Monday, October 28, 2013

ఓ వర్షపు రాత్రి




భళ్ళున చీల్చుకున్న ఆకాశంలోంచి ఊడిపడ్డ ఆరెండు
చినుకులూ చెవిపక్కనుండే పోతున్నాయి
ఓ కథని విప్పుతూ
అంత గొడవేంటని గొణిగాను మనసారా
నిష్కల్మషం గురించనుకుంటా ఆ రణగొణధ్వని
దానికంత చెప్పాలా అని అన్నప్పుడల్లా మళ్ళీ
అదే గొడవ..అదే కథ..మనసు కథనుకుంటా

 గుండెని తడిచెయ్యటానికా అన్నట్లు కురుస్తూ
కాళ్ళకింద చిన్నపిల్లల్లా తిరుగాడుతూ
వానచుక్కలు......
వాటికేం ఇవ్వగలను అన్న బాధా లేకపోలేదు
బోలెడంత శబ్దం చేస్తాయి నిశ్శబ్దంగా…గర్వంగా

ప్రేమంటే వానకి తెల్సినట్టుగా మరిదేనికీ తెలీదనుకుంటా
అదే చెప్పాలంటే మాటపెగలట్లేదు..వాన భాష రాదుగా మరి
గుండె ఎండిపోయినట్లుంది…..ఈ జడివానలో కూడా
నా చిరునామా నేనే వెతుక్కునే పనిపెట్టాయని బాధ తప్ప
ఫిర్యాదేముందని?

ఓ నిష్కామం గురించిన అస్పష్టతే ఎప్పుడూ
వర్షపు గోళాల్లాగనే....బరువుని మోస్తూ తిరుగుతుంటాయిగా
ఏమీ ఆశించకుండానే.....
మరి నా బరువేదో తెలిసేదెప్పుడో
వర్షంతో నేనూ..నాతో నా వర్షమూనూ
ఓ సియామీస్ ట్విన్స్ ....తలదగ్గరో మొలదగ్గరో
కలిసిఉన్నామన్న ఆ క్షణమే
ఓ అద్వైతానందమేమొ...చూడాలి
మనసు నిండాకైనా ఓ మాటొస్తుందేమొ!!

4 comments:

  1. వర్షాన్ని చూస్తూ వర్ణన చేసిన కవులున్నారు,
    వర్షాన్ని తనతో తిప్పుకున్న భావుకత కనిపిస్తుంది మీ ప్రతి పలుకులోనూ,,,
    మంచి కవిసమయం వాసుదేవ్జీ.

    ReplyDelete
  2. వర్షాన్ని చూస్తూ వర్ణన చేసిన కవులున్నారు,
    వర్షాన్ని తనతో తిప్పుకున్న భావుకత కనిపిస్తుంది మీ ప్రతి పలుకులోనూ,,,
    మంచి కవిసమయం వాసుదేవ్జీ.

    ReplyDelete
  3. వానలో ఇంత భావుకత్వం ఉందా అనిపించింది ఇది చదివితే

    ReplyDelete
  4. Meraj and Yohanth Thank you both for your wonderful comments

    ReplyDelete