Monday, December 13, 2010

ఆత్మ'కథనం'

సృష్టి, స్థితి, లయ కారుల్ని ఏకంచేసి
నాలో కలిపేసుకుని కూడా నా అస్థిత్వమడిగాను
ఆత్మన్నారు! సంభాళించుకున్నాను.
ప్రాణం ఉన్నచోటే నేను నా మనుగడ
ప్రాణానికి నీడగా నేను!
నెగటివ్ ఫిల్మ్‌లోని బొమ్మలా.

బొంబాయి నెత్తుటిరోడ్లు, తియాన్మెన్‌స్క్వేర్లు,
జలియన్‌వాలాబాగ్‌లు, ఖ్మేర్‌రోజ్ గృహాల్లో
ఎంతనుభవించానని నా నుండి శరీరం విడిపొతున్నప్పుడు!
వయసుతో నన్ను నాకోటని భాగించినప్పుడల్లా
బాధపడ్డాను, ఆస్థిని, అస్థికల్ని సమానపర్చినందుకు!

ఎన్నో అమానుష మరణాలు
అవమానాల ఆత్మహత్యలు
మోసపూరిత చావులు, హత్యలూ
అయినా నేను చెక్కుచెదరలేదు.
కొత్త అతిథేయ శరీరాన్ని పొందినప్పుడల్లా
ఉమ్మనీరు అంతే రుచి, అదే అనుభూతి,
ఏరోజూ పాచి అన్పించలేదు...

విబ్జియార్‍లోని ఏడురంగుల్ని న్యూటన్ చట్రంలో
బంధించి చూస్తే రంగేలేని తెలుపేవచ్చినట్లు
నేనున్న ప్రతీశరీరం పవిత్రమే.
నా కళ్ళకి ఆర్ద్రతని తాపడంచేస్కుని
కనురెప్పల మాటున దాగిన ఆవేదనల్ని
చదవడానికి ప్రయత్నించాను, నాకే తెలిసేది అంతా

ఆనందాల్ని, ఆవేశాల్ని నా శరీరం నాకే చెప్పేది
అలా ఆనందించేలోపే నా శరీరాన్ని ఎవరో ఛిద్రం చేశారు
"యాసిడ్" అని ఎవరో గొణుక్కోవటం విన్పించింది
విన్నా విననట్టే ఉండిపోయాను.

చిరునామాగా శూన్యాన్నే తీస్కుని
నా ప్రస్థానంలో మరొమజిలీ, మరో అతిథేయత్వం
మరో పార్థీవం, మరో ప్రాణం
అయినా నాకు స్తలమఖ్ఖ్జర్లేదుగా
నా శరీరంకోసం మాత్రం ఓ ఆరుగజాలు చాలు.

************

1975--1979 అంటే దాదాపు నాలుగేళ్ళు కాంబోడియాని పరిపాలించిన అతి క్రూర ప్రభుత్వాల్లో ఒకటి ఖ్మేర్ రోజ్. మేధావి వర్గాన్ని దేశద్రోహులుగా భావించి సుమారు 2 మిలియన్ల ప్రజల్ని అతి కిరాతకంగా, (మహిళల్ని మానభంగం చేసి మరీ) చంపించిందీ ఈ ఖ్మేర్ రోజ్. బహుశా ఈ శతాబ్దపు అతి క్రూరమైన బలవన్మరణాలలో చెప్పుకోదగ్గది ఇదేనేమో!

2 comments:

  1. కొత్త అతిథేయ శరీరాన్ని పొందినప్పుడల్లా
    ఉమ్మనీరు అంతే రుచి, అదే అనుభూతి,
    ఏరోజూ పాచి అన్పించలేదు...

    చాలా టచింగ్ గా చెప్పారు..
    మళ్ళీ చదివి మరల రాస్తాను...

    ReplyDelete
  2. అద్బుతం మిత్రమ. విశాఖపట్నం మీద కూడా మీరు మంచి కవిత్త రాయాలి. ఉత్తరాంధ్ర జిల్లాల కస్టాలు, కన్నీళ్ళు కూడా కవితలుగ మలచాలి. మి పద ప్రయొగం బాగుంది.

    ReplyDelete