Wednesday, March 14, 2012

మూగవోయిన అక్షరం

అప్పుడప్పుడు నా అక్షరం మొరాయిస్తుంది
మండకుండా---
ప్రతీ అక్షరంలోనూ ఓ ప్రమిద
కొన్ని గుడ్డిగా, కొన్ని దివ్వెగా
కొన్ని అక్షరాలంతే
సిరా చుక్కలుగానే మిగిలిపోతాయి
కన్నీరెండిన కళ్ళలా......

ప్రతీ అక్షరం ఓ ప్రస్థానం
రెండింటిమధ్య ఖాళీ
ఓ ఇరుకు మజిలీ!

ఒక్కోసారి
ఎక్కడో, ఏ కాగితంనుంచో
జారిపోయి
నిరాశ్రయంగా నన్ను వెతుక్కుంటూ
అతుక్కుంటూ....
నా దగ్గిర ఓ కావ్యమౌతుంది.

ఎన్నిపోరాటాలకి ఆయుధమైందని
తిరిగి ఏమివ్వగలిగాను
అందుకేనేమో
అప్పుడప్పుడు
గుండె వెనక దాక్కుంటూ
మౌనంగా రోదిస్తూ
నన్నూ ప్రతిఘటిస్తూ....అలుక్కుపోతుంది

ప్రతీ అక్షరానికి
నువ్వనాధవి కాదన్నది
చివరిమాట కాలేదు

ప్రతీ అక్షరానికి
నా గుండె ఓ గవ్వగది
ముడుచుకుపోతూనే ఉంటుంది
అవసరమైనప్పుడల్లా!
అలా ముడుచుకున్న నా అక్షరాన్ని
ఏ అమానుషమో, అకృత్యమో
నిద్రలేపుతుంది ఉక్కిరిబిక్కిరిగా!
అక్కడే అప్పుడే
అవన్నీ గండికొట్టినట్టుగా
కాగితంపై వచ్చిపడుతుంటాయి
వడగళ్ళవానలా,
నా రక్తాక్షరాలన్నీ!

పాతకాలపు పుస్తకాల్లోంచి
వాసనగా జారిపడుతున్న
అక్షరాలన్నీ
స్పృశించమని అడుగుతున్నట్లే అన్పిస్తాయి!

అక్షరాన్ని
ప్రేమిస్తూనే ఉంటాను
మాట సాయంకోసం అర్ధిస్తూ!
మోదాన్నీ, దుఃఖాన్నీ మోస్తూ
తన ఒళ్ళంతా గాయాలపాలు
నన్నూ మోస్తూనే
మూగవోతూనే ఉంటుంది
నా అక్షరం.......


11 comments:

  1. ప్రతీ అక్షరానికి
    నా గుండె ఓ గవ్వగది
    ముడుచుకుపోతూనే ఉంటుంది
    అవసరమైనప్పుడల్లా!
    అలా ముడుచుకున్న నా అక్షరాన్ని
    ఏ అమానుషమో, అకృత్యమో
    నిద్రలేపుతుంది ఉక్కిరిబిక్కిరిగా!
    అక్కడే అప్పుడే
    అవన్నీ గండికొట్టినట్టుగా
    కాగితంపై వచ్చిపడుతుంటాయి
    వడగళ్ళవానలా,
    నా రక్తాక్షరాలన్నీ..

    this says it all..dev ji.. nice poem.. humane feel

    ReplyDelete
  2. నలిగిపోతే పోనీ
    సుమగానం-నా కావ్యం
    కరిగిపోతే పోనీ
    ఆమరణం- నా బాల్యం
    రగిలిపోతే పోనీ
    నక్షత్రం- నా నేస్తం
    పగిలిపోతే పోనీ
    సంచలనం-నా హృదయం

    ( మీ అక్షరం కోసం..
    చిన్న ప్రయత్నం..! )

    ReplyDelete
  3. What a flow of words n thoughts Dear Srinivas Vasudev ji
    abhinandana mandaara maala...

    ఒక్కోసారి
    ఎక్కడో, ఏ కాగితంనుంచో
    జారిపోయి
    నిరాశ్రయంగా నన్ను వెతుక్కుంటూ
    అతుక్కుంటూ....
    నా దగ్గిర ఓ కావ్యమౌతుంది....Wonderful Sreyobhilaashi ....Nutakki Raghavendra Rao.(Kanakambaram.)

    ReplyDelete
  4. శ్రీనివాస్ గారూ,
    మీ అక్షరం మానిఫెస్టో బాగుంది. "ప్రతీ అక్షరం ఓ ప్రస్థానం, రెండింటిమధ్య ఖాళీ ఓ ఇరుకు మజిలీ!" అన్నది నాకు బాగా నచ్చింది. వ్యవసాయానికి మంచి విత్తనాల్ని ఏరినట్టు, మాటల్ని కూడ ఏరుకోవలసిందే. భావాలు ఒక్కోసారి మాటల మూసల్లో ఒదగనప్పుడు చాలా ఇరుకుగా ఫీల్ అవుతాం.
    అభినందనలు.

    ReplyDelete
  5. last lines are very effective dev .....very nice expression....love j

    ReplyDelete
  6. WOW.. MI AKSHARANIKI PADUNU EKKUVA ANDI.. CHALA BAGUNDI VASU ji.

    ReplyDelete
  7. పద్యం చాల బాగుంది. కృత్యాద్యవస్థనీ, కృతి ఇచ్చే ఒక రకం ‘సంతోషా’న్నీ హృద్యంగా చెప్పారు. నాక్కూడా ‘ప్రస్థానం’లో ఉన్న అక్షరాలు ‘రెండింటి మధ్య ఖాళీ/ ఒక ఇరుకు మజిలీ’ బాగా నచ్చింది. బహుశా అదే ఈ పద్యాన్ని కుదురుగా నిలబెట్టే గరిమనాభి. అనిర్వచనీయంగా ఉండిన లోపలి శోధన/వ్యథ.... ‘ఏ ఆమా‍నుషమో ఏ అకృత్యమో నిద్ర లేపిన’ట్లు కావడంతో అది కవిని వదిలి లోక విహారానికి బయల్దేరుతుందనేది కవికి మాత్రమే తెలిసే అనుభవం. దాన్ని తన పాఠకుడితో పంచుకోవడం బాగుంది.

    ReplyDelete
  8. అక్షరం కవితలో ఒదిగి అక్షయం అవుతుంది..

    ఇది ఓ అక్షయ భావ కవిత దేవ్ జీ..

    ReplyDelete