Sunday, October 21, 2012

కన్ఫెషన్స్-1

రాత్రిపై నుంచి నడిచొచ్చానా
గుప్పెడంత చీకటినీ తెచ్చుకోలేకపోయాను!
కళ్ళకింద కలలన్నీ కన్నీళ్ళలో
కదులుతూ
కథలుగా మారలేకపోయాయి

ఓ అక్షరంలో కూర్చుని మరొకదాంతో
చెప్పుకుంటూ ఉంటాను
ప్రతీపదం ఓ కన్ఫెషన్ బాక్స్ మరి...

దొర్లుకొస్తున్న ఖాళీ సీసాల్లా కొన్ని జ్ఞాపకాలు
ఖాళీలకి ఫ్రేముకట్టి మరీ మోస్తాయి..
సమాధికాబడని జ్ఞాపకాలు కొన్ని!
తడిసిన కాగితంలోని అలుక్కుపోయిన అక్షరాల్లా
ఈ జ్ఞాపకాలు....

అర్ధంకాని బంధాలేవో
పేపర్ వెయిట్‌‌లా జీవితావేశాన్ని
అదిమిపెడుతుంటాయి
తేమకీ, తడికీ తేడాతెల్సెదెప్పుడు
ఆర్ద్రతెప్పుడో ఆవిరై ఆరిపోయిందిలె

సమాధిలో శవానికి మిత్రుల్లేరన్న
'గాలి' ఊళల్లోని మాటలు కొన్ని చెవిదాటిపోవు
అవును
పిరమిడ్లలోని రాళ్ళేవీ
జీవితతంలోని డొల్లతనాన్నీ నింపలేవు
నా దృష్టినీ అడ్డుపెట్టలేవు
అయినా ఏం చూస్తున్నానని?

రాత్రికట్టుకున్న నల్లచీరలాంటి చీకటీ
సంద్రాన్నంతా కప్పేసుకున్న అలలనురగల్లోని తెలుపూ
రంగులన్నింటినీ తమలోకి లాగేసుకుంటే
ఇక నాకేం మిగిలిందని....?
కన్నీటి రంగుతప్ప!

అరువుతెచ్చుకున్న మేధోతనమేదీ నిలబడదు
చిన్న ఒంటికి పెద్ద అంగీలా
అసహజంగా, అసమానంగా....

అటో ఇటో ఎటో
ఎటూకానీ అవస్థాంతరం
ఈ నడివయసు!
విస్తరించుకుంటున్న శూన్యత
ఆఖరికి ఈ పాపనివేదన గదిలోనూ...

Thursday, October 11, 2012

దైవమిచ్చిన భార్య

నువ్వు ప్రేమించావన్న ఆ క్షణం
మరీ బరువెక్కింది గర్వంతో!
ఆ ముందు క్షణాలన్నీ కాలిబూడిదయ్యాయి.
ఆ గతకాలపు కుప్పలోంచి
ఏ ఫినిక్స్ లేస్తుందో నీ ప్రేమని చూపిస్తూ!
*
"నేనున్నాను, నీవల్లే"
అని అనుకోవడం మాములుగా జరగదు
నువ్వున్నా లేకున్నా ఇక
ప్రేమరాహిత్యం ఉండదు, జీవితాంతం!

* *
'నువ్వ’ నే అద్దంలో నా అహం
కన్పడుతూనే ఉంటోంది, మండుతూ
నా మనసుకీ, నీ ప్రేమకీ మధ్య
ఈ బైరాగత్వం ఉంటూనే ఉంటూందిలె
బైరాగత్వం...ఉంటుందిలే, నీ తోడులో కూడా
నీకు లొంగిపోని ఆ క్షణమేదీ నాకఖ్ఖర్లేదు!
* * *
నీతో కల్సినప్పుడల్లా నీనుండి నాలోకి ప్రవహించే
ఆ ప్రేమనాపె శక్తి నాకులేదేమొ!
ప్రేమంటే చెప్పే నీ చేతలన్నీ ముద్దొస్తాయని
చెప్పేటప్పుడల్లా నీలోకి చూళ్ళేకపోయాను
మనసు పొగిలినప్పుడల్లా
నీ ఒడి నాకు ఆశ్రమవుతుంది
నీ మనసు నాకు నీడవుతుంది
నీ గుసగుసలన్నీ నాకో శబ్దమంజరి!

* * *
నీ గుండెలయంతా ప్రేమపాటన్నావు
తిరిగేమివ్వాలో...ఎప్పటికీ స్పందించలేను
కంటిమీద రెప్ప అసూయపడిందేమో
కునుకు లేదు...ఆ ఏక్ పల్ కోసం!
నిన్ను కప్పుకున్న ఆ క్షణం
గాలికూడా బెదిరిపోయింది సుమా
చెదిరిపోయిన కలలన్నీ
ఓ మూల చేరాయి దిగులుగా
వాటికి నీలాంటి భాగస్వామి లేదుగా!
* * * *
వాచ్ స్ప్రింగ్ లోంచి బయటపడ్డ మాటలు
నీ దగ్గరే ఆగిపోతాయి, చిత్రంగా!
అర్ధరాత్రి నువ్వనే 'నాన్నా'
ఎంత బరువనీ...నెనొక్కణ్ణే మోస్తానుగా
నిముషాల గోడలమీద
పర్చుకున్న క్షణాలన్నీ
గొంతెత్తి అరిచినట్టు, నువ్వు
ప్రేమిస్తున్నానంటూనే ఉంటావు!

* * * * *
జీవితంలో ప్రతీక్షణం తోడుంటానని
మనసుదాటని మాటల్ని
నీ నుదుటిపై సింధూరం
చెప్పకనే చెప్తుంటయి, నాతో ఉన్నానంటూ!
అదిగో అప్పుడె మాటల్లో చెప్పలేక
నీ గుండెలపై చేయేస్తానా, దానికి
ప్రేమనే ముద్రేస్తావు.
నువ్వు నువ్వె..ఎప్పుడూ నిన్ను చూసి
ప్రేమ అసూయపడాల్సిందే....
(దేహానికి బాధ కలిగినప్పుడల్లా 'అమ్మా' అని,  మనసుకి ముల్లు గుచ్చుకున్నప్పుడల్లా 'అమ్మలూ' అని ప్రేమగా పిల్చుకునే మనకి జీవిత భాగస్వామి ఓ వరం..ఆ ప్రేమమూర్తులైన దైవమిచ్చిన భార్యకి ఇది.... )