Saturday, April 21, 2012

ఖాళీ నీడల్లో.....

మీదేహం!
పింగాణీ గుండెలకి
గాజుపూల బొత్తాములతో....
వెన్నెలని తొడుక్కున్న సూర్యుడిలా
ఆ మంటలు దాగిన గుండెలూ
మంచుముక్క ఆపధ్ధర్మపు కర్కశత్వంలా!

మీ మార్మిక దేహం!
తడారిన ఆడతనపు ఆక్రందన
ఓ సగం పైనా.......
నిర్జీవకణాల మగసిరి
సిగ్గెండిన నాభి దిగువగా.....!
తెగించలేనిమౌనం, తెగువతగ్గినమానం
రెండింటితో
మొహంచాటేస్తూ మీరు....

రాయిలా వక్షం,
పరాయిలా మోహం....
మనసుని చాటింపునేస్తూ
మీరు....అర్ధత్వంగా!

ఆలోచనలని చీల్చబోతే
రెప్పల కిందన దాక్కున్న
అక్షరాలన్నింటినీ కప్పేసాయి
కసాయి సంస్కారాలు


చిల్లులుపడ్డ మీ చిర్నవ్వు
మసకలో నవ్వుతూ
వెతుక్కుంటున్న అస్థిత్వం....!

కన్నీటి ఋతుస్రావమేనా
మీకు ప్రతీరాత్రీ?
నెలకు బదులుగా...దినసరి!
మీలోకి చూడొచ్చా?

దేవుణ్ణీ శపిస్తారు
విధినీ వెక్కిరించగలరు
ఇక మిగిలిందేమని
డ్రాయింగు పుస్తకంలోని గీతల్లా
మీ గీత అవగతమా?

జారిపోతున్న పైటలోనూ కర్కశత్వమే!
పలకరించలేని నిస్సహయత.....
అర్ధంకాని దేహ సంశయం

గుండె గీతల్లో ఖేదం
నడుము వంపుల్లో భేదం
మనసు పగుళ్ళలో రోదనం
మీ  ఖాళీనీడల్లో  దైన్యం....

మీ గుండెల్ని చేరుకున్న
నా చేతులు మీ మనసుని
కౌగలించుకోలేకపోతున్నాయి........

జీవన మర్మంలో అర్ధంకాని
దేహమర్మం....మీ ఖాళీ నీడల్లో!
                  -------వాసుదేవ్
( ఈ దేశంలో వీళ్ళెక్కువ. hermafrodites...పైకి మాత్రం చాలా సంతోషంగా కన్పించే వీళ్ళందరూ  బాధాసర్పదష్టులే.... మాలో భాగమై, మాతో సహజీవనమై, జనజీవనస్రవంతిలో అన్యమనస్కంగా మెలుగుతూ ఉండే ఈ సగంజీవులపై ఈ చిన్న రచన. వీళ్ళ గురించి ఆలోచించామని చెప్పడంకోసం, అలాగే బ్యాంకాక్ లో చూసిన లేడీబాయిస్ షో కూడా నేపథ్యంలో పనిచేస్తూనే ఉంది. అక్కడ--థాయ్‌లాండ్ లో వీళ్ళు చాలా ఎక్కువని అందరికీ తెల్సు)

9 comments:

  1. మీరు వ్రాసింది చదివితే వీరంటే జాలి
    వీరిని గూర్చి వింటుంటే మాత్రం భాధ
    నాకు వీరిని చూస్తే ఎందుకో భయం.

    ReplyDelete
  2. ధన్యవాదాలు పద్మగారూ..వీరిని మనం మనదేశంలో బహిష్కృతులుగా వెలివేసి చూస్తాం దాంతో వారుకూడా సమాజంపై కసితో తేడాగా ప్రవర్తించడం సహజమే....వారినిచూసి భయపడ్డమూ సహజమే...కానీ వీరు మామూలు మనుషులుగానే ప్రవర్తిస్తారు...వీళ్ళని అన్ని రకాల ఉద్యోగాల్లోనూ చూస్తాం ఇక్కడ మేము..

    ReplyDelete
  3. srinivas garu.. ur poem is so empathetic filled with all emotions of unexplained pain,.. Ur poem made a perfect replica of the life's mystery beyond expressions.. the words, the observations and the hidden inner meanings are competed with each other in the poem and made it as a complete revelation of human agony in its myriad forms..
    above all, the title of the poem-- khaalee needalu, empty shadows, is very thought provoking and had great depth of understanding.. kudos to u ..

    ReplyDelete
  4. ధన్యవాదాలు హరికృష్ణగారూ...మీ ఈ స్పందనతో మరిన్ని రాయగలననే ధైర్యం ఇచ్చారు.

    ReplyDelete
  5. very well depicted vasudev sir...
    vijayabhanukote.

    ReplyDelete
    Replies
    1. ThanQ Bhanu jee..I appreciate your appreciation of the poem.

      Delete
  6. మీ పోస్ట్ తో వారిపై ఆలోచనను, ఆర్తిని కలిగించారు వాసుదేవ్ గారూ..నిజానికి
    మన ఇండియాలో కూడా వీళ్ళని అలానే చూస్తున్నాం కదా..ఎక్కడైనా బహిష్కృతులే వారు..ఇటీవల సినిమాలలో కొంత వీరిపట్ల ఆలోచన కలిగేట్లు చూపిస్తున్నారు.. నిజానికిలా అక్కున చేర్చుకోవాల్సిన వారెందరో..మంచి పోస్ట్ రాసినందుకు నెసర్లు..

    ReplyDelete
  7. ధన్యవాదాలు అనికేత్ గారూ..ఇంకా మనదేశంలో వీరికివ్వాల్సిన గౌరవమర్యాదలు ఇవ్వకనే వారు భిక్షాటనఎంచుకునే పరిస్థితి.దానికి మనసమాజమే కారణం. పైన పద్మార్పితగారు చెప్పినట్లు ఇంకా మనం వాళ్ళనిచూసి భయపడే స్థితిలోనే ఉన్నాం కదా? కాని ఇక్కడలా కాదు.వీళ్ళకి అన్ని ఉద్యోగాల్లోనూ సమానహక్కులు, సమాన ట్రీట్మెంట్ కూడా....మీ స్పందనకి మరోసారి కృతజ్ఞతలు

    ReplyDelete
  8. కదిలించిందండి మీ కవిత.

    ReplyDelete