Tuesday, September 6, 2011



సారీ......సోల్డవుట్!

పచ్చనాకులోనే కాక పండుటాకులోనూ
అందాన్ని చూడగలిగే హృదయానికి
తోడవసరమేలేదు.....


జీవితమంతా వసంతమైనా
మనసుని వర్షంలో తడపటానికి
తటపటాయించని హృదయానికి
ఈతిబాధల వెతలఖ్కర్లేదు......

నువ్వే ఓ స్ఫటికమైనప్పుడు
నీనుండి కిరణాలన్నింటిని
విబ్జియార్ చేసేసినప్పుడూ
నీకు నువ్వే.....నీకు తోడుండలేరెవ్వరు!

ఎర్రకిరణాలకోసం ఏంటా తొందర....
చిక్కని చీకటి నీకాళ్ళ కిందనుంచే
జారిపోతున్నప్పుడూ నిన్ను ఓదార్చలేదెవ్వరూ!


కెలిడియోస్కోప్‌‌లో అందంగా ఒదిగిపోయిన
గాజుముక్కల్లాంటి నీ జ్నాపకాలన్ని వదిలేసి
అమూర్తభావనల్లాంటి నెరసిన జుట్టుని చూసి
బాధపడ్డప్పుడు నువ్వొంటరివే సుమా!


అస్పష్ట ఆత్రాలని అందుకోవాలని
ఆశపడ్డప్పుడల్లా అక్కడ
"సారీ....సోల్డవుట్" బోర్డు చూసి
చిన్నపిల్లాడిలా మొహం వేళ్ళాడేసుకుని
వెనుదిరిగినప్పుడు.....
నీగుండె తడిని తీస్కోడానికి రారెవ్వరు....

నువ్వెదురుచూసే ప్రతీ వాక్యం
గీత అయితే నీకు జీవితానికి
చేతికర్ర దొరికినట్లే......
---వాసుదేవ్

Sunday, August 14, 2011

సన్నజాజుల ముళ్ళు

పకృతి నిట్టూర్పులే ఋతువులని
తెల్సేలా ఏం చెప్పలేదు అమ్మ
నా మనసుకే వొదిలేసుంటుందేమో ఆ పాఠాల్ని.....

కాలం కాటేసిన క్షణాలని
లెక్కేసుకుంటూండగా ముఖంపై
ఓ బలమైన కెరటం
అలజడి చేసిమరీ లాక్కుపోతుంది!
ఫెడీల్మన్న బాధ్యతల కెరటం.....

జీవితపు సముద్రపుఒడ్డున
వొంటరిగా.....అలల్ని అర్ధంచేస్కోలేక అవస్థ...
ఆమె నవ్వు.....నవ్వులోని రిథమ్
అలల్ని, జీవితాన్ని విడమర్చుకున్నా....
అనుబంధాల
అబధ్ధపు నిజాలు
ఆత్మీయతల
నిజపు అబధ్ధాలు!

గడియారపు ముళ్లమధ్య ఇరుక్కున్నప్పటిమాట!

కారణం కోసం ప్రేమించలేను
ప్రేమేకారణమైనప్పుడు....
--------వాసుదేవ్ (14. ఆగస్ట్.2011)



Friday, July 8, 2011

ద్వైతం

ఉఛ్వాస నిశ్వాసాల రోలర్ కోస్టర్‌లో
ద్వైతం కన్పడుతోంది స్పష్టంగా...
నాణానికి చెరోవైపు అతుక్కున్న
రెండు పార్శ్వాల్లా అదే ద్వైతం!
శల్య సారధ్యంలా జీవిత రధానికి
భార్యాభర్తలిద్దరూ ద్వైతమే.
ప్రేమ బండికి
పెళ్లనే రెండు జోడెద్దులు అవసరమే.

అభినందిచ్చే కరతాళానికి
రెండు చేతుల్లా...
ముక్కు సూటిగా పోయే
గడియారపు చేతులూ చేతలూ
ద్వైత సూచకమే!

రిథమ్‌లో దాగున్న అందాన్నంతా
అలవోకగా ఒలకబోస్తూ
కాలగమనాన్ని అందంగా శాసించే
వెలుగురేడు, రేవంతుల దాగుడుమూతలు
ద్వైత సమానమే....!

దేహాన్నంటి పెట్టుకున్న ఆత్మలా--
దేహం, ఆత్మ--రెంటికి రెండూ
ద్వైతానికి నిత్యసూచనంగా....

చివరికి....
ప్రేమ పరిష్వంగానికి రెండు మనసుల
అవసరం ఉన్నట్టు...
అన్నీ ద్వైత గోచరమే.

ద్వైతమే ఈ విశ్వమానవ
ప్రేమతత్వానికి పునాది!!!
------వాసుదేవ్ (08-జూలై-2011)

**బియ్యే చదువుతున్న రోజుల్లో ఈ అద్వైత, ద్వైతాల గురించి నాన్నగారు నాకు చెప్పినప్పుడు నాకు ఎందుకో ద్వైతమే (విశ్వానికి, దేవుడికి భేదముందని చెప్పే సిధ్ధాంతం) నచ్చింది. ఆయన మాత్రం అద్వైతమే(జీవాత్మ పరమాత్మ ఒక్కటే మిగిలినవన్నీ దాని రుపాలే అనే అభిప్రాయం) పైనే నమ్మకం. ఏమో ఇద్దరమూ కరక్టో లేక నేనే తప్పో తెలీదు....ఇప్పుడు నాన్నగారు తన జీవిత చరమాంకంలో మళ్ళి నా అభిప్రాయాన్నడిగారు. నేను మాత్రం ద్వైతమే సరైందన్నాను. దాని ఫలితమే ఈ చిన్న రచన......మీ వాసుదేవ్

Tuesday, June 28, 2011

కోర్కె

మనసు కష్టపడ్డప్పుడల్లా
అదె వేదన...ఒంటరిగా ఉండాలని!
మబ్బును వీడిన వర్షపు చినుకులో
మనసుని తడిపి జీవితపు ఒడ్డున కూర్చున్నా...
ఒంటరితనాన్ని ఆస్వాదిస్తూ!
అమ్మా.....!
ఒకటే బాధ.....మనసుకి నొప్పి
గాలిలా ఒంటరిగా ఉండాలని
స్వేచ్చగా......స్వతంత్రంగా
ఒంటరిగా...........................!
కనీసం ఆలోచన్లనుంచైనా
విడిపోవాలని ఆశించా...
ప్రకృతితోనె మమేకమైన
ఇంధ్రధనుస్సు ప్రత్యక్షమై
మనస్సుని ముద్దాడింది,
తనదీ అదే సమస్యంది.
నాకు తోడయ్యింది....
మళ్ళి అదే విషమం.
ఒంటరిగా ఉండాలనే కోర్కె.
జీవితంలో ఉంటూ
ఈ జీవితానికి దూరంగా.....
ఒంటరిగా!!!!
మనసు గదిలోని
బాంధవ్యాలు మోకాలడ్డాయి
బాధ్యతలు మొట్టికాయించాయి.
ప్రేమతో మనసు బరువెక్కి
వెక్కి...వెక్కి ఎక్కిళ్ళయిమయమయింది!!
అనుభూతించాక మరీ మధనపడ్డాను
ఒంటరినవ్వాలని.....!
తుంటరిమనసు వొప్పుకుంటేనా
ప్రేమతోనే ఉంటానంది...
నా ఈ కోర్కె అలానే ఉండిపోయింది.......
ప్రేమతో....మీ వాసుదేవ్

Saturday, June 18, 2011

కాలంతో మూడుముళ్ళు....


రాత్రి దుప్పటి కప్పుకున్న పగల్ని
చూసినప్పుడల్లా అదే ఆవేదన
బాధ్యతల బరువుతో నిద్రపోలేనని.....

పగటి చీరకట్టుకున్న రోజు
పలకరించినప్పుడూ పలవరింతే!
జీవితసవాళ్ళు గుమ్మానికి
తోరణాలయ్యి వేళ్ళాడుతుంటే!

నిన్నని మూసేసిన నేడు సాక్షాత్కరించినప్పుడు
అదే ఆవేదన, ఏదో ఆందోళన
ఏం సాధించలేదని నిన్న
నన్ను వెక్కిరించినట్టు...!

నిన్న, మొన్న, అటుమొన్న
కాలాన్ని ఖననం చేస్తూ తొందరపాటు,
ప్రేమనైనా సాధించలేదనే తొట్రుపాటు..!

అదే పోరాటం, కాలంతో ఎదురీత
మంచులా కరిగిన మంచిరోజులు
వెన్ను చరిచి "కాలం" వెన్నలాంటివన్నాయి!

మనసు కళ్ళు తెరిచిచూస్తే ఇంకేముంది
బంధాలు, బాంధ్యవ్యాలు బరువెక్కాయి
అనురాగాలు అర్రులుచాసాయి.

కాలంతొ సంధి చేసుకున్నాను
తన నాల్గో పార్శ్వం--
"ప్రేమ" తో మూడుముళ్ళకి ఒప్పించేశాను.
నా ఈ కాలంతో కళ్యాణానికి
మీరందరు నిరంతరం ఆహ్వానితులే.......
మీ వాసుదేవ్ (18.జూన్.2011)

Sunday, May 22, 2011

అక్షర సత్యం

---- వాసుదేవ్


అనుబంధాలన్నీ ధన బంధాలవుతుంటే
అర్ధం కాని బంధాలన్ని ఆర్ద్రమవుతూ....

ఇదే ( ౦ )నా న్యాయమని అడిగినప్పుడల్లా
నిజం మానభంగానికి గురవుతూ.....

ప్రేమిస్తూ, ప్రేమించబడుతూ కూడా
దేవుడి ఉనికిని ప్రశ్నిస్తూ....

జీవన్మరణ చట్రంలో ఇమిడిపోయికూడా
వయసు ప్రగల్భాలకు రంగులద్దేస్తూ........

'నా' నుండి నన్ను నేను విడదీయలేనని తెల్సీ
నాలోనే అన్నీ ఉన్నాయని బతికేస్తూ......

కాలాన్ని, కలాన్ని వెనక్కి తీసుకోలేమని
మనసు ఋతుస్రావంలో ఎండిన రక్తం
ఈ చిన్న జీవితమన్నది

అక్షర సత్యం


Sunday, May 8, 2011

నిన్నటి నాన్న-రేపటి కొడుకు

విలువల వ్యవస్థకి
వలువలు తీసేశాను
నాకైతే ఏం కన్పడలేదు
వయసు వగరు తప్ప!

ఓల్డేజ్ హోమ్‌కెళ్ళి
నాన్నని కలిశా
అదే చిర్నవ్వు, భావగర్భితంగా.......
అదే ఆప్యాయత

ఆయన బ్రతుకుబండి ముందు
నాకొత్త కారేపాటిది?


కారుని మార్చానేమోకానీ
ఆయన్ని ఏమార్చలేనుగా
ఆనందాన్ని నిర్వచించుకోమన్నారు

"తల్లీ, తండ్రీ, భార్యా, పిల్లలు
వీళ్ళందిరీ కంటే
జీవితమే నీకుతోడు
ఆ జీవితాన్ని "అర్ధం" చెయ్యి

జీవితంలో నిండిన
శూన్యానికి రంగులద్దకు"

చలువ కళ్ళద్దాల వెనకచేరిన
వేడికి చలించి
ఆర్ద్రంగా
తన చేతిరుమాలిచ్చారు నాన్న.
జీవితం చిన్నదే
కానీ
జీవితపరమార్ధం గొప్పది.

వెధవది, కల్తీ కన్నీరు
ఉప్పగానైనా లేదు.

* * * * * * * * * *