
సారీ......సోల్డవుట్!
పచ్చనాకులోనే కాక పండుటాకులోనూ
అందాన్ని చూడగలిగే హృదయానికి
తోడవసరమేలేదు.....
జీవితమంతా వసంతమైనా
మనసుని వర్షంలో తడపటానికి
తటపటాయించని హృదయానికి
ఈతిబాధల వెతలఖ్కర్లేదు......
నువ్వే ఓ స్ఫటికమైనప్పుడు
నీనుండి కిరణాలన్నింటిని
విబ్జియార్ చేసేసినప్పుడూ
నీకు నువ్వే.....నీకు తోడుండలేరెవ్వరు!
ఎర్రకిరణాలకోసం ఏంటా తొందర....
చిక్కని చీకటి నీకాళ్ళ కిందనుంచే
జారిపోతున్నప్పుడూ నిన్ను ఓదార్చలేదెవ్వరూ!
కెలిడియోస్కోప్లో అందంగా ఒదిగిపోయిన
గాజుముక్కల్లాంటి నీ జ్నాపకాలన్ని వదిలేసి
అమూర్తభావనల్లాంటి నెరసిన జుట్టుని చూసి
బాధపడ్డప్పుడు నువ్వొంటరివే సుమా!
అస్పష్ట ఆత్రాలని అందుకోవాలని
ఆశపడ్డప్పుడల్లా అక్కడ
"సారీ....సోల్డవుట్" బోర్డు చూసి
చిన్నపిల్లాడిలా మొహం వేళ్ళాడేసుకుని
వెనుదిరిగినప్పుడు.....
నీగుండె తడిని తీస్కోడానికి రారెవ్వరు....
నువ్వెదురుచూసే ప్రతీ వాక్యం
గీత అయితే నీకు జీవితానికి
చేతికర్ర దొరికినట్లే......
---వాసుదేవ్