అన్పిస్తాయి!

అక్షరాన్ని
ప్రేమిస్తూనే ఉంటాను
మాట సాయంకోసం అర్ధిస్తూ!
మోదాన్నీ, దుఃఖాన్నీ మోస్తూ
తన ఒళ్ళంతా గాయాలపాలు
నన్నూ మోస్తూనే
మూగవోతూనే ఉంటుంది
నా అక్షరం.......


Saturday, March 10, 2012

ప్రేమార్ణవం


అమ్మపాల రంగు
అవసరం లేకపోయింది
అవసరం....ఆకలయింది
అమ్మకి ప్రేమయింది

నీ ఉచ్ఛాసనిశ్వాసాల శృతిలయలు
జోలపాడుతూనే ఉంటయ్
అవసరం ప్రేమయింది
నీకు మమతానురాగమైంది

గోడక్కొట్టిన క్యాలండర్లా
నీ నడుముచుట్టూ నాచూపులు
నీతో ఈ జన్మాంతరాన్ని సాధించాలని! ప్రేమతో!
పునరుక్తంటూ చీరకొంగుతో
కొట్టినప్పుడల్లా మొహంచాటేసాను
నువ్వే కదాని!
నా రెప్పలల్లార్చడం మర్చిపోయినప్పుడల్లా
సిగ్గుపడ్తూనె కప్పుకుంటావు
లోయలన్నీ...ప్రేమ లోతు నీకేం తెల్సంటావు!

ఆ కనకాంబరం వాడినప్పుడు
ఎంతగొడవచేశావని
ఆ గుడితిన్నెకి జారగిలపడ్తూ
నీ విరహానికి అది వాడిపోయిందంటావు
అప్పుడేగా నీ చెవిలో
గొణిగాను--
ప్రేమతో పొంగిన గుండెలపై వాలనా అని
సిగ్గుపడ్తూ నన్ను లాక్కున్న నీ
చేతివేళ్ళని స్పృశిస్తూ అక్కడే ఉండిపోయానన్న
నీ చూపు గుచ్చుకుంటూనే ఉంది ఇంకా.....

ప్రేమంటె ఇష్టమంటావు
తీరా కౌగలిస్తే
అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూడమంటావు
ప్రేమకిరణాలతో ప్రకృతంతా పర్చుకుంటూ....
నిక్కచ్చిగా ప్రకృతంతా రంగులమయమయితే
మరి ప్రేమ రంగూ?
నీ సిగ్గుల అంబులపొదిలోంచి తీస్కోమంటూ
ఒదిగిపోతూనే ఉంటావు
ప్రేమగా...ప్రేమతో!