Tuesday, May 26, 2015



ఇక ఈ నిరీక్షణ చాలు నాన్నా.....!
ఒంటరితనం బాధిస్తుంది నాన్నా
యుధ్ధం గురించి ఏమీ తెలీకుండానే నువ్వూ వెళ్లావన్నది నిజం
జీవితమే యుధ్ధమైనప్పుడు, యుధ్ధంలో యుధ్ధమేంటీ నాన్నా
ఐక్యరాజ్యసమితంటావూ……...అదీ అబద్ధమే
ఐక్యమేలేని సమజాన్నొదిలేసి మరీ ప్రపంచం వైపు పరుగులా ?

నాకిప్పటికే  తెలిసొచ్చిందంటే నీకెప్పుడో తెలిసుండాలి
నువ్విచ్చిన టెడ్డీ బేర్నే ఎందుకలా చూస్తున్నావని అమ్మ అన్నప్పుడల్లా
అక్కడె నువ్వున్నావన్న నిజం నాకు తెలుసని చెప్పాలనిపిస్తుంది.
ఐనా అది అమ్మకి తెలియంది కాదనుకో!

 నాలోనేను మాట్లాడుకోవడమే అమ్మకి తెలీనప్పుడు
ఎవరు ఎవరితో ఎందుకు యుధ్ధం చేస్తున్నారో ఎవరికీ  తెలీని  స్థితి
బుల్లెట్ల న్యాయం......దేహాన్ని మించి మరీ!
ఐనా అమ్మకి తెలియందనిదేముంటుంది?

నీ కంటూ గురిలేని నిర్ణయాలవైపే వెళ్తావని ఆమెలో ఆమె బాధపదే  క్షణాలేన్నో
ఆమెప్పుడూ తన బాధని బయటపెట్టే ప్రయత్నమేదీ  చెయ్యదు
నీ గన్ను గురినెప్పుడూ ఆమె తప్పు పట్టలేదనుకుంటా
కనీసం అక్కడైనా నువ్వు విజయుడవై ఉండాలనే తపన తప్ప
సంతోషానికీ, ఆనందానికీ ఈక్వేషన్ని రాస్తూనే ఉందామె!

ఆమెని ఆమెకొదిలేస్తాను, పాలకోసం ఆకలన్ను
ఆర్తికోసం నిన్నసలే అడగను
ఎందుకంటే,  నాకంటే ఆమెకె నువ్వు కావాల్సిందెక్కువ
వచ్చేయ్ నాన్న, మన స్వేచ్చా ప్రపంచంలోకి
గన్నులొదిలేసి పెన్ను పట్టుకో
బుల్లెట్లొదిలేసి  బుగ్గలు పట్టుకో,గుండెనిండా స్వేచ్చా ఊపిరితో
మనసునిండా మానవత్వంతో  యుధ్దం చెయ్యి  నాన్నా
మన వాళ్లతోనే యుధ్ధంచేయి

3 comments:

  1. చాన్నాళ్ళకి బ్లాగ్ వైపు రాక.
    మరో మంచి కవితతో అరుదెంచిన మీకు వెల్కం వాసుదేవ్ గారు.
    రాస్తుండండి ఇకపై...

    ReplyDelete
    Replies
    1. కృతజ్ఞతలు చిన్నమాటే ఐనా సరిపెట్టుకుంటారనే ఆశిస్తున్నా....

      Delete
  2. సందేశాత్మకం . బాగుంది .డియర్ Vasudev జి. ..శ్రేయోభిలాషి నూతక్కి రాఘవేంద్ర రావు.

    ReplyDelete