Tuesday, June 28, 2011

కోర్కె

మనసు కష్టపడ్డప్పుడల్లా
అదె వేదన...ఒంటరిగా ఉండాలని!
మబ్బును వీడిన వర్షపు చినుకులో
మనసుని తడిపి జీవితపు ఒడ్డున కూర్చున్నా...
ఒంటరితనాన్ని ఆస్వాదిస్తూ!
అమ్మా.....!
ఒకటే బాధ.....మనసుకి నొప్పి
గాలిలా ఒంటరిగా ఉండాలని
స్వేచ్చగా......స్వతంత్రంగా
ఒంటరిగా...........................!
కనీసం ఆలోచన్లనుంచైనా
విడిపోవాలని ఆశించా...
ప్రకృతితోనె మమేకమైన
ఇంధ్రధనుస్సు ప్రత్యక్షమై
మనస్సుని ముద్దాడింది,
తనదీ అదే సమస్యంది.
నాకు తోడయ్యింది....
మళ్ళి అదే విషమం.
ఒంటరిగా ఉండాలనే కోర్కె.
జీవితంలో ఉంటూ
ఈ జీవితానికి దూరంగా.....
ఒంటరిగా!!!!
మనసు గదిలోని
బాంధవ్యాలు మోకాలడ్డాయి
బాధ్యతలు మొట్టికాయించాయి.
ప్రేమతో మనసు బరువెక్కి
వెక్కి...వెక్కి ఎక్కిళ్ళయిమయమయింది!!
అనుభూతించాక మరీ మధనపడ్డాను
ఒంటరినవ్వాలని.....!
తుంటరిమనసు వొప్పుకుంటేనా
ప్రేమతోనే ఉంటానంది...
నా ఈ కోర్కె అలానే ఉండిపోయింది.......
ప్రేమతో....మీ వాసుదేవ్

Saturday, June 18, 2011

కాలంతో మూడుముళ్ళు....


రాత్రి దుప్పటి కప్పుకున్న పగల్ని
చూసినప్పుడల్లా అదే ఆవేదన
బాధ్యతల బరువుతో నిద్రపోలేనని.....

పగటి చీరకట్టుకున్న రోజు
పలకరించినప్పుడూ పలవరింతే!
జీవితసవాళ్ళు గుమ్మానికి
తోరణాలయ్యి వేళ్ళాడుతుంటే!

నిన్నని మూసేసిన నేడు సాక్షాత్కరించినప్పుడు
అదే ఆవేదన, ఏదో ఆందోళన
ఏం సాధించలేదని నిన్న
నన్ను వెక్కిరించినట్టు...!

నిన్న, మొన్న, అటుమొన్న
కాలాన్ని ఖననం చేస్తూ తొందరపాటు,
ప్రేమనైనా సాధించలేదనే తొట్రుపాటు..!

అదే పోరాటం, కాలంతో ఎదురీత
మంచులా కరిగిన మంచిరోజులు
వెన్ను చరిచి "కాలం" వెన్నలాంటివన్నాయి!

మనసు కళ్ళు తెరిచిచూస్తే ఇంకేముంది
బంధాలు, బాంధ్యవ్యాలు బరువెక్కాయి
అనురాగాలు అర్రులుచాసాయి.

కాలంతొ సంధి చేసుకున్నాను
తన నాల్గో పార్శ్వం--
"ప్రేమ" తో మూడుముళ్ళకి ఒప్పించేశాను.
నా ఈ కాలంతో కళ్యాణానికి
మీరందరు నిరంతరం ఆహ్వానితులే.......
మీ వాసుదేవ్ (18.జూన్.2011)