Sunday, April 29, 2012

కొన్ని అనుభూతులంతే

కొన్ని అనుభూతులంతే
        కలానికీ కలవరపాటే

జ్వరంలా చుట్టుముట్టేసి
తుఫాను మేఘాల్లా కమ్మేసిపోతుంటాయి
కురవకుండానే!
అప్పుడప్పుడు
ఆకాశాన్ని కోసుకుంటూ మీదపడిన
ఆ నాలుగు వర్షపుచుక్కలూ
గుండెని తడిపి మరీ పలకరింపు!
తడికోసం వెతికిన ఆ రెండు చేతులూ
వెనక్కొస్తుంటాయి చిత్రంగా!

లీలామహల్లో మార్నింగ్ షో,
మట్టివాసన చినుకుల నేపథ్యంగా
ఓ  హాఫ్ చాయ్,
యూనివర్శిటీ లైబ్ర్రరీ సాక్షిగా
ఆకలి సమ్మేళనాలూ,
వెతల వెక్కిళ్ళూ......

కొన్ని మధురానుభూలంతే
రెప్పల్నీ మాట్లాడనియ్యవు
కనుబొమ్మల్నీ కదలనీయవు
మనసుని ఎండగట్టి వదిలేస్తూ..

ఆత్మావలోకనంలో ఆదమరిచినప్పుడల్లా
ఓ మెరుపు!
మనసు కొక్కాలకి వేళ్ళాడుతున్న
ఆశలన్నీ రంగుల్లేని చిత్తరువులే!
ఎగిరిపోవాలన్న అనుభూతే తత్తరపాటు...


 ప్రేమలేఖ ముడతల్ని జాగ్రత్తగా
విప్పుతూన్నప్పడూ,
అదురుతూన్న అధరాలను అందిపుచ్చుకున్నప్పడూ
నీ గుర్తులేవీ తెలియవు!
ఆ రెండుచెక్కిళ్ళనీ ప్రేమగా చేతుల్లోకి
తీసుకున్నప్పడూ అంతే
చాక్లెట్ రేపర్లో  దాక్కున్న ముక్కని
వెతికిపట్టుకున్న చిన్నపిల్లాడిలా
ఎంతో అందమైన అనుభూతి!

ఈ అనుభూతులంతే!

వెన్నెలనీ జేబులో పెట్టుకోనీయవు
వర్షాన్నీ తాగనియ్యవు
ఏ అర్ధరాత్రో ఆర్తిగా
మీదపడ్డ చెయ్యి
వెచ్చని ప్రేమనే అడుగుతోన్నా
అక్కడా మాటలు కరువే!
కలానికీ నాలుక ఎండిపోయిన
అనుభూతే ఇప్పుడూ......
              -------వాసుదేవ్ (౩౦.ఏప్రిల్. 2012)


6 comments:

  1. కలవరపరిచే అనుభూతులే అయినా ఆనందపరుస్తున్నాయి కదండీ, ఎంజాయ్!:-)

    ReplyDelete
  2. అవును, కొన్ని కలవరంలోనే ఆనందంకూడా కలగలిపి...ధన్యవాదాలు పద్మగారు

    ReplyDelete
  3. ధన్యవాదాలు వనజగారు...

    ReplyDelete
  4. "వెన్నెలనీ జేబులో పెట్టుకోనీయవు ,వర్షాన్నీ తాగనియ్యవు,ఏ అర్ధరాత్రో ఆర్తిగా మీదపడ్డ చెయ్యి
    వెచ్చని ప్రేమనే అడుగుతోన్నా అక్కడా మాటలు కరువే!" ఎంత బాగున్నాయో ఈ లైన్స్... నిజమే కదా!

    ReplyDelete
  5. ధన్యవాదాలు "జలతారువెన్నెల" గారూ...

    ReplyDelete