Thursday, January 10, 2013

నువ్వూ, నేనూ…. ఓ ద్వీపం!

నీలోని నిన్నునొదిలేసొచ్చేయ్
మనిద్దరం ఓ ద్వీపమౌదాం
శతాబ్దాల చరిత్ర మౌనంపై నడిచొచ్చేయ్
ఓ విశ్వ శకలమవుదాం
అన్నింటినీ కత్తిరించేసుకుంటూ….

స్పెర్మ్ తీకాలోని జీవకణంలా ఓ దిశకోశం నేనూ
వెల్వెట్ స్వప్నాలంచులపై నిల్చొని నువ్వూ
ఒక్క కలైనా నిజం కాకపోతుందాని….

ఓ ఉల్కపైనో, స్వాతిముత్యంపైనో
మాటలుకట్టుకున్న నా సంతకం నిన్ను పలకరిస్తుంది

గులిస్తాన్లో గుల్మొహర్లు దోపుకున్న వనకన్యలా నువ్వు
నా పలకరింపుఅంచు పట్టుకుని వస్తావులె
***
ఓ నిర్వికల్వంలో ఇద్దరం
నిర్విష్టంగా కలియతిరుగుతూ….ద్వీపమంతా
నేలంత జాగ్రత్తగా గుండెల్లో దాచుకుంటావుగా!

ఓ సారి ఔనన్నాక
నీకు తెల్సా? మాటకీ సుఖం, మౌనానికీ సుఖం
మాటల్ని పొదువుకున్న మనసుకీ సుఖం

నువ్వొచ్చాకనే నా వెతుకులాట ఆగింది
తెల్సిందిదే–
దు:ఖం అనివార్యం
ప్రేమ అవిభాజ్యం
క్షమ అనిత్యం
***
అయినా–
కాలం తాళం తీసి మరీ నిన్ను లాక్కుంటానా
నీ చిర్నవ్వుతో ఆ రాత్రిని వెలిగించుకుంటాను!
నువ్వూ నేనూ…ఆ ద్వీపం!