Sunday, February 5, 2012

"ది డర్టీ పిక్చర్"


"ది డర్టీ పిక్చర్"
ఓ జోగిని స్వగతం

పుట్టినప్పుడు పురిటివాసనన్నారు
ఆడపిల్లేనా అని మూతి ముడిచిన ముదితలు
మరో దేవుడి భార్య పుట్టిందన్నారు
నా చిన్ని నుదుటిరాతా రాస్తూ....
నా డిబ్బి చిల్లరకు మట్టి వాసనన్నారు
అమ్మా! నా డిబ్బి పగులగొట్టనే!

నన్ను పెద్దమనిషని సంబరాలు
పసుపులో పచ్చగా చేసిన దేహం
ఆ రోజు--
నా పావడాలు పసుపు
నా పరుపు పసుపు
నా ఒడలన్నీ పసుపు...

నన్ను పెద్దమనిషనన్న
పెద్ద మనుషుల కుట్ర దాచేశారు
నన్ను
ప్రాయపు పరువాల పందిరన్నారు
పగిలిన గుండెలపై కన్నీళ్ళ పర్యంతమయ్యాను!
ఈ రోజు--
నా కలలు ఎరుపు,
నా కన్నీళ్ళెరుపు
కనురెప్పల క్రింద చీకటీ ఎరుపు
అమ్మా! నా డిబ్బి పగులగొట్టనే.

చాపలు పరిచారు, బలికి సిధ్ధమన్నారు
దేవుడితో పెళ్ళన్నారు
పూజారి మంగళసూత్రం
పటేలు పశుదాహం
చేజారిన పైటనుండి దుమికిన బాల్యం
అమ్మా! నా డిబ్బీ పగులగొట్టనె--

వెన్నెల రాత్రులని శరత్తు దిళ్ళ కెత్తుకున్నాను
మేఘాలంతా రాసుకున్నాను నా కతలు
ఈ విశ్వం ముగిసిన అంచున నాలో నేను
అస్పష్ట కాలచక్రంలో అలుక్కుపోయిన
గడియారపుముళ్ళ మధ్యలో నేను...
కన్నీటి సంద్రాన వెతల పడవలూ
ఓలలాడించుకున్నాను....
అమ్మా! నా డిబ్బీ పగులగొట్టనే.....

నా దేవుడు నన్ను ఆక్రమించుకుంటూనె
గొణిగాడు, సహకరించమంటూ--
ఏ రాత్రి వసంతరాత్రి కాలేదు
ఏ భర్తా మరోసారి రాలేదు
చీకటి కోణాల చెలగాటం!
భంగపడ్డ మానానికి ప్రాణసంకటం.
అమ్మా! నా డిబ్బీ పగులగొట్టనె

జాలరి ఇంట్లోనూ అందమైన అక్వేరియం
అక్కడ చేపపిల్లలకీ ఎంతో మురిపెం
అడక్కుండానే గుప్పెడు ప్రేమస్వంతం
నాకేదీ జీవిత స్వతంత్రం?
అమ్మా! నా డిబ్బీ పగులగొట్టనే.

నన్నూ ’జోగినీ’ అన్నారు
అభద్రతా భవనంలో ’జోగనీ’ మన్నారు
ప్రతి రాత్రి ఓ గాయం, ప్రతీ స్పర్శ ఓ దుస్వప్నం
బావురుమన్న గుండెంతా నిశ్శబ్దనీరవం
కన్నీటిలో కరిగిన కాటుక
నా గాయాలకి లేపనం
గాజుపెంకుల పంజరంలో
నేనూ ఓ జోగినిని
అమ్మా! నాకు దేవుడి మొగుడొద్దే
మనసున్న మనిషే భర్త కావాలి

అమ్మా! నా డిబ్బీ పగిలిపోయిందే
అంతా మట్టివాసనే
ఆఖరికి నా దేహంకూడా
మట్టిముద్దనుంచి మనిషిముద్దలోకి
మళ్ళి మట్టిముద్దలోకి
అమ్మా! నేనూ అమ్మలా పుడతానే
మరోజన్మలో...

13 comments:

  1. డియర్ శ్రీనివాస్ వాసు దేవ్ జీ...గుండెలు ద్రవింపజేసే ఓ వాస్తవ జీవన చిత్రం చిత్రించడం... శహభాష్ అన్నంత సులువు కాదు. అభినందించేందుకు అర్హుణ్ణి కాదు.వావ్ ! అని ఆశ్చర్యపోయి నిశ్చేష్టత పొందడం తప్ప. ఈ కవిత చదవే అవకాశం కలిగినందుకు ధన్యుణ్ణి. Sreyobhilaashi ....Nutakki Raghavendra Rao. (Kanakaambaram)
    -

    ReplyDelete
  2. వాసుదేవ్ గారు నమస్తే ,

    హిందుత్వం లోనికి వచ్చిన ఒక దురాచారాన్ని మీరు ఎండగట్టిన తీరు హృదయాన్ని ద్రవింపజేసింది, ఒక "జోగిని" తన జీవిత కాలంలో అనుభవించే బాదలు, కష్టాలు, మానసిక - శారిరిక వేదనను అద్బుతంగా మాచే అనుభవించజేశారు మీకిదే నా "సలాం"
    కనకాంబరం గారు అన్నంట్లు నేనూ అభినందించేందుకు అర్హుణ్ణి కాదు

    ReplyDelete
  3. వాసుదేవ్‌గారూ...

    మీరు రాసింది చదువుతుంటే కళ్లలో నీళ్లు నాకు తెలియకుండానే వచ్చేశాయి.

    జోగినిగా మార్చబడ్డ స్త్రీ శారీరక, మానసిక వేదనను హృదయం ద్రవించేలా మీవైన మాటల్లో అక్షరీకరించారు.

    ప్రతి రాత్రీ ఓ గాయంలా, ప్రతి స్పర్శా ఓ దుస్వప్నంలా, గుండెలు బావురమంటూ..... బ్రతికే జీవితం తనకు వద్దనీ, దేవుడు మొగుడుగా అస్సలే వద్దనీ.. మనసున్న మనిషైనవాడే భర్తగా కావాలంటూ... జోగినీ మహిళ ఆర్తనాదం చెవుల్లో మార్మోగుతున్నట్లుగా ఉంది....

    మరో జన్మంటూ ఉంటే అమ్మలాగే నేనూ పుడతానంటూ జోగిని చెప్పే మాటలు...... తనను జోగినిగా మార్చిన పెద్ద మనుషుల చెవులను ఎప్పటికీ తాకవేమో.......

    కానీ.. మనసున్న ఏ మనిషినయినా మీరు రాసిన ప్రతిమాటా కదిలించివేస్తాయి...

    నిజంగా మీ ప్రయత్నం అభినందనీయం... ధన్యవాదాలు వాసుదేవ్‌జీ.

    ReplyDelete
  4. గుండె కదిలించే కవిత శ్రీనివాస్ గారు.

    ReplyDelete
  5. మనసుని కదిలించేసారు. జోగినుల బాధను కాలంలో నింపుకుని రాసేసారు..

    ReplyDelete
  6. "అమ్మా! నేనూ అమ్మలా పుడతానే
    మరోజన్మలో..."

    మాదిరెడ్డి గారిదే అనుకుంటాను, కథ పేరు గుర్తుకులేదు - పన్నెండేళ్ళ పనిపిల్లని అబ్యూస్ చేసే ఒక సన్నివేశం, కాశీభట్లగారి 'దిగంతం' లో వేశ్య పాత్ర, ఆమె మరణం కదిలించినంతగా మళ్ళీ మీ ఈ కవిత.

    ReplyDelete
  7. మదిని కలచివేసిన కవితా కధనం...
    Its really heart touching!

    ReplyDelete
  8. మీ కళ్ళ ముందే జరిగిన ఈ నీచ నికృష్ట దురాచారాన్ని చూసి తట్టుకోలేక, జోగినిలో ప్రవేశించి ఆమె ఆవేదనని పలికించినట్టునంది. కదిలించింది. వాసుదేవ్‌గారూ!

    ReplyDelete
  9. I felt rather dumb when I heard you recite this poem in kavi sammelanam in Vizag that day. felt the burden of the depth and agony in it and couldn't speak. This is such an expression sir...kudo's for its composition.

    ReplyDelete
  10. నాకు తెలియకుండానే రెండు కన్నీటి చుక్కలు రాలాయి. గుండె పట్టేసినట్లయింది.

    ReplyDelete
  11. జోగిని జాగారణలో ఎంత బాధ ఉంటుందో
    ఆ నీచత్వాన్ని బలవంతంగా తనపైన పులిమి ఆనందించే వారికి.... ఆ వేదన మాటున వేధించే మగడు దేవుడైన వద్దనుకునే స్థితి ఎప్పటికి వినిపిస్తుందో


    "అమ్మా! నాకు దేవుడి మొగుడొద్దే
    మనసున్న మనిషే భర్త కావాలి"

    అసలు ఎక్కడ దొరుకని ఆశ అడియాశ అవుతుంది అని తెలియని పిచ్చి మా తల్లిని తలుచుకుని ఒక జాలి పడుతూ,
    మీ కవితతో మనసులో దూరిపోయి కన్నీరు పెట్టించిన మీలోని ఆ మనసుకి నా వందనాలు

    ReplyDelete
  12. @రాఘవేంద్ర,@యోగేశ్వర్,@జాన్ హైడ్,@కల్పనా రెంటాల,@ఉష,@శోభ, @ప్రవీణ,@పద్మార్పిత, @వీరశంకర్, @విజయభాను,@ఆలమూరు సౌమ్య, @శ్లోకా శాస్త్రి--అందరికీ ధన్యవాదాలు. ఓపిగ్గా చదివి మీ అభిప్రాయాలని తెలియజేసి నాకు మరింత ప్రోత్సాహాన్నీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు

    ReplyDelete