Tuesday, April 19, 2011

మనసు మిస్చీఫ్

-----వాసుదేవ్
ఆమె
ఒయాసిస్సులోకి వెళ్ళినప్ప ట్నుంచీ
మాట విననని ఒకటే మొరాయింపు
పిచ్చి మనసని కొట్టి పారేయలేకపోయా......

దోసిల్నిండా వెన్నెలని పట్టి
మీదొంపేసుకున్నా
చల్లారలేదు!

భళ్ళు మని పగిలిన ప్రతీ
చినుకు గోళాన్ని స్పృచించాను
వేడొలకలేదు!

వర్ధనంలా విచ్చుకున్న ప్రతీ
మంచుబిందువుని గుండెలపై
జారవిడి చా
మాటవింటేనా!
అదే విరుపు
అదే అల్లరి
పిచ్చి మనసు మరి!

ప్రేమ తత్వం
కావాలంటూ---

ఆకసానికి హద్దులిస్తానన్నా
హరివిల్లుని చీరచుట్టుకోమన్నా
నయాగరాతో నిచ్చెనలేసుకోమన్నా
వద్దంది....మొండిగా
ఏమార్చాలని చూశా
స్కాచ్ తాయిలాలు పడవంది.....

ఆమె వచ్చి చెప్పాలంటాది
ప్రేమ వేదాంతం
అదిగో మాటల్లోనె....
ఎంతైనా మనసుతెల్సుకున్నది గా....
"నేను కావాలా ప్రేమే కావాలా"
అని అడిగితే
చెవిలో గుసగుసలు పడేసరికి

ఏదీ ఆ స్పందన?
* * * * * *

Saturday, April 2, 2011

యుగాంతంలో యుగాది

ఖరమో, ఖడ్గమో
ప్రకృతో, వికృతొ
అంతా అవ్యయమె నాకు!

కాలం నా ముఖం మీదుగా
డొర్లుకుంటూ పోయింది
ఎన్నో వత్సరాలు,
ఎన్నో వసంతాలు
ప్రతీ ఉగాది అదే మిగిల్చింది
తీపి, చేదుల కలయిక

నా ఉనికి వెతుక్కూంటూనే
ఉన్నాను,
విలువల చిరునామా
కోసం వెతకని ఉగాదే లేదంటే
నమ్మండి.


అరవై ఏళ్ళ కిందట
ఇదే ఖరనామంలో పుట్టానని
అందరూ సంతసించారు.....

నా కూతురే కొడుకైంది
అప్పుడు అది ఆడబిడ్డని,
దాన్ని పురిట్లోనే ముగించేయాలని
తెలీలేదుబాబు!!

సెజ్‍లన్నారు, రింగ్‌రోడ్డులన్నారు
భూమంతా లాక్కునారు బాబూ
అంతా నామంచికోసమేనన్నారు
ఇదిగో
ఈ కడుపుమీదకొడితే
’ఉగాదిపచ్చడే బయటకొస్తాది మామా’
అని నా ఇల్లాలు గగ్గోలు పెట్టింది సుమా!!

పోన్లెండి, మీరెక్కడి కెళ్తారన్నా,
ఇది యుగాంతమని మీకూ తెల్సు!
ఈరోజు ఏ ఉగాదైనా
పేదవాడిదే గెలుపన్నా!

అదిగో నా క్కన్పిస్తోంది
ఎగిరే పళ్ళం
నాకు వేరే లోకముందని
అక్కడ ఈ తారతమ్యాలుండవని
అక్కడ ప్రతీరోజూ ఉగాదే!!
ప్రతీ వత్సరం ’ఖరమే’!