Friday, December 31, 2010

కొత్త వత్సరం, నాకూ మీకు

కొత్త వత్సరం, నాకూ మీకు
ఇంకేం చెప్పడానికి లేనట్లు
క్యాలెండర్లో చివరి పేజీ చిరిగిపోయింది
ఎప్పుడెప్పుడా అన్నట్టు ఒకటో తేదీ
చొచ్చుకొచ్చేసింది అర్జంటుగా ఒకటో నాడే..
ఒక శూన్యం...... మరొక ట్రాన్సిషన్!
చుట్టూ చూశాను ఎవరెవర్ని అభినందిద్దామా అని!
తల్లిదండ్రుల్ని వృద్దాశ్రమాన్లో చేర్పించేసిన
జెంటిల్మేన్‌ని పలుకరించా సున్నితంగా
"ఇవాళేంటి వెళ్ళేది, అసహ్యంగా,
అబ్బా, ఉంటార్లెండి మాములుగా,
మొన్ననే, పోయినేడాది డబ్బులు కట్టొచ్చా"
మరొక అవమానం... మానవత్వానికి!
తల్దించుకొని వెళిపోతుంటే
డాక్టరుగారు పిల్చారు
"ఏఁవోయ్! ఇలారా ఎవరికైనా కిడ్నీ కావాలేంటి?
నీక్కూడా ముడుతుందిలేవోయ్, ఊరికినే కాదులే"
అసహ్యమేసింది మనుషులుపై, కాదు మానవత్వంపై
సంభ్రమంగా గుడికెళ్ళా కనీసం
ఆయనకైనా విషెస్ చెప్పి బయటపడాలని
ఎందుకో దేవుడుకూడా దిగాలుగా కన్పడ్డాడు నాకుమల్లే
అక్కడే ఓ సామాజిక సెక్స్ కార్యకర్తని కల్సా
"ఏంటమ్మా ఎలా ఉంది? కనీసం ఇవాళైనా?"
"ఆ ఏ ఉందిలెండి, కనీసం కండోమ్ ఖర్చులు కూడా కష్టమే"
అప్పుడే నా కన్పించింది
" ఏ వత్సరమైనా ఏముంది గర్వకారణం
సకల మానవ దోపిడి గుణకారణం
అదే కొత్త వత్సరపు తత్వం"
మనసున్న మారాజులకి
మనసుని మాత్రమే వాడే మహామనుషులకి
నూతన సంవత్సర శుభాకాంక్షలు.....
----వాసుదేవ్

Monday, December 13, 2010

ఆత్మ'కథనం'

సృష్టి, స్థితి, లయ కారుల్ని ఏకంచేసి
నాలో కలిపేసుకుని కూడా నా అస్థిత్వమడిగాను
ఆత్మన్నారు! సంభాళించుకున్నాను.
ప్రాణం ఉన్నచోటే నేను నా మనుగడ
ప్రాణానికి నీడగా నేను!
నెగటివ్ ఫిల్మ్‌లోని బొమ్మలా.

బొంబాయి నెత్తుటిరోడ్లు, తియాన్మెన్‌స్క్వేర్లు,
జలియన్‌వాలాబాగ్‌లు, ఖ్మేర్‌రోజ్ గృహాల్లో
ఎంతనుభవించానని నా నుండి శరీరం విడిపొతున్నప్పుడు!
వయసుతో నన్ను నాకోటని భాగించినప్పుడల్లా
బాధపడ్డాను, ఆస్థిని, అస్థికల్ని సమానపర్చినందుకు!

ఎన్నో అమానుష మరణాలు
అవమానాల ఆత్మహత్యలు
మోసపూరిత చావులు, హత్యలూ
అయినా నేను చెక్కుచెదరలేదు.
కొత్త అతిథేయ శరీరాన్ని పొందినప్పుడల్లా
ఉమ్మనీరు అంతే రుచి, అదే అనుభూతి,
ఏరోజూ పాచి అన్పించలేదు...

విబ్జియార్‍లోని ఏడురంగుల్ని న్యూటన్ చట్రంలో
బంధించి చూస్తే రంగేలేని తెలుపేవచ్చినట్లు
నేనున్న ప్రతీశరీరం పవిత్రమే.
నా కళ్ళకి ఆర్ద్రతని తాపడంచేస్కుని
కనురెప్పల మాటున దాగిన ఆవేదనల్ని
చదవడానికి ప్రయత్నించాను, నాకే తెలిసేది అంతా

ఆనందాల్ని, ఆవేశాల్ని నా శరీరం నాకే చెప్పేది
అలా ఆనందించేలోపే నా శరీరాన్ని ఎవరో ఛిద్రం చేశారు
"యాసిడ్" అని ఎవరో గొణుక్కోవటం విన్పించింది
విన్నా విననట్టే ఉండిపోయాను.

చిరునామాగా శూన్యాన్నే తీస్కుని
నా ప్రస్థానంలో మరొమజిలీ, మరో అతిథేయత్వం
మరో పార్థీవం, మరో ప్రాణం
అయినా నాకు స్తలమఖ్ఖ్జర్లేదుగా
నా శరీరంకోసం మాత్రం ఓ ఆరుగజాలు చాలు.

************

1975--1979 అంటే దాదాపు నాలుగేళ్ళు కాంబోడియాని పరిపాలించిన అతి క్రూర ప్రభుత్వాల్లో ఒకటి ఖ్మేర్ రోజ్. మేధావి వర్గాన్ని దేశద్రోహులుగా భావించి సుమారు 2 మిలియన్ల ప్రజల్ని అతి కిరాతకంగా, (మహిళల్ని మానభంగం చేసి మరీ) చంపించిందీ ఈ ఖ్మేర్ రోజ్. బహుశా ఈ శతాబ్దపు అతి క్రూరమైన బలవన్మరణాలలో చెప్పుకోదగ్గది ఇదేనేమో!

Thursday, December 9, 2010

నా జీవితం నాదే!

రాజాధిరాజా, రాజమార్తాండ
కొత్త సి.ఎమ్. గారొచ్చేశారహో!
రెడ్డిగారు వెడలె, రవితేజములలరగ
రోషయ్య హడలె మార్పులడగగ
ప్రమాణస్వీకార సీన్లు కదులుతున్నాయి
ప్రమాణాలు దిగజారుతున్నాయి
నవ్వుతూనేఉన్నా
నా మంత్రుల భాషాప్రావీణ్యాన్ని ఆస్వాదిస్తూ...
మంచిమనుషుల్నే తెచ్చార(ట)
తనవాళ్ళని వెనక్కి ఉండమన్నారట,
ఎవరొచ్చినా ఏముంది గర్వకారణం
స్విస్ బ్యాంక్ ఖాతా తెరవడమే ఆలస్యం!
అభివృధ్ధే లక్ష్యమంటూ గగ్గోలు పెడుతున్న ప్రతిపక్షాలు
"ఏం? సొమ్ములు పోనాయని బాధా" ఘీంకరించాయి స్వపక్షాలు!
సరే తరచి తరచి చూశాం మరో కూర్పు
మనకేంపోయిందని ఇంతకన్నా మార్పు!
నా పిల్లలకేం అర్ధంకాక "మాకేంటన్నారు"?
"అందరికీ బాగుంటుందట, అదిగో చూడండి మా కార్టూన్లు"
"ఇవి నిజం కాదు నాన్నా, ఇది అబధ్ధంలో నిజం
మా కార్టూన్లే నిజం! అదే వాటి నైజం"
ఎవరెవరో గద్దెనెక్కారు, ఉధ్ధరిస్తామని ప్రమాణించారు
పదవుల పందేరంలో కుమ్ములాడుకున్నారు.
నా జీవితం నాకే ఉండిపొయింది
ఇక మారదని అర్ధమయింది!
నేను సామాన్య మనీ షినే, మధ్య తరగతి జీవుణ్ణి
నా గురించేమీ ఆలోచించరా? ఎలుగెత్తాను.
మరి నా సంగతేంటి? నా గతేంటి?
ఆవేదన పడ్డాను, ఆందోళన చెందాను.
వారు స్పందించారు, నన్ను తట్టారు
నీకేం కావాలన్నా మేం ఉన్నామన్నారు
కానీ మా తలుపు తట్టకు
అది మురికవుతందన్నారు.
నేనీ ప్రజాస్వామ్యానికి ప్రతినిధిని
మరో హైడ్రామాకి ప్రేక్షకుణ్ణి!
నా జీవితం నాదే, రాజెవరైనా
నా పోరాటం ఆగదు, ప్రభువెవరైనా!

*************