Sunday, August 5, 2012

కాంతిని కప్పుకున్న కళ్ళల్లో....!



ఆ కళ్ళు రెండూ--
తియ్యని సంగతులన్నీ దాచుకున్న
తేనెతుట్టల్లా
చరిత్రపుటల్లో ఇమడలేని
నగ్నసత్యాలేవో ఒంపటానికి సిధ్ధం

రవీకౌముదుల జుగల్బందీ విన్యాసానికి
నీ జమిలినేత్రాలు వేదికయ్యాయనుకుంటా
నలుపు నచ్చిందీ అప్పుడె
చీకటిని చుట్టుకున్నదీ అప్పుడే
నాలోంచి నీలోకి మకాం మార్చిందీ అప్పుడె!

కళ్ళంతా నన్నెప్పుడూ నింపుకుని ఉంటావేమొ
పరువాల పొంగుతో పోటీపడుతుంటాయి
అందుకే నిన్ను సైకతశ్రోణీ అని పిల్చుకునేది

మనసు మౌనగీతాలన్నీ
ఆ కనురెప్పల నిశ్శబ్ద తబలాలో విస్పష్టమే!
ప్రేమంతా, ఆ కళ్ళలోనే గూడుకట్టుకుని
కథలన్నీ పేర్చుకుంటున్నట్టు...

ఈ  అందమైన  గిరడకళ్ళకి
వాకిట తలుపుల్లా ఆ రెప్పలూ,
అల్లల్లాడుతూ అవిచెప్పే ఊసులూ
అన్నేసి సీతాకోకచిలుకలు ఆ కళ్ళనుంచి
ఎగరటం చూసుంటే డాంటే ’ఇన్ఫర్నో’ మానేసేవాడేమొ

ద్వారబంధాలకు ముగ్గులేసినట్లున్న
ఆ కనుబొమ్మల సౌందర్యలహరీ  స్ఫురితం
రక్షకభటుల్లా ఆ పక్ష్మములూ
వాటి చివర్న తళుక్కున మెరిసే
వెలుగేదో కావ్యం రాయించకపోదు

ఆ ఒక్క రెప్పపాటు కదూ నాకు ప్రేమ నేర్పిందీ!

వెలుగు రెప్పలకింద దాక్కున్న
రాత్రంతా తాపత్రయమే
నీ కనుసన్నల కాంతినీడలో
రాసుకున్న ఈ అనుభవం
కవితౌతుంది కదూ
నీ కనుదోయి సాక్షిగా....
(ఓ ప్రేమ కవిత రాద్దామనుకున్నప్పుడల్లా ఆమె కళ్ళు వెంటాడుతూనే ఉంటాయి...ఇక తప్పించుకోలేక ఇలా!)
                    వాసుదేవ్ (03.శ్రావణం.12)

6 comments:

  1. కదిలే కళ్ళలోని భావాల్ని,
    ఆ కళ్ళు వల్లించే వేదాలని,
    ఆ భావాలను ఇంతకంటే బాగా మరెవరూ చెప్పలేరేమో!
    చాలా బాగుంది శ్రీనివాస్ గారూ!
    రెప్పపాటు ప్రేమను నేర్పింది...సూపర్...
    మీ కళ్ళు కుడి,ఎడమలకు కదిలితే...
    నా కళ్ళు ఓ పది సార్లు పైకి క్రిందికి కదిలాయి...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. మీ సునిశిత పరిశీలనకు శ్రధ్ధగా చదివి మెచ్చుకున్నందుకు ధన్యవాదాలు శ్రీ గారు. మీ ఆదరాభిమానం ఇలాగే కొనసాగాలని కోరుతూ........

      Delete
  2. చక్కగా రాశారు, అభినందనలు.
    హిరోషిమా మీద అణుబాంబు వేసిన రోజిది.
    ప్రపంచశాంతిని కోరుకుందాం – యుద్దాలను వ్యతిరేకిద్దాం

    ReplyDelete
    Replies
    1. అవును భాస్కర్ గారూ మునుపెన్నడూ అవసరం లేనంతగా ఇప్పుడు ప్రపంచానికి ప్రేమ అవసరం ఉంది. అదొక్కటే ఇప్పుడు ఈ ప్రపంచాన్ని రక్షీంచగలిగేదికూడా. హిరోషిమా దురాగతంపై గతంలో నాదొక కవిత ప్రచురింపబడింది.వీలువెంబడి దాన్ని ఇక్కడ పున:ప్రచురిస్తాను. కృతజ్ఞతలు

      Delete
  3. సర్, కవిత చాలా బాగుంది.
    ప్రేమ మీద కళ్ళు చెప్పే ఉహాలు బాగా రాసారు.

    ReplyDelete
  4. ధన్యవాదాలు ఫాతిమాజీ.అలాగే కళ్ళపై ప్రెమగా చెప్పే ఊసులు రాయాలనిపించి....

    ReplyDelete