Wednesday, July 25, 2012

ఓ మరణం తర్వాత.....

ఓ మరణం తర్వాత.....
ధర్మజుడూ లేడు, యక్షప్రశ్నలూ లేవు
ఓ అగమ్యగోచరం...ఓ దిగులు

ఇవాళ్టి వర్షాన్ని నువు చూడలేదనో
రేపటి సూర్యోదయం నిన్ను తాకదనో.....

మరణాన్నీ ప్రేమించావేమో
అది నీ గుమ్మంలో నిలబడ్డా
అటు ఒత్తిగిలిపడుకోలేకపోయావు
ఉత్తచేతుల పంపలేకపోయావు

నీముఖంలోకి చూడలేక, నిన్ను కబళించలేకా
కాలాన్ని వెంటతెచ్చుకుందటగా
ముఖం చాటేసిన మృత్యువు

ఈ మరణం తర్వాత--నువ్వూ ఓ నిరాకార జ్ఞాపకంలా
మిగిలిపోతావేమో!
విషాదాన్నంతా చీకటి గుడ్డలో మూటకట్టేసాను
బరువైన రాత్రి నాకు తోడుగా---
ఓ ఖాళీ కుర్చీ, ఓ ఖాళీ ఇల్లు
జ్ఞాపకాలన్నీ ఖాళీ చేసాక మిగిలిన గుండెలా!
గడ్డకట్టిన దు:ఖంతో బరువైన కళ్ళు
ఏ కథలూ చెప్పలేకపోయాయి


ప్రతీ మరణం తర్వాతా---
జీవితవాగు దాటుతూ
ఏ మరణమూ వేరుకాదా నీభాషలోనే
చెప్పమన్నా ఆ ఒంటరి కాపర్ని....
విభూదంటిన తన వేళ్ళను
నిట్టూర్పుల తడిలో కడుగుతూ--
ఆత్మ కాల్తున్న ఈ పదకొండురోజులూ
ఈ వాసనుంటుందన్నాడు....మరణం కాలుతున్న వాసన.....
నిష్కామంగా నిష్క్రమించే ఆ నిముషం కోసం
మిగిలే ఉంటాను....
చిల్లుపడిన మొక్కలగోలెంలా.....
ఏం ఇంకిందో....ఏం వొలికిపోయిందో!
    **
ఎంత అందమైన పువ్వైనా వాడిపోకతప్పదన్నట్టు...
కహీ దూర్ జబ్ దిన్ డల్ జాయె....

(కొన్ని మరణాలు జీవితాన్ని ప్రశ్నిస్తాయి, కొన్ని జీవితాన్ని నిర్వచిస్తాయి...మరికొన్ని మనల్ని సమాయత్తపరుస్తాయి...)

8 comments:

  1. జీవితం వెంట నీడలా ఉండేదేమిటో అని అనుకుంటాం...
    అదేగా మృత్యువు...
    మనిషికి తప్పని మరణంపై చక్కని కవిత...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. హాయ్ శ్రీ గారూ మీ ఆదరాభిమానానికి ధన్యుణ్ణి.అవును మనకు నచ్చని మన మృత్యువు. దాన్ని గురించి ఎప్పుడో ఒకప్పుడు ఓ మాట అనుకోక తప్పదుకదా

      Delete
  2. చక్కగా రాశారు, అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు భాస్కర్ గారూ క్రమంతప్పకుండా నా రచనలని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు చెప్తున్నందుకు కృతజ్ఞతలు

      Delete
  3. వాసు దేవ్ గారూ, కవిత అధ్బుతం గా ఉంది. చాలా మంచి వివరణ. భాదే సౌఖ్యమనే భావన తెచ్చుకోవాలి ఏమిచేద్దాం.

    ReplyDelete
    Replies
    1. ఫాతిమా గారూ అంతే బాధే సౌఖ్యమనే భావన తప్పదుగా...కృతజ్ఞతలు

      Delete
  4. వావ్...అదరగొట్టారుగా భాధని కూడా:-)

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు పద్మగారూ...బహుకాల దర్శనం. మీరు మాబ్లాగ్ దర్శించి అభిప్రాయాల్ని తెలియజేసినందుకు ఋణపడి ఉంటా

      Delete