Sunday, April 29, 2012

కొన్ని అనుభూతులంతే

కొన్ని అనుభూతులంతే
        కలానికీ కలవరపాటే

జ్వరంలా చుట్టుముట్టేసి
తుఫాను మేఘాల్లా కమ్మేసిపోతుంటాయి
కురవకుండానే!
అప్పుడప్పుడు
ఆకాశాన్ని కోసుకుంటూ మీదపడిన
ఆ నాలుగు వర్షపుచుక్కలూ
గుండెని తడిపి మరీ పలకరింపు!
తడికోసం వెతికిన ఆ రెండు చేతులూ
వెనక్కొస్తుంటాయి చిత్రంగా!

లీలామహల్లో మార్నింగ్ షో,
మట్టివాసన చినుకుల నేపథ్యంగా
ఓ  హాఫ్ చాయ్,
యూనివర్శిటీ లైబ్ర్రరీ సాక్షిగా
ఆకలి సమ్మేళనాలూ,
వెతల వెక్కిళ్ళూ......

కొన్ని మధురానుభూలంతే
రెప్పల్నీ మాట్లాడనియ్యవు
కనుబొమ్మల్నీ కదలనీయవు
మనసుని ఎండగట్టి వదిలేస్తూ..

ఆత్మావలోకనంలో ఆదమరిచినప్పుడల్లా
ఓ మెరుపు!
మనసు కొక్కాలకి వేళ్ళాడుతున్న
ఆశలన్నీ రంగుల్లేని చిత్తరువులే!
ఎగిరిపోవాలన్న అనుభూతే తత్తరపాటు...


 ప్రేమలేఖ ముడతల్ని జాగ్రత్తగా
విప్పుతూన్నప్పడూ,
అదురుతూన్న అధరాలను అందిపుచ్చుకున్నప్పడూ
నీ గుర్తులేవీ తెలియవు!
ఆ రెండుచెక్కిళ్ళనీ ప్రేమగా చేతుల్లోకి
తీసుకున్నప్పడూ అంతే
చాక్లెట్ రేపర్లో  దాక్కున్న ముక్కని
వెతికిపట్టుకున్న చిన్నపిల్లాడిలా
ఎంతో అందమైన అనుభూతి!

ఈ అనుభూతులంతే!

వెన్నెలనీ జేబులో పెట్టుకోనీయవు
వర్షాన్నీ తాగనియ్యవు
ఏ అర్ధరాత్రో ఆర్తిగా
మీదపడ్డ చెయ్యి
వెచ్చని ప్రేమనే అడుగుతోన్నా
అక్కడా మాటలు కరువే!
కలానికీ నాలుక ఎండిపోయిన
అనుభూతే ఇప్పుడూ......
              -------వాసుదేవ్ (౩౦.ఏప్రిల్. 2012)


Saturday, April 21, 2012

ఖాళీ నీడల్లో.....

మీదేహం!
పింగాణీ గుండెలకి
గాజుపూల బొత్తాములతో....
వెన్నెలని తొడుక్కున్న సూర్యుడిలా
ఆ మంటలు దాగిన గుండెలూ
మంచుముక్క ఆపధ్ధర్మపు కర్కశత్వంలా!

మీ మార్మిక దేహం!
తడారిన ఆడతనపు ఆక్రందన
ఓ సగం పైనా.......
నిర్జీవకణాల మగసిరి
సిగ్గెండిన నాభి దిగువగా.....!
తెగించలేనిమౌనం, తెగువతగ్గినమానం
రెండింటితో
మొహంచాటేస్తూ మీరు....

రాయిలా వక్షం,
పరాయిలా మోహం....
మనసుని చాటింపునేస్తూ
మీరు....అర్ధత్వంగా!

ఆలోచనలని చీల్చబోతే
రెప్పల కిందన దాక్కున్న
అక్షరాలన్నింటినీ కప్పేసాయి
కసాయి సంస్కారాలు


చిల్లులుపడ్డ మీ చిర్నవ్వు
మసకలో నవ్వుతూ
వెతుక్కుంటున్న అస్థిత్వం....!

కన్నీటి ఋతుస్రావమేనా
మీకు ప్రతీరాత్రీ?
నెలకు బదులుగా...దినసరి!
మీలోకి చూడొచ్చా?

దేవుణ్ణీ శపిస్తారు
విధినీ వెక్కిరించగలరు
ఇక మిగిలిందేమని
డ్రాయింగు పుస్తకంలోని గీతల్లా
మీ గీత అవగతమా?

జారిపోతున్న పైటలోనూ కర్కశత్వమే!
పలకరించలేని నిస్సహయత.....
అర్ధంకాని దేహ సంశయం

గుండె గీతల్లో ఖేదం
నడుము వంపుల్లో భేదం
మనసు పగుళ్ళలో రోదనం
మీ  ఖాళీనీడల్లో  దైన్యం....

మీ గుండెల్ని చేరుకున్న
నా చేతులు మీ మనసుని
కౌగలించుకోలేకపోతున్నాయి........

జీవన మర్మంలో అర్ధంకాని
దేహమర్మం....మీ ఖాళీ నీడల్లో!
                  -------వాసుదేవ్
( ఈ దేశంలో వీళ్ళెక్కువ. hermafrodites...పైకి మాత్రం చాలా సంతోషంగా కన్పించే వీళ్ళందరూ  బాధాసర్పదష్టులే.... మాలో భాగమై, మాతో సహజీవనమై, జనజీవనస్రవంతిలో అన్యమనస్కంగా మెలుగుతూ ఉండే ఈ సగంజీవులపై ఈ చిన్న రచన. వీళ్ళ గురించి ఆలోచించామని చెప్పడంకోసం, అలాగే బ్యాంకాక్ లో చూసిన లేడీబాయిస్ షో కూడా నేపథ్యంలో పనిచేస్తూనే ఉంది. అక్కడ--థాయ్‌లాండ్ లో వీళ్ళు చాలా ఎక్కువని అందరికీ తెల్సు)