ఎన్ని కన్నీటి స్నానాలని ఎన్నెన్ని రోదనలని మనసుని దాటిన ఆవేదనా రాగాలు జైలు గోడలని తాకిన వేదనా సంఘర్షణలు! రాత్రికీ పగలుకీ తేడా కోసం వెతికిన క్షణాలే అన్నీను నా సోలోలో
కలల్ని కోసేసిన తృళ్ళిపాటు వెంటాడే స్మృతుల గగుర్పాటుతో జతకల్సిన ఒంటరి రాత్రులు! ఎవరికెరుకని......!అనుభూతించిన గుండెకి తప్ప.... ఎన్నో జ్నాపకాలు, మరెన్నో ముద్రలు ఏడు చువ్వల్ని పట్టుకున్న చేతులు కన్నీళ్ళతో ఇంకిపోయిన బట్టల్ని అడుగుతూ నేను నా వెంటే నా నీడ స్వేఛ్ఛకోసం మారాం చేస్తూ...!
నా రెక్కల్ని కుట్టేసిన జైలుగోడల్ని కసిగా కొట్టిన చేతులు రక్తసిక్తమయ్యాయి నా కలల్లా....!!!!
ఆశకి నిర్వచనం దొరికిందిక్కడే ప్రాణం పోసుకున్నదీ ఇక్కడె! ఆ చతురస్రంలో ఎన్ని చతురతలో ఎన్నీ గీతలో మరెన్నో గీతా' "సారా"లో
ప్రతీ పక్షీ రెక్కల చప్పుడూ నా లోని స్వేఛ్ఛా మంటల రగిల్చినవే.... ఒంటరి మనసు ఎండి కిందపడిన ఎండుటాకులా ఎగిరిపడ్తూనే ఉంది స్వేచ్ఛ కోసం... హద్దుల్లేని స్వేచ్ఛ కోసం!!! (జైలు జీవితంపై రాయమని మిత్రులు అడిగినమీదట స్పందనగా రాసుకున్నది)
జీవితపు శృతిలయల చిత్తరువు భావలజడుల గ్రాఫిటీ ప్రేమనిండిన మనసుగదిగోడలనిండా ప్రేమామృతపు తేనియతుట్టలే
కలలకీ రంగులద్దీ మనసుకీ ఉనికినిచ్చి మనిషితనానికి ఉపిరులూదే ప్రేమతనం ఓ కొంటెతనం! మౌనానికీ అర్ధాన్నిచ్చీ కళ్ళకీ భాషనిచ్చిన ప్రేమ ఓ మతం
ప్రేమ మనసు సింగారానికి ఓ కొలమానం విధాత సృష్టినుంచి ఓ బహుమానం! ప్రేమ విస్ఫోటనా కాంతి మనసంతా పరచుకుని జీవితాంతమూ ప్రవర్ధమానమవుతూనే ఉంటుంది... జీవితాంతమూ.....
ప్రేమ కి పుట్టినరోజు శుభాకాంక్షలతో.........14/02/2012
ఆ రాత్రి ----- నా కంటి వెలుగునే తన నెల వంకని చేసుకుని తటిల్లతలా మెరిసి మాయమౌతూ నవ్వుల శశాంక చీకటి అంచులను మేస్తూ తెల్లగా మెరుస్తున్న ఈ నైట్ వాచ్‌మన్....
వెన్నెల వెండి తెరలో నుంచి తొంగి చూస్తూ మబ్బుల తివాచీపై ఇంద్రధనువులా తన వైభవాన్ని ముద్రిస్తూ ముద్దు కౌముది పున్నమి పందిరిలో చెక్కిన ఆలోచనా శిల్పాల అద్భుత లల్లబీలతో అపురూప సుషుప్తలోకి అలవోకగా జారుకుంటూ...నేను!
బద్ధకంగ్గా నా శ్వేత వర్ణపు ఉదయాన్ని ఆవిష్కరిస్తూ.... గొంతులోకి జారబోయే బ్లాక్ కాఫీలో తెల్లటి ముద్దంటి మంచుముక్క హఠాత్సంఘటనలకి అవాక్కయినట్టు రెండింటినీ ఆస్వాదిస్తున్నప్పుడు-- బలమైన ఆలోచనా తరంగాల్ని మెత్తగా స్పృశిస్తూ ఓ హార్న్‌బిల్!
అందాన్ని, ఆనందాన్ని చిన్ని ప్రాణంలో పెట్టి రంగులేసినట్లు... తన తెలుపు నలుపు రెక్కల్ని అల్లల్లాడిస్తూ.... ఆకాశాన్ని, మబ్బుల్నీ విడదీస్తున్నట్లు ఓ అందమైన రంగుల పెయింటింగ్ నలుపు తెలుపుల్లో ఈ హార్న్‌బిల్!
నీ అందమనే ఎనస్థీషియా నా వెచ్చని లోతుల్లోకి ఎక్కేస్తుంటే నన్ను నేను కోల్పోయి నా నలుపు తెలుపు ఆలోచనలని ఒక్క ఉదుటున వన్నెల వెన్నెలలా మార్చేస్తున్న నిన్ను తలచుకొని అలా కోల్పోతూ...కోల్పోతూనే ఉన్నా.... నా గుండె గడియారం సవ్వడిస్తున్నంత కాలం ----వాసుదేవ్ (అఫ్సర్ గారి బ్లాగులొ "రాజన్ బాబు గారి తెలుపు-నలుపు కవిత్వం" అనే ఆర్టికల్ కి స్పందనగా రాసుకున్నది)
పుట్టినప్పుడు పురిటివాసనన్నారు ఆడపిల్లేనా అని మూతి ముడిచిన ముదితలు మరో దేవుడి భార్య పుట్టిందన్నారు నా చిన్ని నుదుటిరాతా రాస్తూ.... నా డిబ్బి చిల్లరకు మట్టి వాసనన్నారు అమ్మా! నా డిబ్బి పగులగొట్టనే!
నన్ను పెద్దమనిషని సంబరాలు పసుపులో పచ్చగా చేసిన దేహం ఆ రోజు-- నా పావడాలు పసుపు నా పరుపు పసుపు నా ఒడలన్నీ పసుపు...
నన్ను పెద్దమనిషనన్న పెద్ద మనుషుల కుట్ర దాచేశారు నన్ను ప్రాయపు పరువాల పందిరన్నారు పగిలిన గుండెలపై కన్నీళ్ళ పర్యంతమయ్యాను! ఈ రోజు-- నా కలలు ఎరుపు, నా కన్నీళ్ళెరుపు కనురెప్పల క్రింద చీకటీ ఎరుపు అమ్మా! నా డిబ్బి పగులగొట్టనే.
వెన్నెల రాత్రులని శరత్తు దిళ్ళ కెత్తుకున్నాను మేఘాలంతా రాసుకున్నాను నా కతలు ఈ విశ్వం ముగిసిన అంచున నాలో నేను అస్పష్ట కాలచక్రంలో అలుక్కుపోయిన గడియారపుముళ్ళ మధ్యలో నేను... కన్నీటి సంద్రాన వెతల పడవలూ ఓలలాడించుకున్నాను.... అమ్మా! నా డిబ్బీ పగులగొట్టనే.....
నా దేవుడు నన్ను ఆక్రమించుకుంటూనె గొణిగాడు, సహకరించమంటూ-- ఏ రాత్రి వసంతరాత్రి కాలేదు ఏ భర్తా మరోసారి రాలేదు చీకటి కోణాల చెలగాటం! భంగపడ్డ మానానికి ప్రాణసంకటం. అమ్మా! నా డిబ్బీ పగులగొట్టనె
జాలరి ఇంట్లోనూ అందమైన అక్వేరియం అక్కడ చేపపిల్లలకీ ఎంతో మురిపెం అడక్కుండానే గుప్పెడు ప్రేమస్వంతం నాకేదీ జీవిత స్వతంత్రం? అమ్మా! నా డిబ్బీ పగులగొట్టనే.
నన్నూ ’జోగినీ’ అన్నారు అభద్రతా భవనంలో ’జోగనీ’ మన్నారు ప్రతి రాత్రి ఓ గాయం, ప్రతీ స్పర్శ ఓ దుస్వప్నం బావురుమన్న గుండెంతా నిశ్శబ్దనీరవం కన్నీటిలో కరిగిన కాటుక నా గాయాలకి లేపనం గాజుపెంకుల పంజరంలో నేనూ ఓ జోగినిని అమ్మా! నాకు దేవుడి మొగుడొద్దే మనసున్న మనిషే భర్త కావాలి
అమ్మా! నా డిబ్బీ పగిలిపోయిందే అంతా మట్టివాసనే ఆఖరికి నా దేహంకూడా మట్టిముద్దనుంచి మనిషిముద్దలోకి మళ్ళి మట్టిముద్దలోకి అమ్మా! నేనూ అమ్మలా పుడతానే మరోజన్మలో...