Saturday, June 23, 2012

నువ్వెళ్ళిపోతావ్....

నువ్వెళ్ళిపోతావ్....
(ఓ మాయమైన ఆలోచనకోసం)

నువ్వెళ్ళిపోతావ్......నా సంగీతాన్ని నాకొదిలి

పాళీ చివర్న అక్షరం మురిగిపోతుందన్నా
గొంతుమధ్యలో ఓ భావమేదో వెక్కిళ్ళలా
ఇరుక్కుందన్నా మాయమైతావు,
ఏ తియాన్మెన్ స్క్వేర్‌లోనో, బోగన్ విలియాల్లోనొ
వెతుక్కోమంటూ!

నిశ్శబ్దంలోపల  తవ్వుకుంటున్న సమాధిలోనొ
క్రికెట్ పక్షి చెట్టుకు కొట్టుకుంటూ పిల్చిన పిలుపులోనొ
నువ్వు కన్పడతావనుకున్నా!

అనిద్రలో ఉన్న మందారం
నన్ను కాదని వెళ్ళిపోయిన నిట్టూర్పు
స్వేచ్చని రెక్కల్లో దాచుకున్న పక్షుల కువకువల్లో
                        నీకోసం వెతుకులాట.....

అసంబద్ధపు నీడల్లోనో , అసమంజసపు గుడ్డల్లోనో
ఇరుక్కుపోయింటుందని నిర్లజ్జగా చూస్తుంటా
నా మాయమైన ఆలోచనకోసం....
            నానీడలాంటి ఆలోచనకోసం

ఏచీకటి రాత్రో వొచ్చిపోయిన మిణుగురుపురుగు సిగలో
చీకటితలుపుల్లోంచి తొంగి చూస్తున్న నైట్‌క్వీన్ నవ్వులో
నీ జాడలు వెతుకుతూ...వెతుకుతూ

గడ్డకట్టించే ఆలోచనకోసమొ
ఆకలికి, అసమానతలకి అడ్డంపడే
రక్తం చిందించని శిలువకోసమో!

నా నిరీక్షణ ఇలా
ఈ అస్తవ్యస్త అక్షరాలలో
నా ఆలోచనల వెతుకులాటలో....
                         22. జూన్.2012

Thursday, June 14, 2012

ఏ రెండూ ఒకటికావెందుకనో...


అవును..
ఏదీ రెండోసారి అనుభూతించలేను
ఏరెండు అనుభవాలూ
ఒకే గూడు కట్టుకోలేదు
ఏ రెండు జ్ఞాపకాలూ ఒకే
గుడ్డన కుట్టలేకపోతున్నాడీ దర్జీ

ఏ ఇద్దరీ మరణమూ ఒకటి కాలేదెప్పుటికీ!

నిస్తేజ, నిరాసక్త తెల్లగోడలూ
ఏవేవో కథలు చెప్తుంటాయి, కొత్తవి
చూసిన ప్రతిసారీ...
చిరిగిన ప్రతి క్యాలండర్ పేజీ
తిరగబడని ఓ చరిత్ర పాఠం....
ఎప్పుడూ పాతగా అన్పించదేం?

మనసుతో నడిచిన ఆ రాస్తా
ఎప్పుడూ కొత్తే!
కాలికడ్డం పడిన ఆ గడ్డిపూవూ
ఎప్పుడూ కొత్త కథ చెప్తూనే ఉంటుంది
మంచుకురవలేదనో, తనని తుంచి
నీ జళ్ళో పెట్టలేదనో....వింటూనే ఉంటా
ప్రతిసారీ...మరో కొత్త ఆలోచనకోసం,
ఓ కథకోసం, ఓ కొత్త ఆవేదనకోసం..
నిన్ను కల్సిన ప్రతిసారీ ఓ
కొత్త అనుభవమే...
నీ చీర వెనుక ఆ దాపరికం
నాకెప్పుడూ కొత్తేసుమా!
ఏ రెండు సార్లూ నిరుత్సాహపర్చలేదు

నీతో కల్సిన ప్రతీ సంగమం
కాలంతో కల్సిన ఓ అనుభవం
ఏ రెండూ కలయికలూ ఒకటి కాలేవు
నీ స్పర్శ ఎప్పుడూ నాకు కొత్తే
అద్దంలో నన్ను నేను కొత్తగా వెతుక్కుంటున్నట్లు...
                  07.06.2012

Thursday, June 7, 2012

(సూర్య దినపత్రికలో అచ్చయిన నా కవిత)




నేనూ, నా సముద్రం

ఎక్కడపుట్టిందో, ఎలా పుట్టిందో.....
గుండెల్లోకి చేరుస్తుంటుంది ఓ నిశ్శబ్దాన్ని!
ఏకచేరీలో చూడని
వాయిద్యపరికరాలన్నింటినీ మోసుకొచ్చింది
తనలోనే మోస్తూ, తనే వాయిస్తూ......
పాటమొదల్లోని భీతావహ నిశ్శబ్దం
కొన్ని క్షణాలే....

కంటిబిగువున అదిమిపెట్టలేని దుఃఖంలా
ఫెళ్ళుమన్న గుండె పగిలి రోదించినట్టు
ఉవ్వెత్తున లేచిపడే నిలువెత్తు కెరటం!
వేయి మృదంగాల ఘోషగా ఆరంభమై
శృతిచేసుకుంటున్న సితారలా ఒడ్డుపై వాలిపోతూ.....

ఆలోచనల అల్లరంతా కడుపులోంచి తీసుకొచ్చి వొంపేసేది
జారిపోతున్న కుచ్చెళ్ళని నాపై కుమ్మరించినట్టు 
ఏ రెండుకెరటాలూ వొకేలా ఉండవెందుకని
అడిగినప్పుడల్లా నిస్సహాయంగా వెనకడుగేసింది
బహుశా ఏరెండు కష్టాలూ వొకటి కాదనేమో!

ఇసకమట్టిలో
తన కంటితడీ ఒకేలా ఉండదు
దానివెంటె పరిగెత్తి అలసిపోయి వొచ్చేసేవాణ్ణి
మళ్ళీ నాకునేనే మిగిలానా అని....
అంతలో మళ్ళీ ఓ చిన్న అల
నా పాదాలచుట్టూ, చిన్నపిల్లాడిలా
నాకు ఓదార్పుకోసమన్నట్టు!

సముద్రం స్త్రీ అని అరిచారెవ్వరో దూరంగా
కెరటం వొంపులో అందాన్నే చూసారొ
అలల్లో సుకుమారత్వాన్నే పట్టుకున్నారో.....
అవును--
తెలుపు నలుపుల శబ్దాన్ని
నిశ్శబ్దంగా కలిపేసుకున్న స్త్రీ!

ఆ సంగీతాన్ని నాతోపాటు మోస్తూనే ఉన్నా
నా సొలిలాక్వీలో తనూ ఓ భాగమే
ప్రాణమెక్కుడుందో కాని
ఒళ్ళంతా తెల్లని చిర్నవ్వుతో అదే పలకరింపు
నన్ను దగ్గరకు లాక్కున్నదదే..
నాతోనే, నాలోనే ఉండే
నా సముద్రం!

(వైజాగ్ బీచెప్పుడూ ఓ నోస్టాల్జియే నాకు.....ఎన్నో అనుభూతులు, మరెన్నో జ్ఞాపకాలు. ఆ అలల పాటలు నన్ను తడుపుతూనే ఉంటాయ్, ఆ కెరటాల తుంపరలు ఇంకా నాలో ఎక్కడో తడిగా తగుల్తూనే ఉన్నాయ్)