Monday, October 28, 2013

ఓ వర్షపు రాత్రి




భళ్ళున చీల్చుకున్న ఆకాశంలోంచి ఊడిపడ్డ ఆరెండు
చినుకులూ చెవిపక్కనుండే పోతున్నాయి
ఓ కథని విప్పుతూ
అంత గొడవేంటని గొణిగాను మనసారా
నిష్కల్మషం గురించనుకుంటా ఆ రణగొణధ్వని
దానికంత చెప్పాలా అని అన్నప్పుడల్లా మళ్ళీ
అదే గొడవ..అదే కథ..మనసు కథనుకుంటా

 గుండెని తడిచెయ్యటానికా అన్నట్లు కురుస్తూ
కాళ్ళకింద చిన్నపిల్లల్లా తిరుగాడుతూ
వానచుక్కలు......
వాటికేం ఇవ్వగలను అన్న బాధా లేకపోలేదు
బోలెడంత శబ్దం చేస్తాయి నిశ్శబ్దంగా…గర్వంగా

ప్రేమంటే వానకి తెల్సినట్టుగా మరిదేనికీ తెలీదనుకుంటా
అదే చెప్పాలంటే మాటపెగలట్లేదు..వాన భాష రాదుగా మరి
గుండె ఎండిపోయినట్లుంది…..ఈ జడివానలో కూడా
నా చిరునామా నేనే వెతుక్కునే పనిపెట్టాయని బాధ తప్ప
ఫిర్యాదేముందని?

ఓ నిష్కామం గురించిన అస్పష్టతే ఎప్పుడూ
వర్షపు గోళాల్లాగనే....బరువుని మోస్తూ తిరుగుతుంటాయిగా
ఏమీ ఆశించకుండానే.....
మరి నా బరువేదో తెలిసేదెప్పుడో
వర్షంతో నేనూ..నాతో నా వర్షమూనూ
ఓ సియామీస్ ట్విన్స్ ....తలదగ్గరో మొలదగ్గరో
కలిసిఉన్నామన్న ఆ క్షణమే
ఓ అద్వైతానందమేమొ...చూడాలి
మనసు నిండాకైనా ఓ మాటొస్తుందేమొ!!

Friday, October 11, 2013

వీడే…. ఆ మాటలన్నీ మోసాడు



చిక్కటి రాత్రిలోనూ, పగటి మేఘంలోనూ
మోసాడు... మాట బరువంతా!
పదాల పదునంతా కాపుకాసాడు
మనలోనూ వీడే, మనుషుల్లోనూ వీడే
పొక్కిలి చేసేదీ వీడే, ముగ్గులు వేసేదీ వీడే
వీడే మన మనోడు
మనందరిలోనూ మసలే మనసున్నోడు

మిణుగురు పురుగుల నీడల్లోనూ
రెప్పలకిందటి చీకటిలోనూ వెలుగుతూనే ఉంటాడు
బరువెక్కిన మనసునెప్పుడో ఈదేసాడు

గుండెలో చేరిన చెమ్మని వెన్నమూటలో కట్టేసాకె
దానికి మాటనివ్వలేకపోయానెప్పుడూ....
అప్పుడే వచ్చాడీడు ఓ పదాన్ని వెంటేసుకుని...
నీకెందుకు నేనున్నానంటంటూ....
నాతోనే ఉన్నానంటూ……ఉంటూనే ఉన్నాడు

మాటని మంత్రం చేసి మరీ తప్పుకున్నాడు
అప్పుడు కదా అర్ధమయింది
"ఘోరీలు కట్టేది వీడే...గోడలు కూల్చేది వీడే...."
వీడే నా అద్దం!
నా తరఫున మాట్లాడేది వీడే
వీడి పేరే అక్షరం