Sunday, May 22, 2011

అక్షర సత్యం

---- వాసుదేవ్


అనుబంధాలన్నీ ధన బంధాలవుతుంటే
అర్ధం కాని బంధాలన్ని ఆర్ద్రమవుతూ....

ఇదే ( ౦ )నా న్యాయమని అడిగినప్పుడల్లా
నిజం మానభంగానికి గురవుతూ.....

ప్రేమిస్తూ, ప్రేమించబడుతూ కూడా
దేవుడి ఉనికిని ప్రశ్నిస్తూ....

జీవన్మరణ చట్రంలో ఇమిడిపోయికూడా
వయసు ప్రగల్భాలకు రంగులద్దేస్తూ........

'నా' నుండి నన్ను నేను విడదీయలేనని తెల్సీ
నాలోనే అన్నీ ఉన్నాయని బతికేస్తూ......

కాలాన్ని, కలాన్ని వెనక్కి తీసుకోలేమని
మనసు ఋతుస్రావంలో ఎండిన రక్తం
ఈ చిన్న జీవితమన్నది

అక్షర సత్యం


Sunday, May 8, 2011

నిన్నటి నాన్న-రేపటి కొడుకు

విలువల వ్యవస్థకి
వలువలు తీసేశాను
నాకైతే ఏం కన్పడలేదు
వయసు వగరు తప్ప!

ఓల్డేజ్ హోమ్‌కెళ్ళి
నాన్నని కలిశా
అదే చిర్నవ్వు, భావగర్భితంగా.......
అదే ఆప్యాయత

ఆయన బ్రతుకుబండి ముందు
నాకొత్త కారేపాటిది?


కారుని మార్చానేమోకానీ
ఆయన్ని ఏమార్చలేనుగా
ఆనందాన్ని నిర్వచించుకోమన్నారు

"తల్లీ, తండ్రీ, భార్యా, పిల్లలు
వీళ్ళందిరీ కంటే
జీవితమే నీకుతోడు
ఆ జీవితాన్ని "అర్ధం" చెయ్యి

జీవితంలో నిండిన
శూన్యానికి రంగులద్దకు"

చలువ కళ్ళద్దాల వెనకచేరిన
వేడికి చలించి
ఆర్ద్రంగా
తన చేతిరుమాలిచ్చారు నాన్న.
జీవితం చిన్నదే
కానీ
జీవితపరమార్ధం గొప్పది.

వెధవది, కల్తీ కన్నీరు
ఉప్పగానైనా లేదు.

* * * * * * * * * *