Friday, August 9, 2013

ప్రేమ సూక్తం



నీ ఊసుల్లా ఈ కవితకీ మొదలూ చివరూ ఉండదులే

ఊహల్లో దూరాన్ని భర్తీ చేసే నీ 'ఊ' లే అన్నీ

నా ఊపిరిలో భగ్నమైన అ రెండు క్షణాలనీ బంధించాలనుంది

అవైనా నీ ప్రేమని చెప్తాయా?

అప్పుడప్పుడు అక్షరాలపై జాలేస్తుంది

ఎంత నిశ్శబ్దాన్ని మోస్తాయని!

ప్రేమని చెప్పలేక జారుకుంటాయి, అమాయకంగా!

నువ్వు గుసగుసలాడిన మాటలన్నీ

నడుందగ్గర ఓడిపోయాయిగా

ఆ క్షణాన్ని ప్రేమీకరించి మనసుదగ్గరొదిలొదెయ్యనా

నువ్వేదో అన్నావే....ప్రేమని గెలిపిద్దామా అని

అదెంత సమ్మోహితమైందనో....

నువ్వు ఉన్నవన్నీ జలతారు క్షణాలే

మనమధ్య ఉండలేక జారిపోతుపోతుంటాయి

ప్రతి సాయంత్రానికి ప్రేమ గంధం పూయాలిక

ప్రతీ వర్షపు గోళపు తాకిడిలో

మువ్వలూ గజ్జెలూ

కొన్ని వేల పారిజాత సువాసనలు

ఓ పసుప్పచ్చ ఆకాశం మనకో సాక్షి!

కొన్ని స్వీట్ నథింగ్స్ ని చెవిలో వదిలేయ్

వాటికర్ధానద్దుతా

వాటిని మనిధ్దరిమధ్యా జొనిపోద్దాం

నడుముకీ చీరకుచ్చెళ్లకీ ఇరుక్కునిపోతాయి

అగమ్యగోచరంలా...

శ్రావణమేఘంల్లొకీ ఓ ప్రవేశం!

నెను నీలోకెళ్ళిన ఆ మధురక్షణం

అదె ప్రేమాక్షరం

ప్రేమ సూక్తం లా

ఏం చెప్పను? చెప్పకుండానే చెప్పిస్తావుగా

ప్రేమ సూక్తంలా....

మనసునేవీ మభ్యపెట్టవు

నువ్వు తప్ప...

అప్పుడెప్పుడొ నువ్వొదిలిన నిట్టూర్పే

ప్రేమ కవితైంది నీలా అందంగా....

ప్రేమగా!

4 comments:

  1. అందమైన ప్రేమకావ్యం మీ కలం నుండి జాలువారి బ్లాగ్లోకాన్ని హాయిగొల్పిందిలా....రాస్తుండండి వాసుదేవ్ గారు.

    ReplyDelete
    Replies
    1. ధన్యోస్మి పద్మాజీ! మీ స్పందన ఇక్కడ శాశ్వతంగా నిలుస్తుంది కాబట్టి ఇక రాస్తుంటాను.

      Delete
  2. ప్రేమగా అల్లిన పదమాలిక బాగుందండి

    ReplyDelete
    Replies
    1. సృజన గారూ కృతజ్ఞతలు.మీ ప్రోత్సాహం మరిన్ని కవితలకు నాంది కాగలదు.

      Delete