Wednesday, November 21, 2012

కాలంలో.....ఆమె! గాలంలో నేను!!

1.
నువ్వున్న ఆ క్షణం
కాలంపై ఓ పచ్చబొట్టు
2.
ప్రపంచానిక్కట్టుకున్న వారధిపైనుంచి
అన్నీ ఒంపేసుకుని నన్ను నేను ఖాళీ చేసుకున్నా
తరుముకొస్తున్న
నీ నవ్వుని తురుముకోడానికైనా...
3.
నిద్రలో జోగుతున్న గడియారమేదో
ఉలిక్కిపడి గంటలుకొట్టినట్టు
నువ్వెప్పుడూ నాకో అద్భుతమే సుమా
సముద్రంపై నడిచినట్టూ
గడ్డిపరకల కొసలపైనున్న
మంచుబిందువులతో నీ బొమ్మగీస్తున్నట్టూ

4.
శరత్పూర్ణిమ వెన్నెల్లాంటి చీరని
ఒళ్ళంతా చుట్టుకున్న నిన్ను చూసి
చీకటిగొంగ మేఘాలనడ్డుతెచ్చుకున్నాడంట
ఉదయించటానికి తటపటాయిస్తూ!
5.
ఇదిగో ..
ఇలా--
నీకోసమేం చెప్పలేకపోతున్నానని
మనసు చివుక్కుమన్నప్పుడల్లా
గుండె చుట్టూ విరహ నివురు...
కొత్త క్షణాలను తనలో
బిగించుకున్న కాలమెలాగూ
నీ గురించి చెప్పకమానదు

6.
కరిగిపోయిన ఆ ఘడియలగురించి
విచారమేం లేదులే
ప్రతీదీ ఓ ప్రేమకథనిచ్చి
రాలిపోయినదే నెమలీకలా
7.
మనసు మాటలు చెప్తానని
చుక్కానివైయ్యావు చూడు
అప్పుడె
ప్రేమాక్షరాల రంగులతో
మనసుకుంచె పనితనం
జ్ఞాతమయింది....
నీ ప్రేమా జ్ఞానమైంది

Sunday, October 21, 2012

కన్ఫెషన్స్-1

రాత్రిపై నుంచి నడిచొచ్చానా
గుప్పెడంత చీకటినీ తెచ్చుకోలేకపోయాను!
కళ్ళకింద కలలన్నీ కన్నీళ్ళలో
కదులుతూ
కథలుగా మారలేకపోయాయి

ఓ అక్షరంలో కూర్చుని మరొకదాంతో
చెప్పుకుంటూ ఉంటాను
ప్రతీపదం ఓ కన్ఫెషన్ బాక్స్ మరి...

దొర్లుకొస్తున్న ఖాళీ సీసాల్లా కొన్ని జ్ఞాపకాలు
ఖాళీలకి ఫ్రేముకట్టి మరీ మోస్తాయి..
సమాధికాబడని జ్ఞాపకాలు కొన్ని!
తడిసిన కాగితంలోని అలుక్కుపోయిన అక్షరాల్లా
ఈ జ్ఞాపకాలు....

అర్ధంకాని బంధాలేవో
పేపర్ వెయిట్‌‌లా జీవితావేశాన్ని
అదిమిపెడుతుంటాయి
తేమకీ, తడికీ తేడాతెల్సెదెప్పుడు
ఆర్ద్రతెప్పుడో ఆవిరై ఆరిపోయిందిలె

సమాధిలో శవానికి మిత్రుల్లేరన్న
'గాలి' ఊళల్లోని మాటలు కొన్ని చెవిదాటిపోవు
అవును
పిరమిడ్లలోని రాళ్ళేవీ
జీవితతంలోని డొల్లతనాన్నీ నింపలేవు
నా దృష్టినీ అడ్డుపెట్టలేవు
అయినా ఏం చూస్తున్నానని?

రాత్రికట్టుకున్న నల్లచీరలాంటి చీకటీ
సంద్రాన్నంతా కప్పేసుకున్న అలలనురగల్లోని తెలుపూ
రంగులన్నింటినీ తమలోకి లాగేసుకుంటే
ఇక నాకేం మిగిలిందని....?
కన్నీటి రంగుతప్ప!

అరువుతెచ్చుకున్న మేధోతనమేదీ నిలబడదు
చిన్న ఒంటికి పెద్ద అంగీలా
అసహజంగా, అసమానంగా....

అటో ఇటో ఎటో
ఎటూకానీ అవస్థాంతరం
ఈ నడివయసు!
విస్తరించుకుంటున్న శూన్యత
ఆఖరికి ఈ పాపనివేదన గదిలోనూ...

Thursday, October 11, 2012

దైవమిచ్చిన భార్య

నువ్వు ప్రేమించావన్న ఆ క్షణం
మరీ బరువెక్కింది గర్వంతో!
ఆ ముందు క్షణాలన్నీ కాలిబూడిదయ్యాయి.
ఆ గతకాలపు కుప్పలోంచి
ఏ ఫినిక్స్ లేస్తుందో నీ ప్రేమని చూపిస్తూ!
*
"నేనున్నాను, నీవల్లే"
అని అనుకోవడం మాములుగా జరగదు
నువ్వున్నా లేకున్నా ఇక
ప్రేమరాహిత్యం ఉండదు, జీవితాంతం!

* *
'నువ్వ’ నే అద్దంలో నా అహం
కన్పడుతూనే ఉంటోంది, మండుతూ
నా మనసుకీ, నీ ప్రేమకీ మధ్య
ఈ బైరాగత్వం ఉంటూనే ఉంటూందిలె
బైరాగత్వం...ఉంటుందిలే, నీ తోడులో కూడా
నీకు లొంగిపోని ఆ క్షణమేదీ నాకఖ్ఖర్లేదు!
* * *
నీతో కల్సినప్పుడల్లా నీనుండి నాలోకి ప్రవహించే
ఆ ప్రేమనాపె శక్తి నాకులేదేమొ!
ప్రేమంటే చెప్పే నీ చేతలన్నీ ముద్దొస్తాయని
చెప్పేటప్పుడల్లా నీలోకి చూళ్ళేకపోయాను
మనసు పొగిలినప్పుడల్లా
నీ ఒడి నాకు ఆశ్రమవుతుంది
నీ మనసు నాకు నీడవుతుంది
నీ గుసగుసలన్నీ నాకో శబ్దమంజరి!

* * *
నీ గుండెలయంతా ప్రేమపాటన్నావు
తిరిగేమివ్వాలో...ఎప్పటికీ స్పందించలేను
కంటిమీద రెప్ప అసూయపడిందేమో
కునుకు లేదు...ఆ ఏక్ పల్ కోసం!
నిన్ను కప్పుకున్న ఆ క్షణం
గాలికూడా బెదిరిపోయింది సుమా
చెదిరిపోయిన కలలన్నీ
ఓ మూల చేరాయి దిగులుగా
వాటికి నీలాంటి భాగస్వామి లేదుగా!
* * * *
వాచ్ స్ప్రింగ్ లోంచి బయటపడ్డ మాటలు
నీ దగ్గరే ఆగిపోతాయి, చిత్రంగా!
అర్ధరాత్రి నువ్వనే 'నాన్నా'
ఎంత బరువనీ...నెనొక్కణ్ణే మోస్తానుగా
నిముషాల గోడలమీద
పర్చుకున్న క్షణాలన్నీ
గొంతెత్తి అరిచినట్టు, నువ్వు
ప్రేమిస్తున్నానంటూనే ఉంటావు!

* * * * *
జీవితంలో ప్రతీక్షణం తోడుంటానని
మనసుదాటని మాటల్ని
నీ నుదుటిపై సింధూరం
చెప్పకనే చెప్తుంటయి, నాతో ఉన్నానంటూ!
అదిగో అప్పుడె మాటల్లో చెప్పలేక
నీ గుండెలపై చేయేస్తానా, దానికి
ప్రేమనే ముద్రేస్తావు.
నువ్వు నువ్వె..ఎప్పుడూ నిన్ను చూసి
ప్రేమ అసూయపడాల్సిందే....
(దేహానికి బాధ కలిగినప్పుడల్లా 'అమ్మా' అని,  మనసుకి ముల్లు గుచ్చుకున్నప్పుడల్లా 'అమ్మలూ' అని ప్రేమగా పిల్చుకునే మనకి జీవిత భాగస్వామి ఓ వరం..ఆ ప్రేమమూర్తులైన దైవమిచ్చిన భార్యకి ఇది.... )

Tuesday, September 25, 2012

గుడిమెట్లు--ఓ శిధిల కథల సంచిక

గుడికన్నా ముందే పలకరించే
ఆ డైభ్భై ఏడు మెట్లూ డైభ్భై ఏడు కథలు
కష్టం వెనుకే సుఖమన్నది చెప్పడంకోసమన్నట్టు
*
ఒంపులుతిరిగుతూ ఊరించే ఆ మెట్లమీదే
బాల్యం చిన్నపాదాలతో....
ఒక్కోమెట్టుని వెనక్కి నెడుతున్నాననే ఆనందంలోనూ
అమ్మ చెయ్యి ఆసరాలోనూ కథలు అవసరం అన్పించవు
గతాన్ని ఎక్కడో కలిపేసె ఆలోచనలో అమ్మ
వర్తమానాన్నివొదిలేసె ఖంగారులో నేను
కొన్న జ్ఞాపకాలు......
* *
ఓ మెట్టు చివర్న అప్పుడె మొలకెత్తుతున్న ఓ గడ్డిమొక్కా
మరోమెట్టుఅంచున  కాలానికి లొంగిపోయిన శంఖంపువ్వు
దేన్నుంచి విడివడిందో మరో సంపెంగ రెమ్మా
అవన్నీ పలకరిస్తూ..
ఒక్కోక్కటీ ఒక్కోకథ
జీవితానికి సరిపడా !
* * *
అంత 'దూరం' వచ్చిన తర్వాతకానీ మెట్లాగవు
ఓ సారి వెనక్కి తిరిగిచూస్తే
దాటొచ్చిన జీవితంలా, రెపరెపలాడుతున్న పేజీల్లా
ప్రతీ మెట్టులో ఓ కథ విన్పడుతూనె ఉంది
ఆ కథలన్నీ
ఓ జ్ఞాపకం కూడా!
* * *
అక్కడే
ఓ పిలుపు మళ్ళీ...ప్రతీ మెట్టూ ఓ కథతో
ఎన్ని నగ్నపాదాలని మోసాయో
మరెన్ని కథల్ని విన్నాయో కన్నీటి నేపథ్యంలో
అవన్నీ ఇప్పుడు వెలలేని సంచికలు
* * *
అమ్మ అంటూనే ఉండేది
'నీతో గుడికిరావటం ఓ అనుభూతిరా' అని
అదేంటో అర్ధం కాని వయసు!
ఎన్ని అనుభవాల్ని అక్కడ కథలుగా వదిలిందో అమ్మ
మెట్లంతా రాళ్ళే...జ్ఞాపకాల శిలాజాల్లా
* * * 
ఏం జరిగిందో ఎందుకెళ్ళానో తెలీకుండానే
మెట్లు దిగుతూండగా--
చీరకొంగుతో నాచెయ్యి తుడుస్తూన్న ఆమెలో
తెల్ల రంగు అద్దుకున్న ఆ నవ్వు
అప్పుడేం తెలీదు, అమాయకంగా
ఇదిగో ఇప్పుడే అవగతం
గతాన్నీ ఇలానే చూడమని చెప్పిందేమో..
గుడిని పరిచయంచేసి, ఈ ప్రపంచాన్నిచ్చింది అమ్మ
* * *
ఆ తెల్ల నవ్వు,ఇంకా  గుండెల్లో పదిలం
గుడి...అమ్మ..ఓ జ్ఞాపకం
నిన్న వర్షంలో పట్టుకున్న
ఓ బిందువులా
కథలన్నీ చెప్పి జారిపోతూ!
జీవితపుటల్లో అందమైన బుక్‌‌మార్క్
ఈ గుడి..మెట్లు
* * *
ఆ గుడింకా ఉంది, మెట్లూ ఉన్నాయి
ఆ జ్ఞాపకమూ ఉంది
అమ్మే లేదు
చేతుల్లోంచి జారిపోయిన తీర్ధంలా
వెళ్ళిపోయింది......
నన్ను ఆ మెట్లమీదొదిలి
ఆ శిధిల కథలన్నీ నా
బతుకు బాటలో సహచరులు....
       26.September.2012

Tuesday, September 4, 2012

ఓ వాన కురిసిన రాత్రి! ఆమె తోడున్న రాత్రి....


నా అలసిన కనురెప్పల
దిగువన దాక్కున్న కథలన్నీ
నీ గుసగుసల్లోంచి పుట్టినవే సుమా!
ఒఠ్ఠు, ప్రేమసాచ్చి....

ఎప్పుడు కురిసినా, ఎలా కురిసినా
ఓ తన్నమయత్వంతొ కురుస్తూంటూంది
ఏరికోరి,  మరీ
కొన్నింటిని బంధించబోతానా
నగ్నంగా పట్టుకున్నానేమో
సిగ్గుతొ వేళ్లసందుల్లోంచి జారుకుంటయి
ఆ సిగ్గులోనూ నువ్వే కన్పడ్డావులే....


భోరున కురిసినప్పుడల్లా, తెలియని విషయమేదో
కుండలతో ఒంపుతున్నట్టూ.....
నెమ్మదించినప్పుడల్లా ఓదారుస్తున్నట్టూ.....
మొత్తానికి కురిసిన ప్రతిసారీ
ఓ జ్ఞానోదయమైనట్టూ
నా అజ్ఞానాన్నేవరో గుర్తుచేస్తున్నంత వాన

అదే వెన్నెలా, అదే వానా
వెన్నెల్లాంటి వానలా, మనల్ని అనుకరిస్తున్నారా ఏం?
నువ్వేమో వెన్నెలా నేనేమో వాన
నీకేమో కుండల్లో నింపుకోడానికీ
నాకేమో కళ్ళనిండా పర్చుకోడానికీనూ......

ఇలా ఎవరికైనా జరిగేనా
నీకూ నాకు తప్ప...
నేనేమో భూమిని  చుట్టేస్తూ
నువ్వేమో ఆకాశాన్ని చుడుతూ...
ఎన్నాళ్ళయిందనీ ప్రేమనీ ,వొర్షాన్ని,
 నిన్నూ కట్టేసీ...


అన్నింటినీ నీలో చూసుకున్నాకే
నాకో తృప్తి అయింది... 


ఈ వాక్యంలోఏం మాట్లాడవు,  నీ నిశ్శబ్దమే జవాబంటూ
అవునులే నీ ప్రేమకి భాషుండదని
అర్ధమవటానికి జీవితాంతం పడుతుందిలే...
అదే ప్రేమంటే...
ప్రేమ..వర్షం లాంటి ప్రేమ!
నీనా ప్రేమ...
వర్షం అసూయపడే ప్రేమ

                    -----వాసుదేవ్

Saturday, August 25, 2012

మా వోడొస్తాడా?

మా వోడొస్తాడా?
-----------------
సూరీడు సచ్చిపోనాడో, ఇయ్యాల మరి
దాక్కుండీ పోనాడో మేగాలెనకాతల
ఏం సెప్పాడు కాదు వొర్సం గురించి
"వొత్తాదిలేవే, రాకెక్కడికి పోతాది
ఈ మడుసులకి బువ్విచ్చేది మనమే కదే
మరి ఈ వొర్సానికి మనం కావాలి
దానికీ మనం కావాలి యాడికి పోతాదిలే!"
ఆడు సిన్నప్పట్నుంచి  అట్టాగే
ఆటికేసి సూత్తూనే ఉన్నా
ముంతలొలకబోసుకోలేదు
మావ తిడతాడు,,,,అట్టా సెయ్యొద్దని
పొలానికీ నీళ్ళు కావాలే
ఆడికి మందులోకి కావాలే, ఊరుకుంటా
"అవునూ మావా మనకది కావాలే
కానీ దానికీ మనం కావాలంటావా, అదెలాగా?"
"అంటే ఎర్రిమొగమా, దాన్ని మెచ్చుకున్నదే మనం కదే?
సినుకు పెతీ గోళాన్నీ కౌగలించుకుంటానా
పెతీ సినుకునీ మగ్గెగడతానా
గోలాల్లో దాస్తానా, పేమగా
అందులో నన్ను నేను సూసుకుంటాను గదే?
మది దానికి మాత్రం ఎవరున్నారే మనం తప్ప?"
"అవును, మావా! నిజమే
మనకే కాదు, దానికీ మనం కావాలె
నిన్నంతా అలా ఆకసంకేసి సూత్తనే ఉన్నా
ఒక్క సినుకైనా మీ మీద పడిపడితే
నన్ను లాక్కుంటావనుకున్నా..
ఉహూ.. సినుకూ రాలేదు, నువ్వూ ఊ లెయ్యలా!"
"వత్తాదే! రాకెక్కడికి పోతాదే
మనం నమ్ముకున్నాం కదే"
మరి మన సిన్నోడీనీ కూడా నమ్మే కదా మామా
పంపాం పట్నానికి..
పతీ సైకిలూ బెల్లుగంటా కేసి వొత్తాడేమోననీ సూత్తున్నా"
"వాడు, మనకొదుకైనా మనిషే,
వొర్సం, మన కడుపుసించకపోయినా
మడిసికాదే, అదో వరం
అది మోసం సెయ్యదు, మడుసుల్లాగా"
"ఏంటో ఈడూ మడిసే, ఈణ్ణే నమ్ముకున్నా
నాకేటన్యాయం సేసాడు?
నన్నొగ్గలేదే, మరి నా కొడుకేంటో
అమ్మన్నాడు కడుపుతోటి!"
"ఏమే వొత్తావా, మన కొడుకు రాడే
కానీ వొర్సం వొత్తాదే!"
"మరిగంతే గామోసు, ఏటి నమ్మాలో
ఏటి నమ్మకూడదో, ఈ జన్మకి ఆడొస్తేనే కానీ
తెనీదు, మరి గంతే గామోసు!"

Sunday, August 5, 2012

కాంతిని కప్పుకున్న కళ్ళల్లో....!



ఆ కళ్ళు రెండూ--
తియ్యని సంగతులన్నీ దాచుకున్న
తేనెతుట్టల్లా
చరిత్రపుటల్లో ఇమడలేని
నగ్నసత్యాలేవో ఒంపటానికి సిధ్ధం

రవీకౌముదుల జుగల్బందీ విన్యాసానికి
నీ జమిలినేత్రాలు వేదికయ్యాయనుకుంటా
నలుపు నచ్చిందీ అప్పుడె
చీకటిని చుట్టుకున్నదీ అప్పుడే
నాలోంచి నీలోకి మకాం మార్చిందీ అప్పుడె!

కళ్ళంతా నన్నెప్పుడూ నింపుకుని ఉంటావేమొ
పరువాల పొంగుతో పోటీపడుతుంటాయి
అందుకే నిన్ను సైకతశ్రోణీ అని పిల్చుకునేది

మనసు మౌనగీతాలన్నీ
ఆ కనురెప్పల నిశ్శబ్ద తబలాలో విస్పష్టమే!
ప్రేమంతా, ఆ కళ్ళలోనే గూడుకట్టుకుని
కథలన్నీ పేర్చుకుంటున్నట్టు...

ఈ  అందమైన  గిరడకళ్ళకి
వాకిట తలుపుల్లా ఆ రెప్పలూ,
అల్లల్లాడుతూ అవిచెప్పే ఊసులూ
అన్నేసి సీతాకోకచిలుకలు ఆ కళ్ళనుంచి
ఎగరటం చూసుంటే డాంటే ’ఇన్ఫర్నో’ మానేసేవాడేమొ

ద్వారబంధాలకు ముగ్గులేసినట్లున్న
ఆ కనుబొమ్మల సౌందర్యలహరీ  స్ఫురితం
రక్షకభటుల్లా ఆ పక్ష్మములూ
వాటి చివర్న తళుక్కున మెరిసే
వెలుగేదో కావ్యం రాయించకపోదు

ఆ ఒక్క రెప్పపాటు కదూ నాకు ప్రేమ నేర్పిందీ!

వెలుగు రెప్పలకింద దాక్కున్న
రాత్రంతా తాపత్రయమే
నీ కనుసన్నల కాంతినీడలో
రాసుకున్న ఈ అనుభవం
కవితౌతుంది కదూ
నీ కనుదోయి సాక్షిగా....
(ఓ ప్రేమ కవిత రాద్దామనుకున్నప్పుడల్లా ఆమె కళ్ళు వెంటాడుతూనే ఉంటాయి...ఇక తప్పించుకోలేక ఇలా!)
                    వాసుదేవ్ (03.శ్రావణం.12)

Wednesday, July 25, 2012

ఓ మరణం తర్వాత.....

ఓ మరణం తర్వాత.....
ధర్మజుడూ లేడు, యక్షప్రశ్నలూ లేవు
ఓ అగమ్యగోచరం...ఓ దిగులు

ఇవాళ్టి వర్షాన్ని నువు చూడలేదనో
రేపటి సూర్యోదయం నిన్ను తాకదనో.....

మరణాన్నీ ప్రేమించావేమో
అది నీ గుమ్మంలో నిలబడ్డా
అటు ఒత్తిగిలిపడుకోలేకపోయావు
ఉత్తచేతుల పంపలేకపోయావు

నీముఖంలోకి చూడలేక, నిన్ను కబళించలేకా
కాలాన్ని వెంటతెచ్చుకుందటగా
ముఖం చాటేసిన మృత్యువు

ఈ మరణం తర్వాత--నువ్వూ ఓ నిరాకార జ్ఞాపకంలా
మిగిలిపోతావేమో!
విషాదాన్నంతా చీకటి గుడ్డలో మూటకట్టేసాను
బరువైన రాత్రి నాకు తోడుగా---
ఓ ఖాళీ కుర్చీ, ఓ ఖాళీ ఇల్లు
జ్ఞాపకాలన్నీ ఖాళీ చేసాక మిగిలిన గుండెలా!
గడ్డకట్టిన దు:ఖంతో బరువైన కళ్ళు
ఏ కథలూ చెప్పలేకపోయాయి


ప్రతీ మరణం తర్వాతా---
జీవితవాగు దాటుతూ
ఏ మరణమూ వేరుకాదా నీభాషలోనే
చెప్పమన్నా ఆ ఒంటరి కాపర్ని....
విభూదంటిన తన వేళ్ళను
నిట్టూర్పుల తడిలో కడుగుతూ--
ఆత్మ కాల్తున్న ఈ పదకొండురోజులూ
ఈ వాసనుంటుందన్నాడు....మరణం కాలుతున్న వాసన.....
నిష్కామంగా నిష్క్రమించే ఆ నిముషం కోసం
మిగిలే ఉంటాను....
చిల్లుపడిన మొక్కలగోలెంలా.....
ఏం ఇంకిందో....ఏం వొలికిపోయిందో!
    **
ఎంత అందమైన పువ్వైనా వాడిపోకతప్పదన్నట్టు...
కహీ దూర్ జబ్ దిన్ డల్ జాయె....

(కొన్ని మరణాలు జీవితాన్ని ప్రశ్నిస్తాయి, కొన్ని జీవితాన్ని నిర్వచిస్తాయి...మరికొన్ని మనల్ని సమాయత్తపరుస్తాయి...)

Tuesday, July 17, 2012

ఏ వాక్యమూ మరణించదు


మాటకు మరణంలేదు
ఏ వాక్యమూ నశించిపోదు.....

నువ్వు మౌనివో, యోగివో
నీ చుట్టూ నిశ్శబ్ద సమాధి కట్టుకుంటావు
మరణానికెలాగూ భాషలేదు, ఇక జీవితమా
కొన్ని గుర్తులసమ్మేళనమే అని చెప్తూనె ఉంటావు....నిశ్శబ్దంగా!

తెల్లవాడివో, రంగద్దుకున్న అతివాదివో
నువ్వంటించిన ఆ కూ క్లక్స్  క్లాన్ శిలువ
మండుతూనె ఉంది, తెల్లగా! ఏంచెప్పలేక సతమతమవుతూ!

మనిషివో, మరమనిషిలా తయారయ్యావో
కణాన్నీ, క్షణాన్నీ విస్ఫోటిస్తే
వచ్చేది మన మనిషే, జీవం తాడు పేనుకుంటూ......
జెన్‌‌లు, సూఫీలందరూ అదే చెప్పివెళ్ళిపోయారు

ఏ యూదుడవో, యోధుడవో
మనసుల్నీ, మతాల్నీ విడదియ్యలేక ఓడిపోతుంటావు
నీకు తెలియందికాదులే మానవత్వం.....

ఇలియట్‌‌ లీజుకు తీసుకున్న ఓమ్ శాంతి ఓం అన్నా
రుడ్యార్డ్ కిప్లింగ్ కిమ్మన్నా,
ఆ భావమేమీ మరణించదు
ఆ వాక్యమేదీ మరణించదు........

రెండు నగ్నాక్షరాల మధ్య పోరాటంలో
ఓ కవిగద్ద తన్నుకుపోయే బాధలో
భావమేదీ మరణించదు....
అదెప్పుడూ జీవిస్తూనే ఉంటుంది
ఈ కవితల్లొ.....

తత్వవేత్తవో, మానవేత్తవో
మనసుతెల్సుకునే మాటేదైనా చెప్పగలవేమో చూడు

మనిషిగానో, రోబోగానో
ఓ పర్గేషన్ కోసమే, ఓ భావశుధ్ధికోసమో
రాసే వాక్యమేదీ మరణించదు
అవును, ఇక్కడ వాక్యానికి మరణమే లేదు
                 వాసుదేవ్ 17.జూలై.2012

Saturday, June 23, 2012

నువ్వెళ్ళిపోతావ్....

నువ్వెళ్ళిపోతావ్....
(ఓ మాయమైన ఆలోచనకోసం)

నువ్వెళ్ళిపోతావ్......నా సంగీతాన్ని నాకొదిలి

పాళీ చివర్న అక్షరం మురిగిపోతుందన్నా
గొంతుమధ్యలో ఓ భావమేదో వెక్కిళ్ళలా
ఇరుక్కుందన్నా మాయమైతావు,
ఏ తియాన్మెన్ స్క్వేర్‌లోనో, బోగన్ విలియాల్లోనొ
వెతుక్కోమంటూ!

నిశ్శబ్దంలోపల  తవ్వుకుంటున్న సమాధిలోనొ
క్రికెట్ పక్షి చెట్టుకు కొట్టుకుంటూ పిల్చిన పిలుపులోనొ
నువ్వు కన్పడతావనుకున్నా!

అనిద్రలో ఉన్న మందారం
నన్ను కాదని వెళ్ళిపోయిన నిట్టూర్పు
స్వేచ్చని రెక్కల్లో దాచుకున్న పక్షుల కువకువల్లో
                        నీకోసం వెతుకులాట.....

అసంబద్ధపు నీడల్లోనో , అసమంజసపు గుడ్డల్లోనో
ఇరుక్కుపోయింటుందని నిర్లజ్జగా చూస్తుంటా
నా మాయమైన ఆలోచనకోసం....
            నానీడలాంటి ఆలోచనకోసం

ఏచీకటి రాత్రో వొచ్చిపోయిన మిణుగురుపురుగు సిగలో
చీకటితలుపుల్లోంచి తొంగి చూస్తున్న నైట్‌క్వీన్ నవ్వులో
నీ జాడలు వెతుకుతూ...వెతుకుతూ

గడ్డకట్టించే ఆలోచనకోసమొ
ఆకలికి, అసమానతలకి అడ్డంపడే
రక్తం చిందించని శిలువకోసమో!

నా నిరీక్షణ ఇలా
ఈ అస్తవ్యస్త అక్షరాలలో
నా ఆలోచనల వెతుకులాటలో....
                         22. జూన్.2012

Thursday, June 14, 2012

ఏ రెండూ ఒకటికావెందుకనో...


అవును..
ఏదీ రెండోసారి అనుభూతించలేను
ఏరెండు అనుభవాలూ
ఒకే గూడు కట్టుకోలేదు
ఏ రెండు జ్ఞాపకాలూ ఒకే
గుడ్డన కుట్టలేకపోతున్నాడీ దర్జీ

ఏ ఇద్దరీ మరణమూ ఒకటి కాలేదెప్పుటికీ!

నిస్తేజ, నిరాసక్త తెల్లగోడలూ
ఏవేవో కథలు చెప్తుంటాయి, కొత్తవి
చూసిన ప్రతిసారీ...
చిరిగిన ప్రతి క్యాలండర్ పేజీ
తిరగబడని ఓ చరిత్ర పాఠం....
ఎప్పుడూ పాతగా అన్పించదేం?

మనసుతో నడిచిన ఆ రాస్తా
ఎప్పుడూ కొత్తే!
కాలికడ్డం పడిన ఆ గడ్డిపూవూ
ఎప్పుడూ కొత్త కథ చెప్తూనే ఉంటుంది
మంచుకురవలేదనో, తనని తుంచి
నీ జళ్ళో పెట్టలేదనో....వింటూనే ఉంటా
ప్రతిసారీ...మరో కొత్త ఆలోచనకోసం,
ఓ కథకోసం, ఓ కొత్త ఆవేదనకోసం..
నిన్ను కల్సిన ప్రతిసారీ ఓ
కొత్త అనుభవమే...
నీ చీర వెనుక ఆ దాపరికం
నాకెప్పుడూ కొత్తేసుమా!
ఏ రెండు సార్లూ నిరుత్సాహపర్చలేదు

నీతో కల్సిన ప్రతీ సంగమం
కాలంతో కల్సిన ఓ అనుభవం
ఏ రెండూ కలయికలూ ఒకటి కాలేవు
నీ స్పర్శ ఎప్పుడూ నాకు కొత్తే
అద్దంలో నన్ను నేను కొత్తగా వెతుక్కుంటున్నట్లు...
                  07.06.2012

Thursday, June 7, 2012

(సూర్య దినపత్రికలో అచ్చయిన నా కవిత)




నేనూ, నా సముద్రం

ఎక్కడపుట్టిందో, ఎలా పుట్టిందో.....
గుండెల్లోకి చేరుస్తుంటుంది ఓ నిశ్శబ్దాన్ని!
ఏకచేరీలో చూడని
వాయిద్యపరికరాలన్నింటినీ మోసుకొచ్చింది
తనలోనే మోస్తూ, తనే వాయిస్తూ......
పాటమొదల్లోని భీతావహ నిశ్శబ్దం
కొన్ని క్షణాలే....

కంటిబిగువున అదిమిపెట్టలేని దుఃఖంలా
ఫెళ్ళుమన్న గుండె పగిలి రోదించినట్టు
ఉవ్వెత్తున లేచిపడే నిలువెత్తు కెరటం!
వేయి మృదంగాల ఘోషగా ఆరంభమై
శృతిచేసుకుంటున్న సితారలా ఒడ్డుపై వాలిపోతూ.....

ఆలోచనల అల్లరంతా కడుపులోంచి తీసుకొచ్చి వొంపేసేది
జారిపోతున్న కుచ్చెళ్ళని నాపై కుమ్మరించినట్టు 
ఏ రెండుకెరటాలూ వొకేలా ఉండవెందుకని
అడిగినప్పుడల్లా నిస్సహాయంగా వెనకడుగేసింది
బహుశా ఏరెండు కష్టాలూ వొకటి కాదనేమో!

ఇసకమట్టిలో
తన కంటితడీ ఒకేలా ఉండదు
దానివెంటె పరిగెత్తి అలసిపోయి వొచ్చేసేవాణ్ణి
మళ్ళీ నాకునేనే మిగిలానా అని....
అంతలో మళ్ళీ ఓ చిన్న అల
నా పాదాలచుట్టూ, చిన్నపిల్లాడిలా
నాకు ఓదార్పుకోసమన్నట్టు!

సముద్రం స్త్రీ అని అరిచారెవ్వరో దూరంగా
కెరటం వొంపులో అందాన్నే చూసారొ
అలల్లో సుకుమారత్వాన్నే పట్టుకున్నారో.....
అవును--
తెలుపు నలుపుల శబ్దాన్ని
నిశ్శబ్దంగా కలిపేసుకున్న స్త్రీ!

ఆ సంగీతాన్ని నాతోపాటు మోస్తూనే ఉన్నా
నా సొలిలాక్వీలో తనూ ఓ భాగమే
ప్రాణమెక్కుడుందో కాని
ఒళ్ళంతా తెల్లని చిర్నవ్వుతో అదే పలకరింపు
నన్ను దగ్గరకు లాక్కున్నదదే..
నాతోనే, నాలోనే ఉండే
నా సముద్రం!

(వైజాగ్ బీచెప్పుడూ ఓ నోస్టాల్జియే నాకు.....ఎన్నో అనుభూతులు, మరెన్నో జ్ఞాపకాలు. ఆ అలల పాటలు నన్ను తడుపుతూనే ఉంటాయ్, ఆ కెరటాల తుంపరలు ఇంకా నాలో ఎక్కడో తడిగా తగుల్తూనే ఉన్నాయ్)




Sunday, May 27, 2012

తడవని జ్ఞాపకం

1.
కురవకుండానే వెళ్ళిపోయిన మేఘం
ప్రేమలేఖ సగంలో విరిగిపోయిన పాళీ
2.
పరిష్వంగపు కలలో మెలకువ
వెన్నెల రాత్రిలో ఒంటరితనపు అలసట
3.
అమ్మతెచ్చిన ఆరేసిన బట్టల్లో ఆట
జొన్నపొత్తులని కాల్చని నిప్పులపొయ్యి
4.
ఊరొదిలి వెళ్ళిపోతున్న పక్కింటమ్మాయి
ఎవ్వరికీ కన్పడకుండా ఆమె ఊపిన చెయ్యి
5.
అమ్మతో గుడికెళ్ళి శఠగోపంకోసం మారాం
వయసుడిగిన తాటిముంజల్లో వెతుకులాట
6.
 జ్ఞాపకాల సహచర్యం ఓ ఓదార్పు
గుండెకిందచేరిన తడిలా....నాతోనే

Tuesday, May 22, 2012

వర్షం.....!!


వర్షం.....!! 
      నా బయోగ్రాఫర్!!

వర్షం నా బలమైన బలహీనత!
పృధ్వంటే వర్షానికున్న బలహీనతలా...
నువ్వంటే నాకున్న ప్రేమలా.
నేలని చేరే ప్రతీ చినుకు గోళం
నా గుండెలపైనుంచే జారుతున్న భావన!
స్వర్గం నుండి నన్ను పలకరించే కొరియర్ లా!

ఎన్నెన్ని నిండుగోళాలని
అలా నాలా వర్షిస్తూనే ఉన్నయ్
తమ ఆత్మకథని చెప్తున్నట్టు...
వాటిలో వాటికి ఎంత తొందరని
నిన్ను చేరాలనే నా ఆత్రంలా!

ప్రేమాచ్చదన గుండెపై
నగ్నగోళాల  స్వాంతన చినుకులు!
చేయిచాచి అడిగినప్పుడల్లా
ఎన్ని కురిసాయని నా అరచేతిలొ
ప్రేమగా!
నీ ప్రేమలా!

వర్షించినప్పుడల్లా ఓ కన్నీటి వ్యధ
ఓ షెహనాయీ వేదన...
తమ అందచందాలను ఆస్వాదించమన్నట్టు
ఆ ఒంపుసొంపులపైనుంచి
నా దృష్టిని మరల్చలేదెప్పుడూ!

వర్షంలో తడిసీ తడవకుండా
ఓ చేతిని బయటకు చాచినప్పుడల్లా
చూరునుండి భారమైన చుక్కలు
నా జ్ఞాపకపు నీడల్లా.....
ప్రతీ గోళం ఓ కథచెప్తూనే ఉంది
ఓ జ్నాపకాన్ని వొదుల్తూ తమకంగా!

వర్షపు నడుము చుట్టూ నాచేతులు
 ప్రతి బొట్టులో ఓ కొత్త నడుము,
ప్రతీ చుక్క ఓ కొత్తదనం
ప్రతీ నడుమూ
కొత్త భావన, నా కొత్త అనుభూతిలా!

వెండిదారాలుగా నన్ను చుట్టుముట్టేసిన
ప్రతీ ధారా ఓ దృశ్యకావ్యం!
ఎన్ని సార్లని అలా నన్ను నేను
కోల్ఫొయానో నా చేతిని ఆనడుముచుట్టూ
తడుముకుంటూ...

ఎంత నిశ్శబ్దంగా కురుస్తుందనీ
ఒక్కోసారి!!
మనసు బావురుమనప్పుడల్లా
కురిసిన కన్నీటీ బొట్లలా....
ఆ వర్షపు గోళాల్లో కనుమరుగవుతూ
నేను!

ప్రతీ చినుకూ, ప్రతీ గోళం
నన్నూ తడుపుతూనే ఉన్నయ్
నా కన్నీటిని తమలో కలిపేసుకుంటూనే
నా వ్యధని పంచుకుంటూనే ఉన్నయ్!

వర్షం...ఓ అద్భుతం
నా ప్రేమ కహానీలా
వర్షం నా రచయిత్రి
నా సహచరిలా!!

నా కథని రాస్తూనే ఉంటుంది
నా బయోగ్రాఫర్ లా!

                   --వాసుదేవ్
(2012 హంసిని వెబ్ మ్యాగ్ నిర్వహించిన నందననామ ఉగాది కవితలపోటీలో బహుమతి పొందిన కవిత)


Sunday, April 29, 2012

కొన్ని అనుభూతులంతే

కొన్ని అనుభూతులంతే
        కలానికీ కలవరపాటే

జ్వరంలా చుట్టుముట్టేసి
తుఫాను మేఘాల్లా కమ్మేసిపోతుంటాయి
కురవకుండానే!
అప్పుడప్పుడు
ఆకాశాన్ని కోసుకుంటూ మీదపడిన
ఆ నాలుగు వర్షపుచుక్కలూ
గుండెని తడిపి మరీ పలకరింపు!
తడికోసం వెతికిన ఆ రెండు చేతులూ
వెనక్కొస్తుంటాయి చిత్రంగా!

లీలామహల్లో మార్నింగ్ షో,
మట్టివాసన చినుకుల నేపథ్యంగా
ఓ  హాఫ్ చాయ్,
యూనివర్శిటీ లైబ్ర్రరీ సాక్షిగా
ఆకలి సమ్మేళనాలూ,
వెతల వెక్కిళ్ళూ......

కొన్ని మధురానుభూలంతే
రెప్పల్నీ మాట్లాడనియ్యవు
కనుబొమ్మల్నీ కదలనీయవు
మనసుని ఎండగట్టి వదిలేస్తూ..

ఆత్మావలోకనంలో ఆదమరిచినప్పుడల్లా
ఓ మెరుపు!
మనసు కొక్కాలకి వేళ్ళాడుతున్న
ఆశలన్నీ రంగుల్లేని చిత్తరువులే!
ఎగిరిపోవాలన్న అనుభూతే తత్తరపాటు...


 ప్రేమలేఖ ముడతల్ని జాగ్రత్తగా
విప్పుతూన్నప్పడూ,
అదురుతూన్న అధరాలను అందిపుచ్చుకున్నప్పడూ
నీ గుర్తులేవీ తెలియవు!
ఆ రెండుచెక్కిళ్ళనీ ప్రేమగా చేతుల్లోకి
తీసుకున్నప్పడూ అంతే
చాక్లెట్ రేపర్లో  దాక్కున్న ముక్కని
వెతికిపట్టుకున్న చిన్నపిల్లాడిలా
ఎంతో అందమైన అనుభూతి!

ఈ అనుభూతులంతే!

వెన్నెలనీ జేబులో పెట్టుకోనీయవు
వర్షాన్నీ తాగనియ్యవు
ఏ అర్ధరాత్రో ఆర్తిగా
మీదపడ్డ చెయ్యి
వెచ్చని ప్రేమనే అడుగుతోన్నా
అక్కడా మాటలు కరువే!
కలానికీ నాలుక ఎండిపోయిన
అనుభూతే ఇప్పుడూ......
              -------వాసుదేవ్ (౩౦.ఏప్రిల్. 2012)


Saturday, April 21, 2012

ఖాళీ నీడల్లో.....

మీదేహం!
పింగాణీ గుండెలకి
గాజుపూల బొత్తాములతో....
వెన్నెలని తొడుక్కున్న సూర్యుడిలా
ఆ మంటలు దాగిన గుండెలూ
మంచుముక్క ఆపధ్ధర్మపు కర్కశత్వంలా!

మీ మార్మిక దేహం!
తడారిన ఆడతనపు ఆక్రందన
ఓ సగం పైనా.......
నిర్జీవకణాల మగసిరి
సిగ్గెండిన నాభి దిగువగా.....!
తెగించలేనిమౌనం, తెగువతగ్గినమానం
రెండింటితో
మొహంచాటేస్తూ మీరు....

రాయిలా వక్షం,
పరాయిలా మోహం....
మనసుని చాటింపునేస్తూ
మీరు....అర్ధత్వంగా!

ఆలోచనలని చీల్చబోతే
రెప్పల కిందన దాక్కున్న
అక్షరాలన్నింటినీ కప్పేసాయి
కసాయి సంస్కారాలు


చిల్లులుపడ్డ మీ చిర్నవ్వు
మసకలో నవ్వుతూ
వెతుక్కుంటున్న అస్థిత్వం....!

కన్నీటి ఋతుస్రావమేనా
మీకు ప్రతీరాత్రీ?
నెలకు బదులుగా...దినసరి!
మీలోకి చూడొచ్చా?

దేవుణ్ణీ శపిస్తారు
విధినీ వెక్కిరించగలరు
ఇక మిగిలిందేమని
డ్రాయింగు పుస్తకంలోని గీతల్లా
మీ గీత అవగతమా?

జారిపోతున్న పైటలోనూ కర్కశత్వమే!
పలకరించలేని నిస్సహయత.....
అర్ధంకాని దేహ సంశయం

గుండె గీతల్లో ఖేదం
నడుము వంపుల్లో భేదం
మనసు పగుళ్ళలో రోదనం
మీ  ఖాళీనీడల్లో  దైన్యం....

మీ గుండెల్ని చేరుకున్న
నా చేతులు మీ మనసుని
కౌగలించుకోలేకపోతున్నాయి........

జీవన మర్మంలో అర్ధంకాని
దేహమర్మం....మీ ఖాళీ నీడల్లో!
                  -------వాసుదేవ్
( ఈ దేశంలో వీళ్ళెక్కువ. hermafrodites...పైకి మాత్రం చాలా సంతోషంగా కన్పించే వీళ్ళందరూ  బాధాసర్పదష్టులే.... మాలో భాగమై, మాతో సహజీవనమై, జనజీవనస్రవంతిలో అన్యమనస్కంగా మెలుగుతూ ఉండే ఈ సగంజీవులపై ఈ చిన్న రచన. వీళ్ళ గురించి ఆలోచించామని చెప్పడంకోసం, అలాగే బ్యాంకాక్ లో చూసిన లేడీబాయిస్ షో కూడా నేపథ్యంలో పనిచేస్తూనే ఉంది. అక్కడ--థాయ్‌లాండ్ లో వీళ్ళు చాలా ఎక్కువని అందరికీ తెల్సు)

Wednesday, March 14, 2012

మూగవోయిన అక్షరం

అప్పుడప్పుడు నా అక్షరం మొరాయిస్తుంది
మండకుండా---
ప్రతీ అక్షరంలోనూ ఓ ప్రమిద
కొన్ని గుడ్డిగా, కొన్ని దివ్వెగా
కొన్ని అక్షరాలంతే
సిరా చుక్కలుగానే మిగిలిపోతాయి
కన్నీరెండిన కళ్ళలా......

ప్రతీ అక్షరం ఓ ప్రస్థానం
రెండింటిమధ్య ఖాళీ
ఓ ఇరుకు మజిలీ!

ఒక్కోసారి
ఎక్కడో, ఏ కాగితంనుంచో
జారిపోయి
నిరాశ్రయంగా నన్ను వెతుక్కుంటూ
అతుక్కుంటూ....
నా దగ్గిర ఓ కావ్యమౌతుంది.

ఎన్నిపోరాటాలకి ఆయుధమైందని
తిరిగి ఏమివ్వగలిగాను
అందుకేనేమో
అప్పుడప్పుడు
గుండె వెనక దాక్కుంటూ
మౌనంగా రోదిస్తూ
నన్నూ ప్రతిఘటిస్తూ....అలుక్కుపోతుంది

ప్రతీ అక్షరానికి
నువ్వనాధవి కాదన్నది
చివరిమాట కాలేదు

ప్రతీ అక్షరానికి
నా గుండె ఓ గవ్వగది
ముడుచుకుపోతూనే ఉంటుంది
అవసరమైనప్పుడల్లా!
అలా ముడుచుకున్న నా అక్షరాన్ని
ఏ అమానుషమో, అకృత్యమో
నిద్రలేపుతుంది ఉక్కిరిబిక్కిరిగా!
అక్కడే అప్పుడే
అవన్నీ గండికొట్టినట్టుగా
కాగితంపై వచ్చిపడుతుంటాయి
వడగళ్ళవానలా,
నా రక్తాక్షరాలన్నీ!

పాతకాలపు పుస్తకాల్లోంచి
వాసనగా జారిపడుతున్న
అక్షరాలన్నీ
స్పృశించమని అడుగుతున్నట్లే అన్పిస్తాయి!

అక్షరాన్ని
ప్రేమిస్తూనే ఉంటాను
మాట సాయంకోసం అర్ధిస్తూ!
మోదాన్నీ, దుఃఖాన్నీ మోస్తూ
తన ఒళ్ళంతా గాయాలపాలు
నన్నూ మోస్తూనే
మూగవోతూనే ఉంటుంది
నా అక్షరం.......


Saturday, March 10, 2012

ప్రేమార్ణవం


అమ్మపాల రంగు
అవసరం లేకపోయింది
అవసరం....ఆకలయింది
అమ్మకి ప్రేమయింది

నీ ఉచ్ఛాసనిశ్వాసాల శృతిలయలు
జోలపాడుతూనే ఉంటయ్
అవసరం ప్రేమయింది
నీకు మమతానురాగమైంది

గోడక్కొట్టిన క్యాలండర్లా
నీ నడుముచుట్టూ నాచూపులు
నీతో ఈ జన్మాంతరాన్ని సాధించాలని! ప్రేమతో!
పునరుక్తంటూ చీరకొంగుతో
కొట్టినప్పుడల్లా మొహంచాటేసాను
నువ్వే కదాని!
నా రెప్పలల్లార్చడం మర్చిపోయినప్పుడల్లా
సిగ్గుపడ్తూనె కప్పుకుంటావు
లోయలన్నీ...ప్రేమ లోతు నీకేం తెల్సంటావు!

ఆ కనకాంబరం వాడినప్పుడు
ఎంతగొడవచేశావని
ఆ గుడితిన్నెకి జారగిలపడ్తూ
నీ విరహానికి అది వాడిపోయిందంటావు
అప్పుడేగా నీ చెవిలో
గొణిగాను--
ప్రేమతో పొంగిన గుండెలపై వాలనా అని
సిగ్గుపడ్తూ నన్ను లాక్కున్న నీ
చేతివేళ్ళని స్పృశిస్తూ అక్కడే ఉండిపోయానన్న
నీ చూపు గుచ్చుకుంటూనే ఉంది ఇంకా.....

ప్రేమంటె ఇష్టమంటావు
తీరా కౌగలిస్తే
అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూడమంటావు
ప్రేమకిరణాలతో ప్రకృతంతా పర్చుకుంటూ....
నిక్కచ్చిగా ప్రకృతంతా రంగులమయమయితే
మరి ప్రేమ రంగూ?
నీ సిగ్గుల అంబులపొదిలోంచి తీస్కోమంటూ
ఒదిగిపోతూనే ఉంటావు
ప్రేమగా...ప్రేమతో!

Friday, February 17, 2012

ఖర్మ యోగ!


ఎన్ని కన్నీటి స్నానాలని
ఎన్నెన్ని రోదనలని
మనసుని దాటిన ఆవేదనా రాగాలు
జైలు గోడలని తాకిన వేదనా సంఘర్షణలు!
రాత్రికీ పగలుకీ తేడా కోసం వెతికిన
క్షణాలే అన్నీను నా సోలోలో

కలల్ని కోసేసిన తృళ్ళిపాటు
వెంటాడే స్మృతుల గగుర్పాటుతో
జతకల్సిన ఒంటరి రాత్రులు!
ఎవరికెరుకని......!అనుభూతించిన గుండెకి తప్ప....
ఎన్నో జ్నాపకాలు, మరెన్నో ముద్రలు
ఏడు చువ్వల్ని పట్టుకున్న చేతులు
కన్నీళ్ళతో ఇంకిపోయిన బట్టల్ని
అడుగుతూ నేను
నా వెంటే నా నీడ
స్వేఛ్ఛకోసం మారాం చేస్తూ...!

బువ్వరుచికి నాలుక చాచినప్పుడల్లా
నొక్కేసాను ఇది
అమ్మ ముద్ద కాదంటూ!
శ్రావ్య సంగీతమూ అపశృతుల
తాళాలే
బూట్ల శబ్దంలో కల్సిపోయి...!

నా రెక్కల్ని కుట్టేసిన
జైలుగోడల్ని కసిగా
కొట్టిన చేతులు రక్తసిక్తమయ్యాయి
నా కలల్లా....!!!!

ఆశకి నిర్వచనం దొరికిందిక్కడే
ప్రాణం పోసుకున్నదీ ఇక్కడె!
ఆ చతురస్రంలో ఎన్ని చతురతలో
ఎన్నీ గీతలో మరెన్నో గీతా' "సారా"లో

ప్రతీ పక్షీ రెక్కల చప్పుడూ
నా లోని స్వేఛ్ఛా మంటల రగిల్చినవే....
ఒంటరి మనసు
ఎండి కిందపడిన ఎండుటాకులా
ఎగిరిపడ్తూనే ఉంది
స్వేచ్ఛ కోసం...
హద్దుల్లేని స్వేచ్ఛ కోసం!!!
(జైలు జీవితంపై రాయమని మిత్రులు అడిగినమీదట స్పందనగా రాసుకున్నది)

Tuesday, February 14, 2012

"ప్రేమ!"


రెండు నగ్నాక్షరాల మాయ
రెండు మనసుల రసమయ క్రీడ!

జీవితపు శృతిలయల చిత్తరువు
భావలజడుల గ్రాఫిటీ
ప్రేమనిండిన
మనసుగదిగోడలనిండా
ప్రేమామృతపు తేనియతుట్టలే


కలలకీ రంగులద్దీ
మనసుకీ ఉనికినిచ్చి
మనిషితనానికి ఉపిరులూదే
ప్రేమతనం
ఓ కొంటెతనం!
మౌనానికీ అర్ధాన్నిచ్చీ
కళ్ళకీ భాషనిచ్చిన
ప్రేమ
ఓ మతం


ప్రేమ
మనసు సింగారానికి
ఓ కొలమానం
విధాత సృష్టినుంచి ఓ బహుమానం!
ప్రేమ విస్ఫోటనా కాంతి
మనసంతా పరచుకుని
జీవితాంతమూ ప్రవర్ధమానమవుతూనే ఉంటుంది...
జీవితాంతమూ.....

ప్రేమ కి పుట్టినరోజు శుభాకాంక్షలతో........
.14/02/2012

Tuesday, February 7, 2012

చాయాగీత్


ఆ రాత్రి -----
నా కంటి వెలుగునే తన నెల వంకని చేసుకుని
తటిల్లతలా మెరిసి మాయమౌతూ నవ్వుల శశాంక
చీకటి అంచులను మేస్తూ తెల్లగా మెరుస్తున్న
ఈ నైట్ వాచ్మన్....

వెన్నెల వెండి తెరలో నుంచి తొంగి చూస్తూ
‎ మబ్బుల తివాచీపై ఇంద్రధనువులా తన వైభవాన్ని ముద్రిస్తూ ముద్దు కౌముది
పున్నమి పందిరిలో చెక్కిన ఆలోచనా శిల్పాల అద్భుత లల్లబీలతో
‎ అపురూప సుషుప్తలోకి అలవోకగా జారుకుంటూ...నేను!


బద్ధకంగ్గా నా శ్వేత వర్ణపు ఉదయాన్ని ఆవిష్కరిస్తూ....
గొంతులోకి జారబోయే బ్లాక్ కాఫీలో తెల్లటి ముద్దంటి మంచుముక్క
హఠాత్సంఘటనలకి అవాక్కయినట్టు
రెండింటినీ ఆస్వాదిస్తున్నప్పుడు--
‎ బలమైన ఆలోచనా తరంగాల్ని మెత్తగా స్పృశిస్తూ
ఓ హార్న్‌బిల్!


అందాన్ని, ఆనందాన్ని చిన్ని ప్రాణంలో పెట్టి
రంగులేసినట్లు...
తన తెలుపు నలుపు రెక్కల్ని అల్లల్లాడిస్తూ....
ఆకాశాన్ని, మబ్బుల్నీ విడదీస్తున్నట్లు
ఓ అందమైన రంగుల పెయింటింగ్
నలుపు తెలుపుల్లో ఈ హార్న్బిల్!


నీ అందమనే ఎనస్థీషియా నా వెచ్చని లోతుల్లోకి ఎక్కేస్తుంటే
నన్ను నేను కోల్పోయి
‎ నా నలుపు తెలుపు ఆలోచనలని ఒక్క ఉదుటున
వన్నెల వెన్నెలలా మార్చేస్తున్న నిన్ను తలచుకొని
అలా కోల్పోతూ...కోల్పోతూనే ఉన్నా....
‎ నా గుండె గడియారం సవ్వడిస్తున్నంత కాలం
----వాసుదేవ్
(అఫ్సర్ గారి బ్లాగులొ "రాజన్ బాబు గారి తెలుపు-నలుపు కవిత్వం" అనే ఆర్టికల్ కి స్పందనగా రాసుకున్నది)

Sunday, February 5, 2012

"ది డర్టీ పిక్చర్"


"ది డర్టీ పిక్చర్"
ఓ జోగిని స్వగతం

పుట్టినప్పుడు పురిటివాసనన్నారు
ఆడపిల్లేనా అని మూతి ముడిచిన ముదితలు
మరో దేవుడి భార్య పుట్టిందన్నారు
నా చిన్ని నుదుటిరాతా రాస్తూ....
నా డిబ్బి చిల్లరకు మట్టి వాసనన్నారు
అమ్మా! నా డిబ్బి పగులగొట్టనే!

నన్ను పెద్దమనిషని సంబరాలు
పసుపులో పచ్చగా చేసిన దేహం
ఆ రోజు--
నా పావడాలు పసుపు
నా పరుపు పసుపు
నా ఒడలన్నీ పసుపు...

నన్ను పెద్దమనిషనన్న
పెద్ద మనుషుల కుట్ర దాచేశారు
నన్ను
ప్రాయపు పరువాల పందిరన్నారు
పగిలిన గుండెలపై కన్నీళ్ళ పర్యంతమయ్యాను!
ఈ రోజు--
నా కలలు ఎరుపు,
నా కన్నీళ్ళెరుపు
కనురెప్పల క్రింద చీకటీ ఎరుపు
అమ్మా! నా డిబ్బి పగులగొట్టనే.

చాపలు పరిచారు, బలికి సిధ్ధమన్నారు
దేవుడితో పెళ్ళన్నారు
పూజారి మంగళసూత్రం
పటేలు పశుదాహం
చేజారిన పైటనుండి దుమికిన బాల్యం
అమ్మా! నా డిబ్బీ పగులగొట్టనె--

వెన్నెల రాత్రులని శరత్తు దిళ్ళ కెత్తుకున్నాను
మేఘాలంతా రాసుకున్నాను నా కతలు
ఈ విశ్వం ముగిసిన అంచున నాలో నేను
అస్పష్ట కాలచక్రంలో అలుక్కుపోయిన
గడియారపుముళ్ళ మధ్యలో నేను...
కన్నీటి సంద్రాన వెతల పడవలూ
ఓలలాడించుకున్నాను....
అమ్మా! నా డిబ్బీ పగులగొట్టనే.....

నా దేవుడు నన్ను ఆక్రమించుకుంటూనె
గొణిగాడు, సహకరించమంటూ--
ఏ రాత్రి వసంతరాత్రి కాలేదు
ఏ భర్తా మరోసారి రాలేదు
చీకటి కోణాల చెలగాటం!
భంగపడ్డ మానానికి ప్రాణసంకటం.
అమ్మా! నా డిబ్బీ పగులగొట్టనె

జాలరి ఇంట్లోనూ అందమైన అక్వేరియం
అక్కడ చేపపిల్లలకీ ఎంతో మురిపెం
అడక్కుండానే గుప్పెడు ప్రేమస్వంతం
నాకేదీ జీవిత స్వతంత్రం?
అమ్మా! నా డిబ్బీ పగులగొట్టనే.

నన్నూ ’జోగినీ’ అన్నారు
అభద్రతా భవనంలో ’జోగనీ’ మన్నారు
ప్రతి రాత్రి ఓ గాయం, ప్రతీ స్పర్శ ఓ దుస్వప్నం
బావురుమన్న గుండెంతా నిశ్శబ్దనీరవం
కన్నీటిలో కరిగిన కాటుక
నా గాయాలకి లేపనం
గాజుపెంకుల పంజరంలో
నేనూ ఓ జోగినిని
అమ్మా! నాకు దేవుడి మొగుడొద్దే
మనసున్న మనిషే భర్త కావాలి

అమ్మా! నా డిబ్బీ పగిలిపోయిందే
అంతా మట్టివాసనే
ఆఖరికి నా దేహంకూడా
మట్టిముద్దనుంచి మనిషిముద్దలోకి
మళ్ళి మట్టిముద్దలోకి
అమ్మా! నేనూ అమ్మలా పుడతానే
మరోజన్మలో...

Tuesday, January 17, 2012

"తన్హాయి": ప్రేమ నురగల కాపూచ్చినో



నవలలు చదివి చాన్నాళ్ళయింది. అంతర్జాల ఇంద్రజాలంలో ఇరుక్కునిపోయి దశాబ్దకాలంగా పెద్దపుస్తకాలని బుక్‌షెల్ఫ్ కే పరిమితం చేసేసిన ఈ రోజుల్లో ఈ "తన్హాయి"నవల పాత అలవాటుని తిరగతోడినట్టయింది. 70, 80 దశకాల్లో ప్రముఖ(?) రచయిత్రులుండేవారు. అప్పట్లో వారి కథల్నీ, నవలల్ని చదివేవాళ్ళం ఇంక వేరే మార్గంలేక. " మెత్తటి, నల్లటి తారు రోడ్డుమీద విమానం లాంటిపెద్ద కార్లూ, ఓ గొప్పింటి అబ్బాయి ఓ పేదింటి అమ్మాయిని ప్రేమించడం"....కొన్ని మలుపుల తర్వాత అది పెళ్ళిగా పరిణమించడం.ఇలా సా......గేవి అప్పట్లో ఆ నవలలు.ఆ తర్వాత మరికొంతమంది ప్రవేశంతో తెలుగు నవలాప్రపంచంలో చాలా ఆప్షన్స్ ఉండేసరికి పాఠకుడికి ఊపిరిపీల్చుకున్నట్టయింది. కాని "తన్హాయి" కొత్త ఒరవడి.
ప్రేమ.
అత్యంత బలమైన సబ్జెక్ట్ సాహిత్యంలో ఏ ప్రక్రియలోనైనా. ఈ సబ్జెక్ట్ లేని నవలదాదాపు లేనట్టే ఏ సాహిత్యంలో నైనా. అయితే "తన్హాయి" ప్రేమకోసం మాత్రమే ప్రేమగా రాసిన నవల. ఇద్దరు ప్రేమికుల అంతరంగాన్ని ప్రేమ రంగుల్లో ఓ అపురూప బొమ్మగా పెయింట్ చేసి ఆ బొమ్మకి "తన్హాయి" అని మంచి పేరు పెట్టివదిలారు రచయిత్రి. ప్రతీ పదం, ప్రతీ భావన చదివి గుండెల్లో భద్రపర్చుకోవాల్సిన పుస్తకం. భద్రపర్చుకుంటారు కూడా!
ఏం ఉంది ఈ కాఫీలో?
కవయిత్రి నవలా రచయిత్రిగా అవతరించడంలో ఉన్న అడ్వాంటేజి తన్హాయిలొ స్పష్టంగా కన్పిస్తుంది. కల్పనగారికి ఇది మొదటి నవలే అయినా చదువుతున్నంతసేపు ఆమెకి సాహిత్యంతో ఉన్న సాన్నిహిత్యం చాలా పుటల్లో గోచరిస్తుంది. "పోటి పెట్టుకుంటే మిమ్మల్ని గెలవగలిగేంత, మిమ్మల్ని గెలుకోగలిగేంత..." అని, అదే పేజీలో "నేను ప్రేమకి ప్రేమికుణ్ణి" అని కౌశిక్ అన్డం లాంటి వాక్యాలలో రచయిత్రికి భాషపై ఉన్న మమకారం, పదాలతో ఆటాడుకోవటాం వంటివి సుస్పష్టం.ఎంతో సున్నితమైన భావాలని ఇలా చెప్పడం కవిత్వ సాన్నిధ్యంలో ఉన్నవాళ్ళ రచనల్లోనే కన్పడ్డం సహజం. పేజీ 181 లో "ఒంపులు తిరిగిన లోయమీద తన కళ్ళతో ఎవరో అందమైన కార్తీక దీపాలు వెలిగించినట్టయింది. ఆ దీపం వెలుగుకి ఆ లోయంతా జ్వలించింది" లాంటి గొప్ప భావుకత్వపు ప్రకటనలు పుస్తకాన్ని చూసినప్పుడల్లా వెంటాడుతూనే ఉంటాయి.
చాలా పేజీల్లో కన్పించే కొన్ని ఆంగ్ల ఎక్స్‌ప్రెషన్స్, అమెరికా నేపథ్యపు జీవనవిధాన చిత్రీకరణ ద్వారా ఈ నవల టార్గెట్ రీడర్స్‌ని రచయిత్రి ముందే ఫిక్స్ చేసినట్టుగా అన్పిస్తుంది.

పేజీ ఇరవై అయిదు ఈ నవలకి ప్రాణం. కల్హార కౌశిక్‌ల మధ్య ప్రేమాంకురార్పణ జరిగింది ఇక్కడే. ఈ సన్నివేశాన్ని రొమాంటిక్‌‌గా చిత్రీకరించడంలో మళ్ళి రచయిత్రికి తనకవిత్వపు నేపథ్యం పనికొచ్చిందనడంలో సందేహంలేదు. నిజానికి ఈ నవల ఓ ప్రేమ భాండాగారం. మనసు బాగులెనప్పుడు బుక్‌‌షెల్ఫ్ నుండి "తన్హాయి" ని తీసుకుని ఏ పేజీతిప్పి చూసినా కోకొల్లలుగా ప్రేమ కోట్స్ మనల్ని అలరిస్తాయి అందంగా కల్హార లా. ఏ పేజీనుంచైనా మళ్ళి మొదలుపెట్టి ప్రేమసుగంధపు పరిమళాన్ని అస్వాదించొచ్చు.
నాలుగుపాత్రల నాలుగుస్తంభాలాటలో కల్హార పాత్ర ప్రధానమైనదే అయినా ప్రతీ పాత్రకి సమానమైన ప్రాధాన్యత ఇవ్వడమైనది. నాలుగుపాత్రల్లో చైతన్య మానసికంగా బలహీనుడిలా కన్పడితే మోనికా డిఫరెంట్‌గా strong minded గా కన్పడుతుంది. నిజానికి కల్హార పాత్రకి మోనికా ఓ సౌండింగ్ బోర్డ్ గా, కల్హారని ఎలివేట్ చెయ్యటంకోసమే మోనికా క్రియేట్ కాబడిందన్నది స్పష్టం.
కౌశిక్ తన జీవితంలోకి వొచ్చేవరకూ తన తన్హాయిని గుర్తించలేకపోవటం ఒక్కసారిగా మనసు నిండా ప్రేమచేరే సరికి తను ఓ పెళ్ళయిన భారత స్త్రీనన్న విషయం కల్హార అలజడికి కారణాలు. ప్రేమ ఆరాటం, కుటుంబ బాధ్యతల ఆలోచనల మధ్య నలిగిపోతూ భారత స్త్రీ ఏ సమాజంలో ఉన్నా ఎంత విద్యాధికురాలైనా తన లిమిటేషన్స్‌ని దాటి రాలేని క్యారక్టర్ గా కల్హార పాత్ర రూపుదిద్దుకోవటం నవల ప్రధాన ఇతివృత్తం.
కౌశిక్ పాత్రతో ప్రతి పాఠకుడు ఐడెంటిఫై చేసుకునే విధంగా చాలా చతురతో మలిచారు ఆ పాత్రని. ఇక మృదుల మన ఇళ్ళలో కన్పడే తెలివిగా ఆలోచించే అమ్మాయి. ఆమె చైతన్యకి భిన్నంగా ఆలోచించడం ఈ శతాబ్దపు భారత స్త్రీ ఆలోచనా విధానానికి అద్దం...ఆమె నవల్లో తక్కువ కన్పడ్డా మనపై ఆమె ముద్రకేం తక్కువలేదు. ప్రతీ వ్యక్తికి ఈ సమాజంలో తమ చుట్టూ ఉండె చట్రాన్ని అధిగమించే అవకాశం లేదని అక్షరీకరించిన విధానం ఈ నవల చివరివరకూ చదివించేలా చేస్తుంది......తమ చదువు, ఉద్యోగం, జీవనవిధానం ఏ స్థాయిలో ఉన్నా సగటు భారతీయుడు ఎక్కడ ఉన్నా ఇలానే ఉండగలడు. ఉండాలి కూడా అన్న సందేశం చాలా పవర్‌‌ఫుల్ గానే అందిచడంలో రచయిత్రి విజయం సాధించినట్లె...
ప్రతీ నవల ద్వారా మనం ఏదో పొందటానికి రచయితలు మనకి ఏదో ఇచ్చే మెజీషియన్సో, ఋషులో కాదు. అయితే ఒక్క మాట. నవల పూర్తిగా చదివేశాక పుస్తకం మూసేముందు మరోసారి 114 వ పేజీలో ఉన్న చిన్న కవిత "రాత్రి రాలిపోయిన పూలకోసం" చదవండి. మీరు దేనికొసం వెతుకుతున్నారో అవన్నీ దొరుకుతాయి.
సగటు పాఠకుడు ఊహించే మలుపులేమీ లేకపోయినా ముగింపు విషయంలో పాఠకుడూహించిన ట్విస్ట్ లేకపోవడమే ఈ నవలకి పెద్ద ట్విస్ట్. ఇద్దరు పెళ్ళయిన స్త్రీ పురుషుల మధ్య ప్రెమ అంకురించినా ఇంతకంటే జరిగేదేమీ ఉండదని చెప్పడమే రచయిత్రి ఉద్దేశ్యం. అలా ఓపెన్ ఎండెడ్ ముగింపు ముచ్చటైన స్వస్తి.

ఈ స్ట్రాంగ్ కాఫీకేం తక్కువ?
ఏ రచయితా/రచయిత్రీ బాగా రాయటం, రాయకపోవటం వంటివి ఉండవు. ఓ రచనలో మనకి నచ్చినవి, నచ్చని విషయాలో మనకు నచ్చని భాషో ఉండడమే మనకి ఆ రచనపై విమర్శ చేసె అవకాశం ఉంటుందని నిర్వివాదాంశం. "తన్హాయి" లోకూడా రచయిత్రి ఫలానా చోట బాగా రాయలేదనొ నవల ఆద్యంతమూ అత్యద్భుతంగా ఉందనో చెప్పలేం కాని ఇలా కాకుండ ఉంటే రచన ఇంకా బావుండేదనే అభిప్రాయంలో చెప్పాల్సిన విషయాలు:
నవల ఓ రేడియో కథానిక లా ఏకపక్షపు నెరేషన్ లా కాకుండా రచయిత చెప్పదల్చుకున్న విషయాల్లో ఎక్కువభాగం పాత్రల సంభాషణలో చెప్పడమే పాఠకులు కోరుకునేదని నాఅభిప్రాయం. కాని "తన్హాయి"లో చాలా తరచుగా రచయిత్రి పాత్రలకి, పాఠకులకి మధ్యలోకి రావటం తనచెప్పదల్చుకున్న విషయాన్ని అదేపనిగా చెప్పడం కొంత నిరాశ కలిగించిన అంశం. పేజీ 29లో ఎక్కడా సంభాషణ కన్పడదు. అలాగే కొన్ని భాగాలు (ఉదాహరణకు ముప్పై) పూర్తిగా ఓ లెక్చర్‌‌లా అన్పిస్తాయి.నిజానికి ఆ విషయాలన్ని మరేదైనా పాత్రద్వార చెప్పించి ఉంటే.....అలాగే కొన్ని భాగాల్లో పూర్తిగా ఎక్కడ డైలాగుల్లేకూండా రచయిత్రే అంతా చెప్పెయండం, మోతాదుమించిన పాత్రల అంతరంగ విశ్లేషణ వెరసి అప్పుడప్పుడు "ఈ విషయాలన్నీ ఇంతకుముందే చెప్పారు, చదివాం కదా.......ఇంతకీ ముగింపేంటనే" పాఠకుడు ఆలోచిస్తే అందులో అతని తప్పేంలేదన్పిస్తాది.
అలాగే పాఠకుడికి రిలీఫ్ నిచ్చే హాస్యరసాన్ని పూర్తిగా విస్మరించారనే విషయం కూడా తప్పు కాదేమొ....నవల పూర్తిగా సీరియస్ రాగంలో నడిచింది. అసలే పాఠకుడికి తెల్సిన అంశం కావటంతో ఇక నవలని నడిపించే బాధ్యతలో భాగంగా అక్కడక్కడ కొన్ని సరదా సన్నివేశాల అవసరం చాలానె ఉండింది.
కవర్ డిజైనింగ్ లో మరికొంత శ్రధ్దతీసుకోవాల్సిందేమో!

ఏమైనా, రీడింగ్ హ్యాబిట్స్ తరిగిపోతున్న ఈ రోజుల్లో "తన్హాయి" లాంటి మంచి పుస్తకం మళ్ళీ తెలుగు నవలా లోకానికి మంచి సంఖ్యలో పాఠకుల్ని తెచ్చిపెడ్తుందని నా నమ్మకం. మళ్ళీ కల్పనా రెంటాల నుండి మరో పుస్తకం కోసం ఎదురుచూసేలా "తన్హాయి" ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం.