Saturday, June 23, 2012

నువ్వెళ్ళిపోతావ్....

నువ్వెళ్ళిపోతావ్....
(ఓ మాయమైన ఆలోచనకోసం)

నువ్వెళ్ళిపోతావ్......నా సంగీతాన్ని నాకొదిలి

పాళీ చివర్న అక్షరం మురిగిపోతుందన్నా
గొంతుమధ్యలో ఓ భావమేదో వెక్కిళ్ళలా
ఇరుక్కుందన్నా మాయమైతావు,
ఏ తియాన్మెన్ స్క్వేర్‌లోనో, బోగన్ విలియాల్లోనొ
వెతుక్కోమంటూ!

నిశ్శబ్దంలోపల  తవ్వుకుంటున్న సమాధిలోనొ
క్రికెట్ పక్షి చెట్టుకు కొట్టుకుంటూ పిల్చిన పిలుపులోనొ
నువ్వు కన్పడతావనుకున్నా!

అనిద్రలో ఉన్న మందారం
నన్ను కాదని వెళ్ళిపోయిన నిట్టూర్పు
స్వేచ్చని రెక్కల్లో దాచుకున్న పక్షుల కువకువల్లో
                        నీకోసం వెతుకులాట.....

అసంబద్ధపు నీడల్లోనో , అసమంజసపు గుడ్డల్లోనో
ఇరుక్కుపోయింటుందని నిర్లజ్జగా చూస్తుంటా
నా మాయమైన ఆలోచనకోసం....
            నానీడలాంటి ఆలోచనకోసం

ఏచీకటి రాత్రో వొచ్చిపోయిన మిణుగురుపురుగు సిగలో
చీకటితలుపుల్లోంచి తొంగి చూస్తున్న నైట్‌క్వీన్ నవ్వులో
నీ జాడలు వెతుకుతూ...వెతుకుతూ

గడ్డకట్టించే ఆలోచనకోసమొ
ఆకలికి, అసమానతలకి అడ్డంపడే
రక్తం చిందించని శిలువకోసమో!

నా నిరీక్షణ ఇలా
ఈ అస్తవ్యస్త అక్షరాలలో
నా ఆలోచనల వెతుకులాటలో....
                         22. జూన్.2012

Thursday, June 14, 2012

ఏ రెండూ ఒకటికావెందుకనో...


అవును..
ఏదీ రెండోసారి అనుభూతించలేను
ఏరెండు అనుభవాలూ
ఒకే గూడు కట్టుకోలేదు
ఏ రెండు జ్ఞాపకాలూ ఒకే
గుడ్డన కుట్టలేకపోతున్నాడీ దర్జీ

ఏ ఇద్దరీ మరణమూ ఒకటి కాలేదెప్పుటికీ!

నిస్తేజ, నిరాసక్త తెల్లగోడలూ
ఏవేవో కథలు చెప్తుంటాయి, కొత్తవి
చూసిన ప్రతిసారీ...
చిరిగిన ప్రతి క్యాలండర్ పేజీ
తిరగబడని ఓ చరిత్ర పాఠం....
ఎప్పుడూ పాతగా అన్పించదేం?

మనసుతో నడిచిన ఆ రాస్తా
ఎప్పుడూ కొత్తే!
కాలికడ్డం పడిన ఆ గడ్డిపూవూ
ఎప్పుడూ కొత్త కథ చెప్తూనే ఉంటుంది
మంచుకురవలేదనో, తనని తుంచి
నీ జళ్ళో పెట్టలేదనో....వింటూనే ఉంటా
ప్రతిసారీ...మరో కొత్త ఆలోచనకోసం,
ఓ కథకోసం, ఓ కొత్త ఆవేదనకోసం..
నిన్ను కల్సిన ప్రతిసారీ ఓ
కొత్త అనుభవమే...
నీ చీర వెనుక ఆ దాపరికం
నాకెప్పుడూ కొత్తేసుమా!
ఏ రెండు సార్లూ నిరుత్సాహపర్చలేదు

నీతో కల్సిన ప్రతీ సంగమం
కాలంతో కల్సిన ఓ అనుభవం
ఏ రెండూ కలయికలూ ఒకటి కాలేవు
నీ స్పర్శ ఎప్పుడూ నాకు కొత్తే
అద్దంలో నన్ను నేను కొత్తగా వెతుక్కుంటున్నట్లు...
                  07.06.2012

Thursday, June 7, 2012

(సూర్య దినపత్రికలో అచ్చయిన నా కవిత)




నేనూ, నా సముద్రం

ఎక్కడపుట్టిందో, ఎలా పుట్టిందో.....
గుండెల్లోకి చేరుస్తుంటుంది ఓ నిశ్శబ్దాన్ని!
ఏకచేరీలో చూడని
వాయిద్యపరికరాలన్నింటినీ మోసుకొచ్చింది
తనలోనే మోస్తూ, తనే వాయిస్తూ......
పాటమొదల్లోని భీతావహ నిశ్శబ్దం
కొన్ని క్షణాలే....

కంటిబిగువున అదిమిపెట్టలేని దుఃఖంలా
ఫెళ్ళుమన్న గుండె పగిలి రోదించినట్టు
ఉవ్వెత్తున లేచిపడే నిలువెత్తు కెరటం!
వేయి మృదంగాల ఘోషగా ఆరంభమై
శృతిచేసుకుంటున్న సితారలా ఒడ్డుపై వాలిపోతూ.....

ఆలోచనల అల్లరంతా కడుపులోంచి తీసుకొచ్చి వొంపేసేది
జారిపోతున్న కుచ్చెళ్ళని నాపై కుమ్మరించినట్టు 
ఏ రెండుకెరటాలూ వొకేలా ఉండవెందుకని
అడిగినప్పుడల్లా నిస్సహాయంగా వెనకడుగేసింది
బహుశా ఏరెండు కష్టాలూ వొకటి కాదనేమో!

ఇసకమట్టిలో
తన కంటితడీ ఒకేలా ఉండదు
దానివెంటె పరిగెత్తి అలసిపోయి వొచ్చేసేవాణ్ణి
మళ్ళీ నాకునేనే మిగిలానా అని....
అంతలో మళ్ళీ ఓ చిన్న అల
నా పాదాలచుట్టూ, చిన్నపిల్లాడిలా
నాకు ఓదార్పుకోసమన్నట్టు!

సముద్రం స్త్రీ అని అరిచారెవ్వరో దూరంగా
కెరటం వొంపులో అందాన్నే చూసారొ
అలల్లో సుకుమారత్వాన్నే పట్టుకున్నారో.....
అవును--
తెలుపు నలుపుల శబ్దాన్ని
నిశ్శబ్దంగా కలిపేసుకున్న స్త్రీ!

ఆ సంగీతాన్ని నాతోపాటు మోస్తూనే ఉన్నా
నా సొలిలాక్వీలో తనూ ఓ భాగమే
ప్రాణమెక్కుడుందో కాని
ఒళ్ళంతా తెల్లని చిర్నవ్వుతో అదే పలకరింపు
నన్ను దగ్గరకు లాక్కున్నదదే..
నాతోనే, నాలోనే ఉండే
నా సముద్రం!

(వైజాగ్ బీచెప్పుడూ ఓ నోస్టాల్జియే నాకు.....ఎన్నో అనుభూతులు, మరెన్నో జ్ఞాపకాలు. ఆ అలల పాటలు నన్ను తడుపుతూనే ఉంటాయ్, ఆ కెరటాల తుంపరలు ఇంకా నాలో ఎక్కడో తడిగా తగుల్తూనే ఉన్నాయ్)




Sunday, May 27, 2012

తడవని జ్ఞాపకం

1.
కురవకుండానే వెళ్ళిపోయిన మేఘం
ప్రేమలేఖ సగంలో విరిగిపోయిన పాళీ
2.
పరిష్వంగపు కలలో మెలకువ
వెన్నెల రాత్రిలో ఒంటరితనపు అలసట
3.
అమ్మతెచ్చిన ఆరేసిన బట్టల్లో ఆట
జొన్నపొత్తులని కాల్చని నిప్పులపొయ్యి
4.
ఊరొదిలి వెళ్ళిపోతున్న పక్కింటమ్మాయి
ఎవ్వరికీ కన్పడకుండా ఆమె ఊపిన చెయ్యి
5.
అమ్మతో గుడికెళ్ళి శఠగోపంకోసం మారాం
వయసుడిగిన తాటిముంజల్లో వెతుకులాట
6.
 జ్ఞాపకాల సహచర్యం ఓ ఓదార్పు
గుండెకిందచేరిన తడిలా....నాతోనే

Tuesday, May 22, 2012

వర్షం.....!!


వర్షం.....!! 
      నా బయోగ్రాఫర్!!

వర్షం నా బలమైన బలహీనత!
పృధ్వంటే వర్షానికున్న బలహీనతలా...
నువ్వంటే నాకున్న ప్రేమలా.
నేలని చేరే ప్రతీ చినుకు గోళం
నా గుండెలపైనుంచే జారుతున్న భావన!
స్వర్గం నుండి నన్ను పలకరించే కొరియర్ లా!

ఎన్నెన్ని నిండుగోళాలని
అలా నాలా వర్షిస్తూనే ఉన్నయ్
తమ ఆత్మకథని చెప్తున్నట్టు...
వాటిలో వాటికి ఎంత తొందరని
నిన్ను చేరాలనే నా ఆత్రంలా!

ప్రేమాచ్చదన గుండెపై
నగ్నగోళాల  స్వాంతన చినుకులు!
చేయిచాచి అడిగినప్పుడల్లా
ఎన్ని కురిసాయని నా అరచేతిలొ
ప్రేమగా!
నీ ప్రేమలా!

వర్షించినప్పుడల్లా ఓ కన్నీటి వ్యధ
ఓ షెహనాయీ వేదన...
తమ అందచందాలను ఆస్వాదించమన్నట్టు
ఆ ఒంపుసొంపులపైనుంచి
నా దృష్టిని మరల్చలేదెప్పుడూ!

వర్షంలో తడిసీ తడవకుండా
ఓ చేతిని బయటకు చాచినప్పుడల్లా
చూరునుండి భారమైన చుక్కలు
నా జ్ఞాపకపు నీడల్లా.....
ప్రతీ గోళం ఓ కథచెప్తూనే ఉంది
ఓ జ్నాపకాన్ని వొదుల్తూ తమకంగా!

వర్షపు నడుము చుట్టూ నాచేతులు
 ప్రతి బొట్టులో ఓ కొత్త నడుము,
ప్రతీ చుక్క ఓ కొత్తదనం
ప్రతీ నడుమూ
కొత్త భావన, నా కొత్త అనుభూతిలా!

వెండిదారాలుగా నన్ను చుట్టుముట్టేసిన
ప్రతీ ధారా ఓ దృశ్యకావ్యం!
ఎన్ని సార్లని అలా నన్ను నేను
కోల్ఫొయానో నా చేతిని ఆనడుముచుట్టూ
తడుముకుంటూ...

ఎంత నిశ్శబ్దంగా కురుస్తుందనీ
ఒక్కోసారి!!
మనసు బావురుమనప్పుడల్లా
కురిసిన కన్నీటీ బొట్లలా....
ఆ వర్షపు గోళాల్లో కనుమరుగవుతూ
నేను!

ప్రతీ చినుకూ, ప్రతీ గోళం
నన్నూ తడుపుతూనే ఉన్నయ్
నా కన్నీటిని తమలో కలిపేసుకుంటూనే
నా వ్యధని పంచుకుంటూనే ఉన్నయ్!

వర్షం...ఓ అద్భుతం
నా ప్రేమ కహానీలా
వర్షం నా రచయిత్రి
నా సహచరిలా!!

నా కథని రాస్తూనే ఉంటుంది
నా బయోగ్రాఫర్ లా!

                   --వాసుదేవ్
(2012 హంసిని వెబ్ మ్యాగ్ నిర్వహించిన నందననామ ఉగాది కవితలపోటీలో బహుమతి పొందిన కవిత)


Sunday, April 29, 2012

కొన్ని అనుభూతులంతే

కొన్ని అనుభూతులంతే
        కలానికీ కలవరపాటే

జ్వరంలా చుట్టుముట్టేసి
తుఫాను మేఘాల్లా కమ్మేసిపోతుంటాయి
కురవకుండానే!
అప్పుడప్పుడు
ఆకాశాన్ని కోసుకుంటూ మీదపడిన
ఆ నాలుగు వర్షపుచుక్కలూ
గుండెని తడిపి మరీ పలకరింపు!
తడికోసం వెతికిన ఆ రెండు చేతులూ
వెనక్కొస్తుంటాయి చిత్రంగా!

లీలామహల్లో మార్నింగ్ షో,
మట్టివాసన చినుకుల నేపథ్యంగా
ఓ  హాఫ్ చాయ్,
యూనివర్శిటీ లైబ్ర్రరీ సాక్షిగా
ఆకలి సమ్మేళనాలూ,
వెతల వెక్కిళ్ళూ......

కొన్ని మధురానుభూలంతే
రెప్పల్నీ మాట్లాడనియ్యవు
కనుబొమ్మల్నీ కదలనీయవు
మనసుని ఎండగట్టి వదిలేస్తూ..

ఆత్మావలోకనంలో ఆదమరిచినప్పుడల్లా
ఓ మెరుపు!
మనసు కొక్కాలకి వేళ్ళాడుతున్న
ఆశలన్నీ రంగుల్లేని చిత్తరువులే!
ఎగిరిపోవాలన్న అనుభూతే తత్తరపాటు...


 ప్రేమలేఖ ముడతల్ని జాగ్రత్తగా
విప్పుతూన్నప్పడూ,
అదురుతూన్న అధరాలను అందిపుచ్చుకున్నప్పడూ
నీ గుర్తులేవీ తెలియవు!
ఆ రెండుచెక్కిళ్ళనీ ప్రేమగా చేతుల్లోకి
తీసుకున్నప్పడూ అంతే
చాక్లెట్ రేపర్లో  దాక్కున్న ముక్కని
వెతికిపట్టుకున్న చిన్నపిల్లాడిలా
ఎంతో అందమైన అనుభూతి!

ఈ అనుభూతులంతే!

వెన్నెలనీ జేబులో పెట్టుకోనీయవు
వర్షాన్నీ తాగనియ్యవు
ఏ అర్ధరాత్రో ఆర్తిగా
మీదపడ్డ చెయ్యి
వెచ్చని ప్రేమనే అడుగుతోన్నా
అక్కడా మాటలు కరువే!
కలానికీ నాలుక ఎండిపోయిన
అనుభూతే ఇప్పుడూ......
              -------వాసుదేవ్ (౩౦.ఏప్రిల్. 2012)


Saturday, April 21, 2012

ఖాళీ నీడల్లో.....

మీదేహం!
పింగాణీ గుండెలకి
గాజుపూల బొత్తాములతో....
వెన్నెలని తొడుక్కున్న సూర్యుడిలా
ఆ మంటలు దాగిన గుండెలూ
మంచుముక్క ఆపధ్ధర్మపు కర్కశత్వంలా!

మీ మార్మిక దేహం!
తడారిన ఆడతనపు ఆక్రందన
ఓ సగం పైనా.......
నిర్జీవకణాల మగసిరి
సిగ్గెండిన నాభి దిగువగా.....!
తెగించలేనిమౌనం, తెగువతగ్గినమానం
రెండింటితో
మొహంచాటేస్తూ మీరు....

రాయిలా వక్షం,
పరాయిలా మోహం....
మనసుని చాటింపునేస్తూ
మీరు....అర్ధత్వంగా!

ఆలోచనలని చీల్చబోతే
రెప్పల కిందన దాక్కున్న
అక్షరాలన్నింటినీ కప్పేసాయి
కసాయి సంస్కారాలు


చిల్లులుపడ్డ మీ చిర్నవ్వు
మసకలో నవ్వుతూ
వెతుక్కుంటున్న అస్థిత్వం....!

కన్నీటి ఋతుస్రావమేనా
మీకు ప్రతీరాత్రీ?
నెలకు బదులుగా...దినసరి!
మీలోకి చూడొచ్చా?

దేవుణ్ణీ శపిస్తారు
విధినీ వెక్కిరించగలరు
ఇక మిగిలిందేమని
డ్రాయింగు పుస్తకంలోని గీతల్లా
మీ గీత అవగతమా?

జారిపోతున్న పైటలోనూ కర్కశత్వమే!
పలకరించలేని నిస్సహయత.....
అర్ధంకాని దేహ సంశయం

గుండె గీతల్లో ఖేదం
నడుము వంపుల్లో భేదం
మనసు పగుళ్ళలో రోదనం
మీ  ఖాళీనీడల్లో  దైన్యం....

మీ గుండెల్ని చేరుకున్న
నా చేతులు మీ మనసుని
కౌగలించుకోలేకపోతున్నాయి........

జీవన మర్మంలో అర్ధంకాని
దేహమర్మం....మీ ఖాళీ నీడల్లో!
                  -------వాసుదేవ్
( ఈ దేశంలో వీళ్ళెక్కువ. hermafrodites...పైకి మాత్రం చాలా సంతోషంగా కన్పించే వీళ్ళందరూ  బాధాసర్పదష్టులే.... మాలో భాగమై, మాతో సహజీవనమై, జనజీవనస్రవంతిలో అన్యమనస్కంగా మెలుగుతూ ఉండే ఈ సగంజీవులపై ఈ చిన్న రచన. వీళ్ళ గురించి ఆలోచించామని చెప్పడంకోసం, అలాగే బ్యాంకాక్ లో చూసిన లేడీబాయిస్ షో కూడా నేపథ్యంలో పనిచేస్తూనే ఉంది. అక్కడ--థాయ్‌లాండ్ లో వీళ్ళు చాలా ఎక్కువని అందరికీ తెల్సు)