Tuesday, May 26, 2015ఇక ఈ నిరీక్షణ చాలు నాన్నా.....!
ఒంటరితనం బాధిస్తుంది నాన్నా
యుధ్ధం గురించి ఏమీ తెలీకుండానే నువ్వూ వెళ్లావన్నది నిజం
జీవితమే యుధ్ధమైనప్పుడు, యుధ్ధంలో యుధ్ధమేంటీ నాన్నా
ఐక్యరాజ్యసమితంటావూ……...అదీ అబద్ధమే
ఐక్యమేలేని సమజాన్నొదిలేసి మరీ ప్రపంచం వైపు పరుగులా ?

నాకిప్పటికే  తెలిసొచ్చిందంటే నీకెప్పుడో తెలిసుండాలి
నువ్విచ్చిన టెడ్డీ బేర్నే ఎందుకలా చూస్తున్నావని అమ్మ అన్నప్పుడల్లా
అక్కడె నువ్వున్నావన్న నిజం నాకు తెలుసని చెప్పాలనిపిస్తుంది.
ఐనా అది అమ్మకి తెలియంది కాదనుకో!

 నాలోనేను మాట్లాడుకోవడమే అమ్మకి తెలీనప్పుడు
ఎవరు ఎవరితో ఎందుకు యుధ్ధం చేస్తున్నారో ఎవరికీ  తెలీని  స్థితి
బుల్లెట్ల న్యాయం......దేహాన్ని మించి మరీ!
ఐనా అమ్మకి తెలియందనిదేముంటుంది?

నీ కంటూ గురిలేని నిర్ణయాలవైపే వెళ్తావని ఆమెలో ఆమె బాధపదే  క్షణాలేన్నో
ఆమెప్పుడూ తన బాధని బయటపెట్టే ప్రయత్నమేదీ  చెయ్యదు
నీ గన్ను గురినెప్పుడూ ఆమె తప్పు పట్టలేదనుకుంటా
కనీసం అక్కడైనా నువ్వు విజయుడవై ఉండాలనే తపన తప్ప
సంతోషానికీ, ఆనందానికీ ఈక్వేషన్ని రాస్తూనే ఉందామె!

ఆమెని ఆమెకొదిలేస్తాను, పాలకోసం ఆకలన్ను
ఆర్తికోసం నిన్నసలే అడగను
ఎందుకంటే,  నాకంటే ఆమెకె నువ్వు కావాల్సిందెక్కువ
వచ్చేయ్ నాన్న, మన స్వేచ్చా ప్రపంచంలోకి
గన్నులొదిలేసి పెన్ను పట్టుకో
బుల్లెట్లొదిలేసి  బుగ్గలు పట్టుకో,గుండెనిండా స్వేచ్చా ఊపిరితో
మనసునిండా మానవత్వంతో  యుధ్దం చెయ్యి  నాన్నా
మన వాళ్లతోనే యుధ్ధంచేయి

Monday, October 28, 2013

ఓ వర్షపు రాత్రి
భళ్ళున చీల్చుకున్న ఆకాశంలోంచి ఊడిపడ్డ ఆరెండు
చినుకులూ చెవిపక్కనుండే పోతున్నాయి
ఓ కథని విప్పుతూ
అంత గొడవేంటని గొణిగాను మనసారా
నిష్కల్మషం గురించనుకుంటా ఆ రణగొణధ్వని
దానికంత చెప్పాలా అని అన్నప్పుడల్లా మళ్ళీ
అదే గొడవ..అదే కథ..మనసు కథనుకుంటా

 గుండెని తడిచెయ్యటానికా అన్నట్లు కురుస్తూ
కాళ్ళకింద చిన్నపిల్లల్లా తిరుగాడుతూ
వానచుక్కలు......
వాటికేం ఇవ్వగలను అన్న బాధా లేకపోలేదు
బోలెడంత శబ్దం చేస్తాయి నిశ్శబ్దంగా…గర్వంగా

ప్రేమంటే వానకి తెల్సినట్టుగా మరిదేనికీ తెలీదనుకుంటా
అదే చెప్పాలంటే మాటపెగలట్లేదు..వాన భాష రాదుగా మరి
గుండె ఎండిపోయినట్లుంది…..ఈ జడివానలో కూడా
నా చిరునామా నేనే వెతుక్కునే పనిపెట్టాయని బాధ తప్ప
ఫిర్యాదేముందని?

ఓ నిష్కామం గురించిన అస్పష్టతే ఎప్పుడూ
వర్షపు గోళాల్లాగనే....బరువుని మోస్తూ తిరుగుతుంటాయిగా
ఏమీ ఆశించకుండానే.....
మరి నా బరువేదో తెలిసేదెప్పుడో
వర్షంతో నేనూ..నాతో నా వర్షమూనూ
ఓ సియామీస్ ట్విన్స్ ....తలదగ్గరో మొలదగ్గరో
కలిసిఉన్నామన్న ఆ క్షణమే
ఓ అద్వైతానందమేమొ...చూడాలి
మనసు నిండాకైనా ఓ మాటొస్తుందేమొ!!

Friday, October 11, 2013

వీడే…. ఆ మాటలన్నీ మోసాడుచిక్కటి రాత్రిలోనూ, పగటి మేఘంలోనూ
మోసాడు... మాట బరువంతా!
పదాల పదునంతా కాపుకాసాడు
మనలోనూ వీడే, మనుషుల్లోనూ వీడే
పొక్కిలి చేసేదీ వీడే, ముగ్గులు వేసేదీ వీడే
వీడే మన మనోడు
మనందరిలోనూ మసలే మనసున్నోడు

మిణుగురు పురుగుల నీడల్లోనూ
రెప్పలకిందటి చీకటిలోనూ వెలుగుతూనే ఉంటాడు
బరువెక్కిన మనసునెప్పుడో ఈదేసాడు

గుండెలో చేరిన చెమ్మని వెన్నమూటలో కట్టేసాకె
దానికి మాటనివ్వలేకపోయానెప్పుడూ....
అప్పుడే వచ్చాడీడు ఓ పదాన్ని వెంటేసుకుని...
నీకెందుకు నేనున్నానంటంటూ....
నాతోనే ఉన్నానంటూ……ఉంటూనే ఉన్నాడు

మాటని మంత్రం చేసి మరీ తప్పుకున్నాడు
అప్పుడు కదా అర్ధమయింది
"ఘోరీలు కట్టేది వీడే...గోడలు కూల్చేది వీడే...."
వీడే నా అద్దం!
నా తరఫున మాట్లాడేది వీడే
వీడి పేరే అక్షరం

Monday, September 9, 2013

ప్రేమా! నీకు జోహార్లు!

కిటికీ రెక్కలపై చినుకు సంతకం
నువ్వొచ్చావనే నమ్మకమైన ఫీల్! అందమైన ఓ అందాజ్
నీ అనుభూతికింత ఎడిక్ట్ అయ్యానన్న తప్పే కానీ
తప్పేముందిలే అన్న పట్టుదలా లేకపోలేదు
***
 రాత్రిని వెన్నెలని కవ్వంతో చిలికితే వచ్చేమాటలన్ని
నీగురించేనన్నదొక్కటీ చాలదూ--
ఇలా రాస్తుండటానికి?
నిన్నూ నన్ను కలిపినవే మాటలేకరువైనా
తీరా నువ్వొచ్చేసరికి మాటలకరువు
ఎప్పుడూ ఉండేదే!
 ***
ఎగిరెగిరిపడే నీ గుండెలకి
సముద్రమూ అసూయపడిందేమొ
నాకేం చెప్పకనే వెనుతిరుగుతుంది…..నీలా
ఏకొద్దిసేపో ఇద్దరిమధ్యా మౌనం
గుండాగినంతపని కొన్ని క్షణాలకి....
ప్రేమ అడుగుల చప్పుడు గుండెలపై సున్నిత మోత
చీరకుచ్చెళ్లకీ సంగీతముంటేనా అని
అనుకోని క్షణముందా....
 ***
నాజూకు వర్షపు చినుకుల పరిమళం
నీగుసగుసలపలకరింపులా...పరిచయమే
కనీసం ఈ క్షణం బంధీ నాలో
నీకోసమేనన్నట్టు...ఓ ప్రేమాక్షరాల బొకె
***
మనసుందని ప్రేమించలేను--మనసే ప్రేమైనప్పుడు
నువ్వు లేవనీ అనుకోలేను--ప్రేమే నువ్వైనప్పుడు

Sunday, August 18, 2013

॥నీలోకి ప్రయాణమింతేనేమో॥


ఆర్టిఫిషియలో....హార్ట్ ఫిషీనో
నువ్వెలాగూ గుంభన మౌనమే....
ప్రేమిస్తూ బయటపడవు....నీ మనసులా
కొన్ని క్షణాలకి మాటలుంటేనా అని అనుకోని క్షణముండదా?
కాఫీడేలో కాపుచ్చినో మీసాలకంటుకుని వేస్టయినట్టు
హఠాత్తైన నీ చనువు ముడుచుకుపోతుందెక్కడో
నీ పెదాల బలంముందు ప్రేమ ఓడిపోతుందేమో

ఆ జడెందుకలా అక్కడె ఆగిపోతుంది.....
అద్వైతానికి సింబలిజంలా ఆ జఘనాల మధ్యన
అక్కణ్ణుంచి ఊహించమంటూ......
తెల్లకాగితంపై సిరా మచ్చలా వదిలేస్తావా ఏం?
నా ఈ చుక్కలన్నీ నీకు గీతంటావేమొ....

థార్న్‌‌డైక్ కండిషనింగ్ గురించి చేపల్నడగాలి నా అక్వేరియంలో!
'వాటిక్కావాల్సినవాటికోసం అవే వస్తాయి'   అన్న థార్న్‌‌డైక్
గోశాలలొ కృష్డుడన్నట్టు గోవులభాష మనకేం తెల్సులే
మరి నీ ప్రేమ భాష నాకు చెప్పేసే పనేం పెట్టుకోవా?
చెప్పీ చెప్పనట్టుగా......ముడెయ్యని కొప్పులానా?

నుదుటచేరిన ఆ రెండు స్వేదబిందువులే
మన ప్రేమ కథ చెప్పకనే చెప్తుంటాయనా....
జీవితంలో ఆ క్షణమే శాశ్వతమన్న నీ కళ్ళలోని ఆ ఆనందం.....
మరో కవితకి కథ కాకూడదన్నదే నీ మనసులోని మాటా?
అదె కన్పడుతోందిలే...ఆ క్షణంలొ ఆ కళ నీ కళ్ళలొ
మాట కందని తడి…

భూమధ్యరేఖలా నీ నడుం చుట్టూ ఆ మొలతాడులా
నేను నీ చుట్టూ ఉంటాననే నీ ప్రేమ…
ఓ అధ్బుత సున్నా! నిహిలిజాన్ని నువ్వూ ఒప్పుకుంటావుగా!


రీఇన్‌ఫోర్స్‌‌మెంట్ టెక్నిక్ నీకు తెల్సినట్లుగా ప్రేమకూ తెలీదనుకుంటా
స్కిన్నర్ ఓడిపోతాడులే నీ ప్రేమ తత్వానికి.....'స్కిన్నర్ బాక్స్' కి ప్రేమ లొంగదుగా
ఏ కండిషనింగ్ ప్రేమ కందదని చెప్పేయనా మరి?

నీలోకి ప్రయాణమింతే....ప్రేమ ప్రయాణం
ఓ ప్రేమ ప్రయాణం….మనసుని నడిపించే అద్భుత ప్రయాణం...
మనిద్దరి మసనుల్లాగనె
ఇలా హఠాత్తుగా ఆపేస్తానని కోపమా
మరి ఇంకెం నీకఖ్ఖర్లేదుగా,  ప్రేమ తప్ప
ఒక్కమాట చెప్పు-- మనసంతా నేనే ఉంటానన్న మాట
ఓ ప్రేమ మాట….జీవితమంతా ఉంటానన్న మాట
నాచివరి ప్రయాణం…..నీ ప్రేమలోకి
                              ----వాసుదేవ్

(ఓ ప్రేమ మానసి అభేదంగా అడిగిన మీదట....)