Wednesday, November 21, 2012

కాలంలో.....ఆమె! గాలంలో నేను!!

1.
నువ్వున్న ఆ క్షణం
కాలంపై ఓ పచ్చబొట్టు
2.
ప్రపంచానిక్కట్టుకున్న వారధిపైనుంచి
అన్నీ ఒంపేసుకుని నన్ను నేను ఖాళీ చేసుకున్నా
తరుముకొస్తున్న
నీ నవ్వుని తురుముకోడానికైనా...
3.
నిద్రలో జోగుతున్న గడియారమేదో
ఉలిక్కిపడి గంటలుకొట్టినట్టు
నువ్వెప్పుడూ నాకో అద్భుతమే సుమా
సముద్రంపై నడిచినట్టూ
గడ్డిపరకల కొసలపైనున్న
మంచుబిందువులతో నీ బొమ్మగీస్తున్నట్టూ

4.
శరత్పూర్ణిమ వెన్నెల్లాంటి చీరని
ఒళ్ళంతా చుట్టుకున్న నిన్ను చూసి
చీకటిగొంగ మేఘాలనడ్డుతెచ్చుకున్నాడంట
ఉదయించటానికి తటపటాయిస్తూ!
5.
ఇదిగో ..
ఇలా--
నీకోసమేం చెప్పలేకపోతున్నానని
మనసు చివుక్కుమన్నప్పుడల్లా
గుండె చుట్టూ విరహ నివురు...
కొత్త క్షణాలను తనలో
బిగించుకున్న కాలమెలాగూ
నీ గురించి చెప్పకమానదు

6.
కరిగిపోయిన ఆ ఘడియలగురించి
విచారమేం లేదులే
ప్రతీదీ ఓ ప్రేమకథనిచ్చి
రాలిపోయినదే నెమలీకలా
7.
మనసు మాటలు చెప్తానని
చుక్కానివైయ్యావు చూడు
అప్పుడె
ప్రేమాక్షరాల రంగులతో
మనసుకుంచె పనితనం
జ్ఞాతమయింది....
నీ ప్రేమా జ్ఞానమైంది

8 comments:

  1. చిత్రంలోని పక్షులజంటంత ముద్దుగా ఉంది మీ కవిత:-)

    ReplyDelete
  2. ఏం నచ్చిందా...అని వెతుకుంతు౦టే ప్రతి వాక్యమూ ముగ్ధమనోహరమే.

    ReplyDelete
  3. @చెప్పాలంటే,
    @సుభ
    @పద్మార్పిత
    @జ్యోతిర్మయి గార్లందరికీ హన్యవాదాలు. అభిమానంగా, క్రమంతప్పకుండా నాబ్లాగ్ సందర్శించి మీ అభిప్రాయాలని రాస్తూండటం నారాతలకి ఓ సార్ధకత.

    ReplyDelete
  4. "సముద్రంపై నడిచినట్టూ
    గడ్డిపరకల కొసలపైనున్న
    మంచుబిందువులతో నీ బొమ్మగీస్తున్నట్టూ"........ ప్రేమ కూడా జ్ఞానాన్నిస్తుందని ఎంత చక్కగా చెప్పారండీ.. కవిత ఆద్యంతం.. ప్రతి పదమూ ప్రేమతో నిండిపోయి ఉంది.. మంచి రచన. అభినందనలు దేవ్‌గారూ...

    ReplyDelete
  5. చాలా బాగుంది వాసుదెవ్ గారు. చాలా లేట్ గా చూసాను

    ReplyDelete
  6. వెన్నెలగారూ మన:స్ఫూర్తి నెనర్లు

    ReplyDelete