Sunday, August 18, 2013

॥నీలోకి ప్రయాణమింతేనేమో॥


ఆర్టిఫిషియలో....హార్ట్ ఫిషీనో
నువ్వెలాగూ గుంభన మౌనమే....
ప్రేమిస్తూ బయటపడవు....నీ మనసులా
కొన్ని క్షణాలకి మాటలుంటేనా అని అనుకోని క్షణముండదా?
కాఫీడేలో కాపుచ్చినో మీసాలకంటుకుని వేస్టయినట్టు
హఠాత్తైన నీ చనువు ముడుచుకుపోతుందెక్కడో
నీ పెదాల బలంముందు ప్రేమ ఓడిపోతుందేమో

ఆ జడెందుకలా అక్కడె ఆగిపోతుంది.....
అద్వైతానికి సింబలిజంలా ఆ జఘనాల మధ్యన
అక్కణ్ణుంచి ఊహించమంటూ......
తెల్లకాగితంపై సిరా మచ్చలా వదిలేస్తావా ఏం?
నా ఈ చుక్కలన్నీ నీకు గీతంటావేమొ....

థార్న్‌‌డైక్ కండిషనింగ్ గురించి చేపల్నడగాలి నా అక్వేరియంలో!
'వాటిక్కావాల్సినవాటికోసం అవే వస్తాయి'   అన్న థార్న్‌‌డైక్
గోశాలలొ కృష్డుడన్నట్టు గోవులభాష మనకేం తెల్సులే
మరి నీ ప్రేమ భాష నాకు చెప్పేసే పనేం పెట్టుకోవా?
చెప్పీ చెప్పనట్టుగా......ముడెయ్యని కొప్పులానా?

నుదుటచేరిన ఆ రెండు స్వేదబిందువులే
మన ప్రేమ కథ చెప్పకనే చెప్తుంటాయనా....
జీవితంలో ఆ క్షణమే శాశ్వతమన్న నీ కళ్ళలోని ఆ ఆనందం.....
మరో కవితకి కథ కాకూడదన్నదే నీ మనసులోని మాటా?
అదె కన్పడుతోందిలే...ఆ క్షణంలొ ఆ కళ నీ కళ్ళలొ
మాట కందని తడి…

భూమధ్యరేఖలా నీ నడుం చుట్టూ ఆ మొలతాడులా
నేను నీ చుట్టూ ఉంటాననే నీ ప్రేమ…
ఓ అధ్బుత సున్నా! నిహిలిజాన్ని నువ్వూ ఒప్పుకుంటావుగా!


రీఇన్‌ఫోర్స్‌‌మెంట్ టెక్నిక్ నీకు తెల్సినట్లుగా ప్రేమకూ తెలీదనుకుంటా
స్కిన్నర్ ఓడిపోతాడులే నీ ప్రేమ తత్వానికి.....'స్కిన్నర్ బాక్స్' కి ప్రేమ లొంగదుగా
ఏ కండిషనింగ్ ప్రేమ కందదని చెప్పేయనా మరి?

నీలోకి ప్రయాణమింతే....ప్రేమ ప్రయాణం
ఓ ప్రేమ ప్రయాణం….మనసుని నడిపించే అద్భుత ప్రయాణం...
మనిద్దరి మసనుల్లాగనె
ఇలా హఠాత్తుగా ఆపేస్తానని కోపమా
మరి ఇంకెం నీకఖ్ఖర్లేదుగా,  ప్రేమ తప్ప
ఒక్కమాట చెప్పు-- మనసంతా నేనే ఉంటానన్న మాట
ఓ ప్రేమ మాట….జీవితమంతా ఉంటానన్న మాట
నాచివరి ప్రయాణం…..నీ ప్రేమలోకి
                              ----వాసుదేవ్

(ఓ ప్రేమ మానసి అభేదంగా అడిగిన మీదట....)

3 comments:

  1. వాసుదేవ్ గారు....అసాంతం మొదటి అక్షరం నుండి చివరి వరకూ శ్వాస బిగబట్టి చవిలేలా చేసిన కవితండి ఇది. కవితన కొత్త పంధాలో చెప్పడం మీ స్టైల్. కుడోస్ టు యు

    ReplyDelete
  2. పద్మాజీ మీ ఆత్మీయాక్షరానికి ధన్యవాదాలు.

    ReplyDelete